coal gate
-
పేర్లు తీసేయాలని ఒత్తిడి చేశారు
కోల్గేట్, కామన్వెల్త్ గేమ్స్ ఆడిట్ నివేదికల్లో కొన్ని పేర్లు తొలగించమన్నారు యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్పై మాజీ కాగ్ వినోద్ రాయ్ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: గత యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై మరో మాజీ ఉన్నతాధికారి గళమెత్తారు. కోల్గేట్, కామన్వెల్త్ గేమ్స్ స్కాం ఆడిట్ రిపోర్టుల నుంచి కొన్ని పేర్లు తొలగించాలని అప్పటి రాజకీయ నేతలతో తనపై ఒత్తిడి తెచ్చారని మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) వినోద్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాక ఆ పేర్లు తప్పించేలా తనను ఒప్పించడానికి తన సహచర ఐఏఎస్‌లతో కూడా ప్రయత్నించారన్నారు. ఈ విషయాలన్నీ అక్టోబర్‌లో విడుదల చేయబోయే తన పుస్తకం ‘నాట్ జస్ట్ యాన్ అకౌంటెంట్’లో వివరిస్తానని పేర్కొన్నారు. శనివారం ఇక్కడ ఒక పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన మన్మోహన్ సింగ్, యూపీఏ ప్రభుత్వంపై ఈ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏ మాత్రం ఆలోచన లేకుండా, ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు ఏ విధంగా నష్టం జరిగిందనే విషయాలపై పూర్తి స్థాయిలో వివరిస్తానని రాయ్ తెలిపారు. ‘‘ప్రధాని కీలకమైన వ్యక్తి. ఆయన తుది నిర్ణయం తీసుకోవాలి. మన్మోహన్ కొన్ని సార్లు తీసుకున్నారు. కొన్ని సార్లు తీసుకోలేదు. అధికారం నిలబెట్టుకోవడానికి అన్నింటినీ త్యాగం చేయకూడదు. సంకీర్ణ రాజకీయాలకోసం పాలనను బలి చేయకూడదు. అవన్నీ నేను పుస్తకంలో చెప్పాను’’ అని మాజీ ప్రధానిపై రాయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం, మాజీ ప్రధాని మన్మోహన్ నిష్క్రియాపరత్వంపై పీసీ పరేఖ్, సంజయ్ బారు, నట్వర్‌సింగ్ తమ పుస్తకాల్లో విమర్శించడం తెలిసిందే. అదే తరహాలో రాయ్ కూడా అప్పటి ప్రభుత్వంపై పెన్ను ఎత్తడం దుమారం రేపుతోంది. గతేడాది పదవి నుంచి నిష్ర్కమించిన రాయ్.. 2జీ, కోల్‌బ్లాక్ స్కాంలలో ప్రభుత్వం నష్టపోయిన నిధుల్ని అంచనావేశారు. కాంగ్రెస్ మండిపాటు.. ఈ మధ్యన ఏదోటి రాస్తూ.. దాన్ని సంచలనం చేస్తూ రిటైర్మెంట్ తర్వాత పింఛను సంపాదనలా మారిన దాన్ని రాయ్ కూడా అనుసరిస్తున్నారంటూ కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ మండిపడ్డారు. ఆయన చెప్పిన విషయాలపై చర్చకైనా సిద్ధమన్నారు. మన్మోహన్ మౌనం వీడాలి.. బీజేపీ నేత విజయ్ శంకర్ శాస్త్రి మాట్లాడుతూ.. మన్మోహన్ మాట్లాడే సమయం ఆసన్నమైందన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల్ని దుర్వినియోగం చేసిందన్నారు. -
విజిలెన్స్ కమిషన్ వెలికితీసిన అక్రమాల విలువ... 7వేల కోట్లు!!
చిన్నా చితకా అక్రమాల నుంచి మొదలుపెట్టి.. కోల్గేట్ కుంభకోణం వరకు దేశంలో జరుగుతున్న అనేకానేక స్కాముల గుట్టును రట్టుచేసిన ఘనత కేంద్ర విజిలెన్స కమిషన్ (సీవీసీ)కే దక్కుతుంది. గత సంవత్సరంలో, అంటే 2012లో సీవీసీ బయటపెట్టిన మొత్తం అక్రమాల విలువ ఎంతో తెలుసా.. అక్షరాలా 7 వేల కోట్ల రూపాయలు!! బీహార్‌కు చెందిన ఓ టెలివిజన్ గ్రూపు ముంబైలోని స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అందించే క్రెడిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమును దుర్వినియోగం చేసి 2,700 కోట్ల రూపాయలు వెనకేసుకున్న వైనాన్ని సీవీసీ బయటపెట్టింది. 2006-2009 సంవత్సరాల మధ్య జరిగిన బొగ్గు గనుల కేటాయింపుపై కొంతమంది ఎంపీలు ఫిర్యాదు చేయగా, దానిపై విచారణ జరిపిన సీవీసీ.. భారీ కుంభకోణాన్నే బయటపెట్టింది. అదిప్పుడు అధికార పీఠాలను కదిలించే స్థాయిలో ఉంది. ఈ కుంభకోణంలో కొన్ని ఫైళ్లు కనిపించకుండా పోవడంపై సాక్షాత్తు ప్రధానమంత్రి పార్లమెంటులో వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్పటివరకు మూడు ప్రాథమిక విచారణలు జరిపి, 13 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసింది. ఇక మూడు టెలింక దిగ్గజాలకు ప్రభుత్వం ఇచ్చిన టెలికం లైసెన్సులను ఆయా కంపెనీలు దుర్వినియోగం చేశాయంటూ ఫిర్యాదు రావడంతో ఆ స్కాంపై దర్యాప్తు చేసి కళ్లు చెదిరే నిజాలను బయటపెట్టింది. దీంతో మూడు టెలికం కంపెనీలకు టెలికం శాఖ 50 కోట్ల రూపాయల జరిమానా విధించింది. అలాగే, మూడు వేర్వేరు కేసుల్లో మూడు బ్యాంకులకు ప్రమేయం ఉన్న 3,568.8 కోట్ల రూపాయల అక్రమాలనూ సీవీసీ గుర్తించింది. ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి అధికారి ఒకరు అక్రమాలకు పాల్పడటంతో 46 కోట్ల రూపాయల నష్టం రాగా, దాన్ని కూడా బయటపెట్టింది. -
పార్లమెంటు సమావేశాలను వీడని గ్రహణం
-
పార్లమెంటు సమావేశాలను వీడని గ్రహణం
పార్లమెంటు సమావేశాలంటే చిన్న పిల్లల ఆటలా తయారైపోతోంది. అటు అధికార పక్షం గానీ, ఇటు ప్రతిపక్షం గానీ సమావేశాలు ఎలా జరగాలన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఏ అంశం దొరుకుతుందా, వాటిని స్తంభింపజేద్దామనే చూస్తున్నాయి. గత సంవత్సరం జరిగిన వర్షాకాల సమావేశాలు బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం పుణ్యమాని ఒక్కరోజు కూడా సరిగ్గా జరగలేదు. అంతకుముందు శీతాకాల సమావేశాలదీ అదే దారి. అప్పట్లో 2జీ కుంభకోణం పార్లమెంటు సమావేశాలను మింగేసింది. ఇప్పుడు తెలంగాణ అంశం మొదలైంది. ప్రతిసారీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఏదో ఒక వివాదం తెరపైకి రావడం, అది కాస్తా పార్లమెంటు పనిచేయాల్సిన కాలం మొత్తాన్ని హరించడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది. కేంద్రానికి బొగ్గు మసి గడిచిన వర్షాకాల సమావేశాలనే తీసుకుంటే.. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని, ఇద్దరు కళంకిత మంత్రులను తప్పించాలని బీజేపీ పట్టుబట్టగా, అధికారపక్షం తన మంకుపట్టును ఏమాత్రం వీడలేదు. పార్లమెంటు సమావేశాలు వర్షార్పణం అయిపోయిన తర్వాత తీరిగ్గా అప్పుడు మంత్రుల శాఖల్లో మార్పు లాంటి చర్యలు తీసుకుంది. అప్పట్లో 19 రోజుల పాటు పార్లమెంటు సమావేశం కావాలని ముందుగా నిర్ణయిస్తే.. కేవలం ఆరంటే ఆరే రోజులు నడిచింది. అందులోనూ ఎలాంటి చర్చలు సవ్యంగా సాగలేదు. జేపీసీ కావాలంటే.. పట్టించుకోని అధికార పెద్దలు ఇక 2010 శీతాకాల సమావేశాలదీ అదే పరిస్థితి. అప్పట్లో 2జీ స్పెక్ట్రం కేటాయింపు కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ విపక్షం పట్టుబట్టగా, అధికార పక్షం మాత్రం అందుకు ససేమిరా అంటూ తన మొండివైఖరి కొనసాగించింది. తీరా సమావేశాలు మొత్తం ఆ చర్చలతోనే సరిపోయిన తర్వాత.. అప్పుడు తీరిగ్గా జేపీసీని ఏర్పాటు చేసింది. ప్రతిసారీ ఇలాగే చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారిపోయింది. అప్పట్లో 23 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరగాలని తొలుత నిర్ణయించగా, గట్టిగా కొన్ని గంటలు కూడా పనిచేయలేదు. విపక్షాలన్నీ ఏకతాటిమీద నిలవడంతో.. ప్రతిరోజూ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అవి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ఉభయ సభల్లోనూ అదే పరిస్థితి కనిపించింది. సభలో తెలంగాణ లొల్లి ఇక ఈసారి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజులు ఉందనగా తెలంగాణకు తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇది కాస్తా సీమాంధ్ర ప్రాంతంలో చిచ్చురేపింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇటు లోక్‌సభతో పాటు అటు రాజ్యసభలో కూడా ఎంపీలు తీవ్రస్థాయిలో తమ ఆందోళన వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా సమావేశాలను సాగనివ్వలేదు. దీనికి తోడు కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేత అంశం ఒకటి సభను మంగళవారం కుదిపేసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు సభలో సమైక్య నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లి కార్యకలాపాలను రెండు రోజులుగా అడ్డుకుంటున్నారు. ఈ ఆందోళన ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈసారి సమావేశాల్లో ఆహార భద్రత సహా కీలకమైన బిల్లులను ఆమోదించాల్సి ఉంది. అదంతా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తే.. అటు తెలంగాణ ఎంపీలు మండిపడతారు. ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీనంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ పెద్దలు హడావుడిగా నిర్ణయం ప్రకటించడం తప్ప మరొకటి కానే కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.