ఎటుచూసినా ఉట్డిపడుతున్న కళాసంపద...జెరూసలెం నుంచి తెచ్చిన మట్టి..బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు.. భక్తులే భాగస్వాములై రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లోపాలుపంచుకున్న వైనం.. ఏకకాలంలో సుమారు 30 వేల మంది ప్రార్థన చేసుకొనే వీలు..
ఇవీ వరంగల్ శివారు కరుణాపురంలో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నిర్వాహకులు పేర్కొంటున్న ఈ ప్రార్థనా మందిరం ఈ నెల 4న అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంబోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, అన్ని వర్గాల వారిని అహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు, దైవజనులు పాల్సన్‌రాజ్, జయప్రకాష్లు తెలిపారు. లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు.
అద్భుత కట్టడంగా..
కరుణాపురం క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం అపురూప కట్టడంగా దర్శనమిస్తోంది. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేశారు. రెండంతస్తుల్లో హాల్‌ను రూపొందించారు. చర్చి నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 70 కోట్లు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా, మొత్తంగా 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు.
ఇందులో ఒకేసారి 30 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. వికీపీడియా ప్రకారం ఆసియాలో అతిపెద్ద చర్చిగా నాగాలాండ్‌లోని జున్‌హెబోటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చి ఉంది. ఆ చర్చి పొడవు 203 అడుగులు, వెడల్పు 153 అడుగులు, ఎత్తు 166 అడుగులు. అందులో ఏకకాలంలో 8,500 దాకా ప్రార్థనలు చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కరుణాపురంలో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్‌తో అనుబంధంగా ఉండటం విశేషం.
ప్రత్యేకతలు ఇవీ..
♦ చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని (డోమ్) అమెరికా నుంచి తెప్పించారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం కొనుగోలు చేశారు.
♦ మందిరం లోపల రీసౌండ్ రాకుండా సౌండ్‌ప్రూఫ్ మెటీరియల్ అద్దారు.
♦ భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు.
♦ ప్రార్థనామందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు.
♦ పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు. చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని అద్దాల చిత్తరువులతో రూపొందించారు.
♦ ఎల్‌ఈడీ స్క్రీన్స్‌తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
♦ చుట్టూ దీపస్తంభాలు.. ఇంకుడు గుంతలు నిర్మించారు.
♦ భవనం శంకుస్థాపనలో జెరూసలెం నుంచి మట్టి.. బైబిల్‌లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్లు వేశారు. చర్చి చుట్టూ ఆలివ్ (ఏసుక్రీస్తు ప్రార్థనలు ఈ ఆలివ్ చెట్ల మధ్యనే ప్రార్థనలు చేసేవారు) చెట్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment