
అంటురోగాల నష్టాన్నితగ్గించండి
సాక్షి, హైదరాబాద్: అంటురోగాల వల్ల కలిగే నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు క్లినికల్ మైక్రోబయాలజిస్టులు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కోరారు. ఈ విషయంలో మెక్రోబయాలజిస్టులు, వైద్యులు కలసికట్టుగా పనిచేయాలని గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ఇండియన్ అసోసియేషన్ ఫర్ మెడికల్ మైక్రోబయాలజిస్టుల (ఐఏఎంఎం) 37వ వార్షిక సదస్సు ‘మైక్రోకాన్-2013’కు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా గవర్నర్ సూచించారు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డెరైక్టర్ వి.ఎం.కటోచ్ మాట్లాడుతూ యాంటీబయాటిక్ మందుల విచ్చలవిడి వాడకంతో అనేక వ్యాధులకు ఇప్పుడు ఉపయోగిస్తున్న మందులు పనిచేయకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఒకప్పుడు లేని డెంగీ, చికెన్‌గున్యా, స్వైన్‌ఫ్లూ వంటివి వ్యాప్తి చెందుతున్నాయని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. నిమ్స్ సంచాలకులు ఎల్.నరేంద్రనాథ్ మాట్లాడుతూ ప్రపంచీకరణ నేపథ్యంలో కొత్త వ్యాధుల విస్తరణ ప్రమాదం పెరిగినందున అనూహ్య పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు మైక్రోబయాలజిస్టులు, వైద్యులు సిద్ధంగా ఉండాలన్నారు. యాంటీబయాటిక్ మందులు దుకాణాల ద్వారా చాలా సులువుగా లభిస్తున్నాయని, దీంతో కొన్నిసార్లు చిన్న సమస్యలకు సైతం అధిక మోతాదు మందులు వాడటం ఎక్కువైందని, ఫలితంగా అటు యాంటీబయాటిక్స్‌కు, ఇటు వేర్వేరు మందులకు నిరోధకత పెరుగుతోందని ఐఏఎంఎం అధ్యక్షురాలు డాక్టర్ రెబా కనున్‌గో వివరించారు.