భక్తి ప్రపంచానికి బాలకులే పాలకులు | about devotion in childhood | Sakshi
Sakshi News home page

భక్తి ప్రపంచానికి బాలకులే పాలకులు

Published Thu, Nov 13 2014 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM

భక్తి ప్రపంచానికి  బాలకులే పాలకులు

భక్తి ప్రపంచానికి బాలకులే పాలకులు

బాల్యంలోనే భక్తికి భాష్యం చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు. బాలల దినోత్సవం నాడు అటువంటి బాలురను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. మన పిల్లలకు వారి చరిత్రలను చెప్పాలి. వారిలో ఉత్తేజాన్ని కలిగించాలి. రాబోయే కాలంలో మంచి సమాజం ఏర్పడేందుకు అనుగుణంగా ఈనాడే మన బాలల మనస్సులను మనమే సభక్తికంగా తీర్చిదిద్దాలి.
 
మొక్కై వంగనిది మానై వంగునా! అన్నది అనాదిగా వస్తున్న పెద్దలమాట. ఆ మాటను ముఖ్యంగా  క్రమశిక్షణ విషయంలో ఉపయోగిస్తారు. ఎవరికి దైవం మీద భక్తి ఉంటుందో వారికి పాపభీతి ఉంటుంది. పాపభీతి ఉన్నవాడు తప్పుడు పనులు చేయడానికి సాహసింపడు. తప్పు చేయకపోవడమే క్రమశిక్షణ. ఆ లక్షణం చిన్నప్పటి నుండీ అభ్యాసంలో ఉండాలి.

 
ప్రహ్లాదుడు
పురాణ చరిత్రలోకి వెడితే ముక్కుపచ్చలారని కొందరు బాలకులు అసాధారణ భక్తిభావంతో పెద్దలకు కనువిప్పు కలిగించినవారు, భగవంతుని ప్రత్యక్షం చేసికొని ప్రపంచాన్ని విస్మయపరచినవారు కనిపిస్తారు. వారి పేర్లు లోకంలో శాశ్వతంగా నిలిచిపోయాయి. అలాంటివారిలో ప్రథమగణ్యుడు ప్రహ్లాదుడు. అతనిని బాలభక్తుడని అనడానికి కూడా వీలు కాదు. శిశుభక్తుడు. ఇంకా చెప్పాలంటే ఆగర్భభక్తుడు.

కడుపులో ఉన్నప్పుడే ఇంద్రుడు అతని తల్లిని బంధించి తీసుకుపోతుంటే నారదుడు వారించి, వెనుకకు తీసికొనివచ్చి, గర్భస్థ శిశువునకు నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. నాటి నుండి, అంటే ఇంకా భూమి మీద పడకుండగానే నారాయణ భక్తిలో మునిగిపోయాడు ప్రహ్లాదుడు. వాని తండ్రి హిరణ్యకశిపుని నిరంకుశత్వానికి శిరసు వంచి, ప్రపంచమంతా ఆ రాజునే దేవునిగా భావిస్తుంటే, పాలబుగ్గల ప్రహ్లాదుడు మాత్రం తండ్రిని ఎదిరించి, మనందరికీ అధినాథుడైన నారాయణుడే దైవమని నొక్కి వక్కాణించాడు.

తనకే ఎదురు చెప్పిన ప్రహ్లాదుణ్ణి, కొడుకు అని కూడా చూడకుండా ఏనుగులతో తొక్కించాడు, గదలతో మోదించాడు, పాములతో కరిపించాడు, విషాన్ని తాగించాడు, మంటలోకి తోయించాడు, కొండలపై నుంచి లోయలలోనికి గెంటించాడు, సముద్రంలో పడవేయించాడు. ఎన్ని చేసినా కేవలం నారాయణ నామస్మరణంతో బ్రతికి వచ్చిన కుమారుని చూచి విసిగి చివరకు నీ నారాయణుడు ఎక్కడున్నాడో చెప్పమంటాడు. ‘‘ఇందుగలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన  నందందే గలడు దానవాగ్రణి వింటే’’ అన్నాడు ప్రహ్లాదుడు.

అయితే ఈ స్తంభంలో చూపించమన్నాడు తండ్రి.  చూడమన్నాడు కుమారుడు. వెంటనే తన చెంతనున్న బలమైన గదతో ఆ స్తంభాన్ని బద్దలుకొడితే  అందులో నుండి శ్రీహరి నరసింహరూపంలో బయటకు వచ్చి లోకకంటకుడైన హిరణ్యకశిపుని వధించి, ప్రహ్లాదుని రక్షించాడు. కన్నతండ్రే పిల్లలకు చెడును నూరిపోస్తుంటే, తన కళ్ళ ఎదుటే అధర్మాన్ని ఆచరిస్తుంటే, ఆచరించమని ప్రోత్సహిస్తుంటే అటువంటి తండ్రిని ఎదిరించడమే ధర్మమని లోకానికి తెలియజేసిన మొదటివ్యక్తి, అప్పటికి కేవలం ఐదేళ్ళ వయసున్న బాలుడు ప్రహ్లాదుడు.
 
ధ్రువుడు
ధ్రువుడనే బాలకుడు రాజకుమారుడు. సవతి తల్లి పెత్తనం ముందు తన తల్లిమాట నెగ్గక, తండ్రి ప్రేమకు నోచుకోలేక పోయాడు. కనీసం సవతి తమ్మునితో బాటుగా నాన్న ఒడిలో కూర్చోడానికి కూడా ఆ సవతి తల్లి ఒప్పుకోలేదు. నొచ్చుకున్నాడు. తన తల్లి దగ్గర తన బాధను చెప్పుకొన్నాడు. ఆమె ఓదారుస్తూ నాన్నగారి ఒడిలో కూర్చోవాలని ఎందుకు కోరుకుంటున్నావు. భక్తితో శ్రీహరిని సేవించు. ఆయన ఒడిలోనే కూర్చోవచ్చు అని మాటవరుసకు అంది.

అంతే! మనసులో ఏదో ప్రేరణ కలిగింది. వెంటనే ఇల్లు, వాకిలి విడిచిపెట్టి అడవికి పోయి. నారయణుని కోసం తీవ్రమైన తపస్సు చేసి, చివరకు ఆ స్వామిని ప్రత్యక్షం చేసికొన్నాడు. ఏం కావాలని అడిగాడు. అప్పుడు ధ్రువుడు, భోగభాగ్యాలను కోరుకోకుండా మోక్షాన్ని ప్రసాదించమని కోరితే నారాయణుడే ఆశ్చర్యపోయాడు. అప్పుడే కాదు, పెద్దవాడివై, రాజ్యాన్ని ప్రజానురంజకంగా పాలించి, ఎన్నో పుణ్యకార్యాలు చేసి, ఆ తరువాత నక్షత్రంగా మారి లోకానికి వెలుగిస్తావని వరమిచ్చాడు శ్రీహరి. అంతే! జన్మాంతమందు అలాగే ధ్రువనక్షత్రంగా మారి ఈనాటికీ అందరి నమస్కారాలు అందుకొంటున్నాడు ఆనాటి పసిబాలుడు ధ్రువుడు.
 
మార్కండేయుడు
సంతానం కోసం తపస్సు చేసిన మృకండు మహర్షికి శివుడు ప్రత్యక్షమై అల్పాయువైన గుణవంతుడు కావాలా? దీర్ఘాయువైన మూర్ఖుడు కావాలా? అని అడిగితే అల్పాయువైనా గుణవంతుడే కావాలని అర్థించాడు. అలా జన్మించినవాడు మార్కండేయుడు. ఎలాగూ ఎంతోకాలం బతకనివాడికి నామకరణం కూడానా అని మానుకొన్నాడు తండ్రి. మృకండుని కుమారుడు కనుక మార్కండేయుడని లోకం పిలువసాగింది. చివరకు అదే వాని శాశ్వతనామధేయం అయిపోయింది. చిన్ననాటినుండీ శివారాధనలో మునిగిపోయాడా బాలుడు.

శివధ్యానం, శివనామస్మరణ తప్ప వేరే ప్రపంచం లేనట్లుగా ప్రవర్తిస్తున్నాడు. అందరూ వాని అచంచల భక్తిని చూచి ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. అలా పదునారేండ్లు గడిచాయి. ఆయువు తీరే గడియ రానే వచ్చింది. ఆ సమయంలో కూడా మార్కండేయుడు శివాలయంలోనే ఉన్నాడు. పసిప్రాయంనుండే శివారాధన తత్పరుడైన వాని ప్రాణాలను హరించడం కింకరులకు సాధ్యం కాదని యముడే స్వయంగా బయలుదేరాడు. బాలకుడు తన తపోమహిమ వలన యముని కనులారా చూడగలిగాడు. కొంత భయం వేసింది.

బతుకుమీద కోరికతో కాకుండా తగినంత తపస్సు చేస్తేనేగాని మోక్షం రాదని, తపస్సు చేయాలంటే తాను ఇంకా కొంతకాలం బతికి ఉండాలని భావించి, యముని బారి నుండి కాపాడమని మృత్యుంజయుడైన పరమేశ్వరుని ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ, ఆ శివలింగాన్నే కౌగలించుకొని ఉండిపోయాడు. ‘‘చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః’’ అంటూ స్తోత్రం చేశాడు. అయినా బలవంతంగా వాని ప్రాణాలను హరించేందుకు ప్రయత్నించిన యమధర్మరాజును శివుడు ప్రత్యక్షమై నిలువరించాడు. మార్కండేయుని చిరంజీవిని చేశాడు. అలా బాల్యంలోనే పరమేశ్వరుని ప్రత్యక్షం చేసికొని మృత్యువునే ఎదిరించి అల్పాయువును చిరాయువుగా మార్చుకొన్న మహనీయుడు మార్కండేయుడు.
 
సిరియాళుడు

పరమశివభక్తులైన దంపతులను పరీక్షించేందుకు ఒకనాడు పరమేశ్వరుడే జంగమదేవర రూపంలో వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. మా ఇంట భోజనం చేయమని ఆ దంపతులు ప్రార్థించారు. నాకు నరమాంసం వండిపెడితే తింటానన్నాడు ఆ జంగమ దేవర. ఒక్కసారి వారు అవాక్కయ్యారు. అతిథిని భోజనానికి పిలిచి అన్నం పెట్టకుండా పంపిస్తే మహాపాపం. అలాగని నరమాంసం ఎక్కడనుండి తెస్తారు. ఎవరు తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడతారు. అయోమయమై చింతిస్తుంటే వారి కుమారుడు ‘సిరియాళుడు’  ‘‘అమ్మా! నాన్నగారూ! దీనికి ఇంత చింత ఎందుకు? నన్ను చంపి నా మాంసంతో అతిథిని తృప్తిపరచండి’’ అంటాడు.

కన్న తల్లిదండ్రులు ఎవరైనా ఆ పని చేయగలరా! వారు శోకసముద్రంలో మునిగిపోయారు. అపుడా చిన్ని బాలుడు వారితో ‘‘సంసార భ్రమమించుకేనియును మత్స్వాంతంబునన్ లేదు మీ వంశంబీపరిపాటిదా!’’ అని వారికి నచ్చజెప్పి సిద్ధపడేలా చేశాడు. వారు తన కుమారుని చంపి, ఆ మాంసం వండి, అతిథికి వడ్డించారు. ఇంకా పరీక్షించడం మానలేదు పరమేశ్వరుడు. పుత్రులు లేని ఇంట నేను భోజనం చేయను. మీ బిడ్డను పిలవండి అన్నాడు. నిలువునా నీరైపోయారు ఆ పుణ్యదంపతులు. ఆమె గొడ్రాలు కాదు. కాని ఇప్పుడు ఆ బిడ్డ లేడు. ఏం చేయాలో పాలుపోలేదు. ‘ఏంమీకు సంతానం లేదా?’ అని అడిగాడు అతిథి.

ఇంతకుముందు వరకూ కుమారుడున్నాడు. కాని ఇప్పుడు లేడన్నారు ఆ దంపతులు. లేకపోతే వస్తాడు. గట్టిగా పిలవండి. అన్నాడు అతిథి. ఏమనాలో తెలియక ‘‘నాయనా సిరియాళా! ఎక్కడున్నా వెంటనే రా! నీ కోసం అతిథి నిరీక్షిస్తున్నాడు’’ అని గట్టిగా అరిచారు. ఆశ్చర్యం. ఆడుకొంటున్న పిల్లవాడు తల్లి పిలవగానే బయటి నుండి ఇంటికి వచ్చినట్లుగా గబగబ లోనికి వచ్చాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై తాను పెట్టిన పరీక్షలో వారు కృతార్థులైనట్లు చెప్పి ఆశీర్వదించాడు. ఆ రకంగా బాల్యంలోనే శివునికి ఆహారంగా తనను తాను సమర్పించుకోవడానికి ఏమాత్రమూ సంకోచించక రోట్లో తలపెట్టిన సాహసిక బాలభక్తుడు సిరియాళుడు.
 
శంకరాచార్యులు

ఆధునిక చారిత్రక కాలానికి వస్తే శంకరాచార్యులు బాల్యంలోనే మహాభక్తుడు కావడమే కాదు, భారతదేశమంతా పాద చారియై సంచరించి, ఎన్నో ఆధ్యాత్మిక పీఠాలను స్థాపించి, నాస్తిక వాదాలను ఖండించి, అసంఖ్యాకంగా గ్రంథాలను వ్రాసి, ముఖ్యంగా ప్రస్థానత్రయమనే వేదాంతశాస్త్రానికి మహాభాష్యాన్ని అందించిన మహనీయుడు. వాని తల్లిదండ్రులు కూడా శివకటాక్షంతో శంకరునికి జన్మనిచ్చారు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరుగుతూ చిన్న వయసులోనే భగవంతునియందు అచంచలమైన భక్తిని సముపార్జించుకోవడమే కాక, తన మనసు నిండా వైరాగ్యభావాన్ని నింపుకొన్నాడు.

సంసారమంటే ఏమిటో కూడా తెలియని వయసులోనే సంసారంపై విరక్తిని పెంచుకొన్నాడు. సన్యాసిగా జీవితాన్ని గడపాలనుకొన్నాడు. కాని తల్లి అందుకు అంగీకరించలేదు. తల్లి అనుమతి లేనిదే సన్యాసదీక్షను స్వీకరించేందుకు అర్హత లేదు. ఎలా అయినా ఆమెను ఒప్పించాలని, చిన్ననాటి నుండే తపస్సు ప్రారంభించాడేమో ఆ శక్తితో తల్లి చూస్తుండగా ఒక నదిలో స్నానం చేస్తూ ఒక కపటపు మొసలిని సృష్టించాడు. అది వాని కాలిని పట్టుకొని నీటిలోనికి లాగసాగింది. ‘‘అమ్మా! నన్ను మొసలి పట్టుకొంది. నన్ను నీటిలోనికి లాగేస్తోంది’’ అని వాపోయాడు.

పాపం తల్లి గట్టు మీద నుండే ఏడుస్తూ కేకలు వేస్తోంది. ‘‘అమ్మా! సన్యాసిని మొసలి తినదు. కనుక నేను సన్యాస దీక్ష తీసికోవడానికి నీవు అనుమతిని ఇస్తే ఇప్పటికిప్పుడే సన్యాసదీక్షను తీసికొంటాను. మొసలి నన్ను వదిలేస్తుంది. నేను బతుకుతాను’’ అన్నాడు. బిడ్డ బతికితే అదే చాలు అనుకొని ‘‘అలాగే’’ అని అనుమతినిచ్చింది తల్లి. అంతే మొసలి మాయమైపోయింది. శంకరుడు సన్యాసిగా బయటికి వచ్చాడు. శంకరాచార్యులయ్యాడు. జగద్గురువుగా మిగిలిపోయాడు.

ఇలా బాల్యంలోనే భక్తికి భాష్యం చెప్పిన మహనీయులు ఎందరో ఉన్నారు. మన పిల్లలకు వారి చరిత్రలను చెప్పాలి. వారిలో ఉత్తేజాన్ని కలిగించాలి. రాబోయే కాలంలో మంచి సమాజం ఏర్పడేందుకు అనుగుణంగా ఈనాడే మన బాలల మనస్సులను మనమే తీర్చిదిద్దాలి. అప్పుడే భావి ప్రపంచం ప్రశాంతంగాను, ఉదాత్తంగాను, సంస్కారవంతంగాను జీవిస్తుంది. నేటి బాలలే రేపటి మహాభక్తులు.

- గురుసహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement