చదవని బైబిల్.. వెలగని కాగడా వంటిదే!
• సువార్త
గలిలయకు 150 కిలో మీటర్ల దూరంలో యెరూషలేముంటుంది. యేసు బోధ విని బాగుపడేందుకు కాదు, ఆయన బోధల్లో లోపాలెత్తి చూపించి, ఆయనకే ఎదురు బోధ చేసేందుకు వాళ్లంతా అంత ప్రయాసపడి రావడం ఆశ్చర్యకరం!! యేసును చూసి, ఆయన బోధ వినే భాగ్యాన్ని పొందిన ఎంతోమంది నిరక్షరాస్యులు, అజ్ఞానులు తమ జీవితాన్ని ధన్యం చేసుకొంటుండగా, మహా మేధావులుగా ముద్రపడినవారు ఆ భాగ్యాన్ని చేజార్చుకొని, యేసుతో వాతలు వేయించుకొని భ్రష్టులుగానే తిరుగుముఖం పట్టిన పరిసయ్యులనేమనాలి? కొందరంతే!! బోధ చేయడానికి, ఖండించడానికి, గద్దించడానికి ఇతరులకు బుద్ధి చెప్పడానికే తాము పుట్టామన్న దుర్భావనలో ఉంటారు (2 తిమోతి 4:2). కాని దానికి ముందుగా తమలోని అజ్ఞానపు అంధకారాన్ని గుర్తించి సరిచేసుకోలేని గురివింద గింజలు వాళ్లు.
అలా పప్పులో కాలేసి చివరికి నరకంలో చేరే మాట అటుంచితే, లోపాలెత్తి చూపడం, విమర్శించడమే వ్యాపారంగా మారి విజ్ఞత లోపించిన తొందరపాటు నిర్ణయాలతో ఈ లోకంలోనే తమ జీవితాన్ని అశాంతితో నరకప్రాయం చేసుకుంటారు వాళ్లు. ఎంత ఉన్నా ఇంకేదో పొందలేకపోతున్నామన్న అభద్రతా, అసంతృప్తి భావన పరోక్షంగా వారి మాటలు, చేతల్లో ధ్వనిస్తూంటుంది. దేవుని బోధలు వినేందుకు ఈనాడు వందల మైళ్లు ప్రయాణించే అవసరం లేదు.
దేవుని మాటలు, బోధల సంగ్రహ సారాంశంగా బైబిలు గ్రంథం విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది. బైబిలు గ్రంథం జీవితాన్ని సరైన బాటలో నడిపించే కాగడాలాంటిది. అయితే దాన్ని ^è దివినపుడు మాత్రమే అలా వెలిగే కాగడా అవుతుంది. చదవని బైబిలు గ్రంథం, వెలగని కాగడావంటిదే! దైవ భయంతో, వినమ్రతతో, అత్యంత విధేయతతో చదివితే అది జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఆనందమయం చేస్తుంది. విమర్శించడానికో, లోపాలు చూడడానికో మిడిమిడి జ్ఞానపు మేధావిలాగా చదివితే మాత్రం జీవితంలో మిగిలేది అంధకారమే, అశాంతే, భ్రష్టత్వమే. – రెవ.డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్