కాంగ్రెస్ అవినీతికి ‘ఆప్’ ప్రోత్సాహం
Published Mon, Jan 6 2014 10:37 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అవినీతి, ధరల పెరుగుదల వంటి కీలక అంశాలను పక్కనబెట్టి అనవసర విషయాలకు ప్రాధాన్యాన్ని ఇస్తోందని బీజేపీ విమర్శించింది. అసెంబ్లీలో సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ప్రసంగం నిరాశ కలిగించేలా ఉందని సభలో ప్రతిపక్షనేత డాక్టర్ హర్షవర్ధన్ ఆరోపించారు. అవినీతిని నిరోధించడానికి ప్రభుత్వం చే పట్టబోయే చర్యలపై లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావనే లేదని ఆరోపించారు. కామన్వెల్త్ క్రీడల అవినీతి కుంభకోణంలో షీలాదీక్షిత్‌పై ఉన్న ఆరోపణలపై విచారణ చేయించాలన్న డిమాండ్ గురించి ఆయన కూడా స్పందించలేదంటూ పెదవి విరించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్‌తో కుమ్మక్కైందని ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం అరవింద్ (కేజ్రీవాల్), అర్విందర్ సింగ్ లవ్లీ మధ్య పొత్తని ఆయన వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో సామాన్యుడు ధరల పెరుగుదలతో బాధపడుతున్నాడని, వీటి పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం ఏం చేస్తుందో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగం చెప్పలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఆప్ ఇప్పుడు అవినీతి, ధరల పెరుగుదల, నిరుద్యోగం, భద్రతలేమి వంటి కీలక విషయాలను నిర్లక్ష్యం చేస్తోందని హర్షవర్ధన్ అన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఆప్ మేనిఫెస్టోలోని హామీలనే చదివారన్నారు. వాటిని అమల్లోకి తేవడానికి ప్రభుత్వం ఏయే పథకాలను అమల్లోకి తెస్తుందో చెప్పలేదని హర్షవర్ధన్ విమర్శించారు. ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా హర్షవర్ధన్ పేరును త్వరగా ప్రకటించకపోవడం వల్ల బీజేపీ ఢిల్లీలో చాల నష్టపోయిందని పార్టీ సీనియర్ నాయకుడు అద్వానీ సోమవారం అన్నారు. బీజేపీ ప్రవాస భారతీయుల విభాగం ‘గ్లోబల్‌మీట్’ పేరుతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Advertisement
Advertisement