E S L Narasimhan
-
'నా గురువుల వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను'
హైదరాబాద్: తాను ఈ స్థితిలో ఉండటానికి నా గురువులే కారణమని ఇరు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తెలిపారు. గురువారం కోఠి ఉమెన్స్ కాలేజీ 90వ వార్షికోత్సవ వేడుకల్లో నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం కాలేజీలో ఆర్ట్స్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి నరసింహన్ ప్రసంగించారు. ఎంత ఉన్నత స్థితికి వెళ్లినా గురువుల్ని మాత్రం మరవకూడదని విద్యార్థులకు హితబోధ చేశారు. ఈ కాలేజీ వేడుకలు చూస్తుంటే తన చదివిన కాలేజీలోని నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. కాలేజీ 90 ఏళ్లు పూర్తి చేసుకోవడం సంతోషం వ్యక్తం చేశారు. సమాజంలో మహిళలది విశేషమైన పాత్ర ఉందన్నారు. మహిళ విద్యతోనే సమాజ అభివృద్ధి సాథ్యమని నరసింహన్ స్పష్టం చేశారు. -
ఆంధ్రా, తెలంగాణలకు తమిళ గవర్నర్
ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. తెలుగు మాట్లాడే వారు ఇక అధికారికంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా వేరయ్యారు. కాగా సంయుక్త ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్‌గా పనిచేసిన ఈఎస్ఎల్ నరసింహన్ కొత్త రాష్ట్రాలకు తొలి గవర్నర్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ గవర్నర్‌గా సోమవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నరసింహన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి పనిచేయగా.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి కావడమిక లాంఛనమే. ఇలా నరసింహన్ హయాంలో విభిన్న పార్టీల ప్రభుత్వాలు ఏర్పడం.. నలుగురు ముఖ్యమంత్రులు పనిచేయడం మరో విశేషం. 2007లో ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమితులైన నరసింహన్.. 2009 డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ (మునుపటి) గవర్నర్ ఎన్ డీ తివారీ రాజీనామా చేయడంతో ఇక్కడకు బదిలీ అయ్యారు. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు, రాష్ట్రపతి పాలన వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన సమర్ధంగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి పదవికి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసినా పరిపాలన స్తంభించకుండా చురుగ్గా వ్యవహరించారు. పెట్రోలు బంకుల డీలర్లు సమ్మె చేసినప్పుడు ఆయన కలగజేసుకున్న గంటలోపే వాళ్లు సమ్మె విరమించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ కీలకంగా పనిచేశారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడే నరసింహన్ 1946లో తమిళనాడులో జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్ర్రంలో డిగ్రీ, పొలిటికల్ సైన్స్‌లో పీజీ, లా చేశారు. అనంతరం ఇండియన్ పోలీస్ సర్వీస్‌కు ఎంపికై ఆంధ్రప్రదేశ్ కేడర్ అధికారిగా పనిచేశారు. ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా సుదీర్ఘకాలం బాధ్యతలు చేపట్టారు. నరసింహన్ ప్రొఫైల్: వయసు: 71 స్వరాష్ట్రం: తమిళనాడు విద్యాభ్యాసం: ఫిజిక్స్‌లో డిగ్రీ, పొలిటికల్ సైన్స్‌లో పీజీ, లా ఐపీఎస్‌కు ఎంపిక: 1968 బ్యాచ్, ఆంధ్రప్రదేశ్ కేడర్ 1981-84: మాస్కో ఎంబసీలో తొలి సెక్రటరీ 2006 వరకు: ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్‌గా పదవీ విరమణ 2007 జనవరి 19: చత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియామకం 2009 డిసెంబర్: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా బాధ్యతలు 2014 జూన్ 2: తెలంగాణ తొలి గవర్నర్‌గా ప్రమాణం (అదనపు బాధ్యతలు) -
'మద్యం సిండికేట్‌లో అధికారుల ప్రాసిక్యూషన్'
-
'మద్యం సిండికేట్‌లో అధికారుల ప్రాసిక్యూషన్'
మద్యం సిండికేట్ వ్యవహారంపై గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ స్పందించారు. ఆ వ్యవహారంలో 34 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతంలో రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వ్యవహారంపై 180 మంది అధికారులపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అనాటి వ్యవహారంపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరించి... ఉన్నతాధికారులను బదిలీ చేసి చేతులు దులుపుకుందని విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఉన్న అధికారులపై చర్యలకు గవర్నర్ రంగంలోకి దిగారు. అందులోభాగంగా మొదటగా 34 మంది అధికారులపై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇచ్చారు. -
విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
* శాంతిభద్రతలపై గవర్నర్ * వాటిపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తాం * రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం, నాణ్యమైన విద్య,వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ * పెట్టుబడిదారుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా ఉపేక్షించబోమని, అటువంటి వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం ఆయన తొలిసారిగా ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఆదేశాల మేరకు రాష్ట్రంలో పాలన వ్యవహారాలను చేపట్టానని చెప్పారు. ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారిస్తానని తెలిపారు. రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచడం, నాణ్యమైన విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తానని తెలిపారు. సామాన్య ప్రజలు ప్రశాంతంగా జీవించడానికి అవసరమైన వాతావరణం కల్పించడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. ‘‘శాంతిభద్రతలు సక్రమంగా లేకుంటే ఎలాంటి కార్యక్రమాలనూ చేపట్టలేం. రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉంటేనే పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు మొన్నటివరకు అడిగిన ప్రశ్న రాష్ట్ర విభజన జరుగుతుందా..? లేదా..? అనిశ్చితి తొలగుతుందా..? లేదా..? అని. ఇప్పుడు ఆ నిర్ణయం జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్ స్వర్ణభూమి. పెట్టుబడులకు పూర్తి అనుకూలమైనది. పెట్టుబడులు పెట్టే వారిలో ఆత్మవిశ్వాసం నింపడానికి అన్ని చర్యలు తీసుకుంటా’’ అని అన్నారు. ఎలాంటి సమస్యనైనా సామరస్యపూర్వకంగా చర్చించుకుని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు. ప్రజలను కలుసుకోవడానికి జనతా దర్బార్ నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. నాలుగేళ్లలో గవర్నర్‌గా బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా పనిచేశానని అన్నారు. ఎవరిపట్లా పక్షపాతంతో వ్యవహరించలేదని చెప్పారు. రాష్ట్రపతి పాలన అంటే పోలీసు అధికారం కాదని, ఎంతకాలం ఉంటాను అన్నది ప్రశ్నే కాదని వ్యాఖ్యానించారు. వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండాలి వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, అందుకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని తెలిపారు. ‘‘ఒకే రకమైన రోగానికి ఒక్కో ఆస్పత్రి ఒక్కో రకంగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. అలా కాకుండా రాష్ట్రం మొత్తం ఒకే రకమైన చార్జీలు ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటా. ప్రభుత్వ వైద్యులు తప్పనిసరిగా ఆస్పత్రులకు వెళ్లాలి. సామాన్య ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి వీలుగా ఆస్పత్రుల్లో సదుపాయాలు, పరికరాలను సమకూరుస్తా. గ్రామీణ ప్రాంత వైద్యంపై ఎక్కువ దృష్టి పెడతా. రోగాన్ని నయం చేయడంకంటే.. రోగం రాకుండా చూడటానికి ప్రాధాన్యతనిస్తా’’ అని అన్నారు. ఇష్టమైన అంశం విద్య నాకు ఇష్టమైన ఉన్నత విద్యపైనా ప్రత్యేక దృష్టి పెడతానని గవర్నర్ చెప్పారు. ‘‘నాణ్యమైన విద్య లేకుంటే విద్యార్థుల భవిష్యత్తు వృథాగా మారుతుంది. అందువల్ల విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యనందించడానికి చర్యలు చేపడతా. విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై వైస్ చాన్సలర్లతో చర్చిస్తా. చాలాకాలం నుంచి విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల భర్తీ జరగలేదు. ప్రాధాన్యత క్రమంలో వాటిని భర్తీ చేస్తా. వైస్ చాన్సలర్లను నియమిస్తా’’ అని తెలిపారు. రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరచాలి.. ‘‘రాష్ట్ర విభజన కోసం 15 సబ్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇవి కేంద్ర కమిటీలతో సమన్వయం చేసుకుంటాయి. ఈ కమిటీల ప్రతిపాదనలు అపెక్స్ కమిటీకి వస్తాయి. ఆపెక్స్ కమిటీ చైర్మన్‌గా రెండు ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిచేలా నిర్ణయాలు తీసుకుంటా. సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. ఇందులో ఇబ్బంది ఉండదు. కొత్త పథకాలేవీ ప్రవేశపెట్టం. సీఎంఆర్ఎఫ్ గురించి పరిశీలిస్తా’’ అని అన్నారు. మా తప్పులను మీడియా ఎత్తిచూపొచ్చు ‘‘గవర్నర్‌గా నాలుగేళ్లలో మొదటిసారి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నా. ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం నాది. నేను చేపట్టే కార్యక్రమాలను సజావుగా ముందుకు తీసుకెళ్లాలంటే మీ (మీడియూ) సహకారం కావాలి. ఏవైనా పొరపాట్లు జరిగితే నిర్మాణాత్మక రీతిలో విమర్శలు చేయవచ్చు. మేము తీసుకొనే నిర్ణయాల్లో కొన్ని లోపాలు ఉండొచ్చు, వాటిని నిర్భయంగా ఎత్తిచూపండి. ఎవరినైనా మీరు నిలబెట్టగలరు, కూల్చనూగలరు. మీ సహకారం కోరుతున్నా. మిత్రులుగా మెలుగుదాం. నీవు, నేను అని కాకుండా ఇకపై మనం అనేలా వ్యవహరిద్దాం’’ అని నరసింహన్ చెప్పారు. కిరణ్ నిర్ణయాలపై సమీక్షకు సమయం పడుతుంది మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్న చివరి రోజుల్లో చేసిన సంతకాలపై సమీక్షించడానికి కొద్ది సమయం పడుతుందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. కిరణ్ చివరి సంతకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘కాస్త ఓపిక పట్టండి. ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నా’’ అంటూ పరోక్షంగా కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయాలను సమీక్షించనున్నట్లు వెల్లడించారు. కిరణ్ నిర్ణయాలను గవర్నర్ సమీక్షించనున్నారంటూ ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. -
అంటురోగాల నష్టాన్నితగ్గించండి
సాక్షి, హైదరాబాద్: అంటురోగాల వల్ల కలిగే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు క్లినికల్ మైక్రోబయాలజిస్టులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కోరారు. ఈ విషయంలో మెక్రోబయాలజిస్టులు, వైద్యులు కలసికట్టుగా పనిచేయాలని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇండియన్ అసోసియేషన్ ఫర్ మెడికల్ మైక్రోబయాలజిస్టుల (ఐఏఎంఎం) 37వ వార్షిక సదస్సు ‘మైక్రోకాన్-2013’కు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా గవర్నర్ సూచించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డెరైక్టర్ వి.ఎం.కటోచ్ మాట్లాడుతూ యాంటీబయాటిక్ మందుల విచ్చలవిడి వాడకంతో అనేక వ్యాధులకు ఇప్పుడు ఉపయోగిస్తున్న మందులు పనిచేయకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఒకప్పుడు లేని డెంగీ, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ వంటివి వ్యాప్తి చెందుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నిమ్స్ సంచాలకులు ఎల్.నరేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో కొత్త వ్యాధుల విస్తరణ ప్రమాదం పెరిగినందున అనూహ్య పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు మైక్రోబయాలజిస్టులు, వైద్యులు సిద్ధంగా ఉండాలన్నారు. యాంటీబయాటిక్ మందులు దుకాణాల ద్వారా చాలా సులువుగా లభిస్తున్నాయని, దీంతో కొన్నిసార్లు చిన్న సమస్యలకు సైతం అధిక మోతాదు మందులు వాడటం ఎక్కువైందని, ఫలితంగా అటు యాంటీబయాటిక్స్‌కు, ఇటు వేర్వేరు మందులకు నిరోధకత పెరుగుతోందని ఐఏఎంఎం అధ్యక్షురాలు డాక్టర్ రెబా కనున్గో వివరించారు.