విభజనపై కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రతిపాదనపై వ్యక్తమవుతున్న అభ్యంతరాల పరిశీలనకు కాంగ్రెస్ పార్టీ నలుగురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీని ప్రకటించింది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్, కేంద్ర మంత్రి వీరప్ప మెయిలీ, అహ్మద్ పటేల్ ఇందులో సభ్యులుగా ఉంటాయి.
రాష్ట్ర విభజనపై సీమాంధ్ర నేతల నుంచి వస్తున్న అభ్యంతరాలను ఈ కమిటీ ఆలకించనుంది. హైదరాబాద్పై పీఠముడి పడిన నేపథ్యంలో కమిటీ పనితీరుపై అందరి దృష్టి నెలకొంది. ఇప్పటికే ఇరు ప్రాంతాల నాయకులు అధిష్టాన పెద్దల ముందు పలుమార్లు తమ వాదనలు వినిపించారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మ్యానిఫెస్టో రూపకల్పన కమిటీని కూడా కాంగ్రెస్ ప్రకటించింది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. నారాయణస్వామి, దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉండవల్లి, గీతారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారు.