విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
* శాంతిభద్రతలపై గవర్నర్
* వాటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాం
* రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం, నాణ్యమైన విద్య,వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ
* పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించబోమని, అటువంటి వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పాలన వ్యవహారాలను చేపట్టానని చెప్పారు. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం, నాణ్యమైన విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని తెలిపారు. సామాన్య ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి అవసరమైన వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు.
‘‘శాంతిభద్రతలు సక్రమంగా లేకుంటే ఎలాంటి కార్యక్రమాలనూ చేపట్టలేం. రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు మొన్నటివరకు అడిగిన ప్రశ్న రాష్ట్ర విభజన జరుగుతుందా..? లేదా..? అనిశ్చితి తొలగుతుందా..? లేదా..? అని. ఇప్పుడు ఆ నిర్ణయం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్వర్ణభూమి. పెట్టుబడులకు పూర్తి అనుకూలమైనది. పెట్టుబడులు పెట్టే వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి అన్ని చర్యలు తీసుకుంటా’’ అని అన్నారు.
ఎలాంటి సమస్యనైనా సామరస్యపూర్వకంగా చర్చించుకుని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రజలను కలుసుకోవడానికి జనతా దర్బార్ నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. నాలుగేళ్లలో గవర్నర్‌గా బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా పనిచేశానని అన్నారు. ఎవరిపట్లా పక్షపాతంతో వ్యవహరించలేదని చెప్పారు. రాష్ట్రపతి పాలన అంటే పోలీసు అధికారం కాదని, ఎంతకాలం ఉంటాను అన్నది ప్రశ్నే కాదని వ్యాఖ్యానించారు.
వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలి
వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, అందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని తెలిపారు. ‘‘ఒకే రకమైన రోగానికి ఒక్కో ఆస్పత్రి ఒక్కో రకంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. అలా కాకుండా రాష్ట్రం మొత్తం ఒకే రకమైన చార్జీలు ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా ఆస్పత్రులకు వెళ్లాలి. సామాన్య ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రుల్లో సదుపాయాలు, పరికరాలను సమకూరుస్తా. గ్రామీణ ప్రాంత వైద్యంపై ఎక్కువ దృష్టి పెడతా. రోగాన్ని నయం చేయడంకంటే.. రోగం రాకుండా చూడటానికి ప్రాధాన్యతనిస్తా’’ అని అన్నారు.
ఇష్టమైన అంశం విద్య
నాకు ఇష్టమైన ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టి పెడతానని గవర్నర్ చెప్పారు. ‘‘నాణ్యమైన విద్య లేకుంటే విద్యార్థుల భవిష్యత్తు వృథాగా మారుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యనందించడానికి చర్యలు చేపడతా. విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైస్ చాన్సలర్లతో చర్చిస్తా. చాలాకాలం నుంచి విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల భర్తీ జరగలేదు. ప్రాధాన్యత క్రమంలో వాటిని భర్తీ చేస్తా. వైస్ చాన్సలర్లను నియమిస్తా’’ అని తెలిపారు.
రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచాలి..
‘‘రాష్ట్ర విభజన కోసం 15 సబ్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇవి కేంద్ర కమిటీలతో సమన్వయం చేసుకుంటాయి. ఈ కమిటీల ప్రతిపాదనలు అపెక్స్ కమిటీకి వస్తాయి. ఆపెక్స్ కమిటీ చైర్మన్‌గా రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకుంటా. సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. ఇందులో ఇబ్బంది ఉండదు. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టం. సీఎంఆర్‌ఎఫ్ గురించి పరిశీలిస్తా’’ అని అన్నారు.
మా తప్పులను మీడియా ఎత్తిచూపొచ్చు
‘‘గవర్నర్‌గా నాలుగేళ్లలో మొదటిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నా. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం నాది. నేను చేపట్టే కార్యక్రమాలను సజావుగా ముందుకు తీసుకెళ్లాలంటే మీ (మీడియూ) సహకారం కావాలి. ఏవైనా పొరపాట్లు జరిగితే నిర్మాణాత్మక రీతిలో విమర్శలు చేయవచ్చు. మేము తీసుకొనే నిర్ణయాల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, వాటిని నిర్భయంగా ఎత్తిచూపండి. ఎవరినైనా మీరు నిలబెట్టగలరు, కూల్చనూగలరు. మీ సహకారం కోరుతున్నా. మిత్రులుగా మెలుగుదాం. నీవు, నేను అని కాకుండా ఇకపై మనం అనేలా వ్యవహరిద్దాం’’ అని నరసింహన్ చెప్పారు.
కిరణ్ నిర్ణయాలపై సమీక్షకు సమయం పడుతుంది
మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్న చివరి రోజుల్లో చేసిన సంతకాలపై సమీక్షించడానికి కొద్ది సమయం పడుతుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. కిరణ్ చివరి సంతకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నా’’ అంటూ పరోక్షంగా కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయాలను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. కిరణ్ నిర్ణయాలను గవర్నర్ సమీక్షించనున్నారంటూ ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే.