పార్లమెంటు సమావేశాలను వీడని గ్రహణం
పార్లమెంటు సమావేశాలంటే చిన్న పిల్లల ఆటలా తయారైపోతోంది. అటు అధికార పక్షం గానీ, ఇటు ప్రతిపక్షం గానీ సమావేశాలు ఎలా జరగాలన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. ఏ అంశం దొరుకుతుందా, వాటిని స్తంభింపజేద్దామనే చూస్తున్నాయి. గత సంవత్సరం జరిగిన వర్షాకాల సమావేశాలు బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం పుణ్యమాని ఒక్కరోజు కూడా సరిగ్గా జరగలేదు. అంతకుముందు శీతాకాల సమావేశాలదీ అదే దారి. అప్పట్లో 2జీ కుంభకోణం పార్లమెంటు సమావేశాలను మింగేసింది. ఇప్పుడు తెలంగాణ అంశం మొదలైంది. ప్రతిసారీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజుల ముందే ఏదో ఒక వివాదం తెరపైకి రావడం, అది కాస్తా పార్లమెంటు పనిచేయాల్సిన కాలం మొత్తాన్ని హరించడం ఇటీవలి కాలంలో మామూలైపోయింది.
కేంద్రానికి బొగ్గు మసి
గడిచిన వర్షాకాల సమావేశాలనే తీసుకుంటే.. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణం నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని, ఇద్దరు కళంకిత మంత్రులను తప్పించాలని బీజేపీ పట్టుబట్టగా, అధికారపక్షం తన మంకుపట్టును ఏమాత్రం వీడలేదు. పార్లమెంటు సమావేశాలు వర్షార్పణం అయిపోయిన తర్వాత తీరిగ్గా అప్పుడు మంత్రుల శాఖల్లో మార్పు లాంటి చర్యలు తీసుకుంది. అప్పట్లో 19 రోజుల పాటు పార్లమెంటు సమావేశం కావాలని ముందుగా నిర్ణయిస్తే.. కేవలం ఆరంటే ఆరే రోజులు నడిచింది. అందులోనూ ఎలాంటి చర్చలు సవ్యంగా సాగలేదు.
జేపీసీ కావాలంటే.. పట్టించుకోని అధికార పెద్దలు
ఇక 2010 శీతాకాల సమావేశాలదీ అదే పరిస్థితి. అప్పట్లో 2జీ స్పెక్ట్రం కేటాయింపు కుంభకోణంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ విపక్షం పట్టుబట్టగా, అధికార పక్షం మాత్రం అందుకు ససేమిరా అంటూ తన మొండివైఖరి కొనసాగించింది. తీరా సమావేశాలు మొత్తం ఆ చర్చలతోనే సరిపోయిన తర్వాత.. అప్పుడు తీరిగ్గా జేపీసీని ఏర్పాటు చేసింది. ప్రతిసారీ ఇలాగే చేయడం అధికార పక్షానికి అలవాటుగా మారిపోయింది. అప్పట్లో 23 రోజుల పాటు పార్లమెంటు సమావేశాలు జరగాలని తొలుత నిర్ణయించగా, గట్టిగా కొన్ని గంటలు కూడా పనిచేయలేదు. విపక్షాలన్నీ ఏకతాటిమీద నిలవడంతో.. ప్రతిరోజూ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అవి వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చాయి. ఉభయ సభల్లోనూ అదే పరిస్థితి కనిపించింది.
సభలో తెలంగాణ లొల్లి
ఇక ఈసారి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి కొన్ని రోజులు ఉందనగా తెలంగాణకు తాము అనుకూలమంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇది కాస్తా సీమాంధ్ర ప్రాంతంలో చిచ్చురేపింది. దీంతో తప్పనిసరి పరిస్థితిలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇటు లోక్సభతో పాటు అటు రాజ్యసభలో కూడా ఎంపీలు తీవ్రస్థాయిలో తమ ఆందోళన వ్యక్తం చేస్తూ గత రెండు రోజులుగా సమావేశాలను సాగనివ్వలేదు. దీనికి తోడు కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత జవాన్ల కాల్చివేత అంశం ఒకటి సభను మంగళవారం కుదిపేసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు సభలో సమైక్య నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకెళ్లి కార్యకలాపాలను రెండు రోజులుగా అడ్డుకుంటున్నారు. ఈ ఆందోళన ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో తెలియదు. ఈసారి సమావేశాల్లో ఆహార భద్రత సహా కీలకమైన బిల్లులను ఆమోదించాల్సి ఉంది. అదంతా జరుగుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటిస్తే.. అటు తెలంగాణ ఎంపీలు మండిపడతారు. ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. దీనంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ పెద్దలు హడావుడిగా నిర్ణయం ప్రకటించడం తప్ప మరొకటి కానే కాదన్నది రాజకీయ విశ్లేషకుల మాట.