ఆయన నిన్ను ఎన్నడు విడువడు!
సువార్త
నీ దేవుడనైన యెహోవానగు నేను - భయపడకుము, నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. - యెషయా 41:13
బిడ్డ పడిపోకుండా తండ్రి చేయి పట్టుకుంటాడు. నడక నేర్పిస్తాడు. దారి చూపిస్తాడు. ప్రభువు కూడా అంతే. ఆయన ఎప్పుడూ మన చేయి పట్టుకునే ఉంటాడు. మనం నడవాల్సిన తోవను మనకు చూపిస్తాడు. దారి తప్పిన ప్రతిసారీ దారిలోకి తీసుకొస్తాడు. చేరాల్సిన గమ్యానికి చేర్చుతాడు. నాటి ఇశ్రాయేలీయుల నుంచి నేటి మన వరకు ఆయన అదే చేశాడు. ఎన్నడూ మాట తప్పలేదు. నేను నీ చేయిపట్టి నడిపిస్తాను అని చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు.
నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటూ ఇశ్రాయేలీయులకు మాటిచ్చాడు ప్రభువు. అన్న విధంగానే వారిని బానిసత్వం నుంచి విడిపించాడు. కష్టమన్నదే ఎరుగని దేశానికి వారిని నడిపించాడు. కొండలు, గుట్టలు దాటుకుంటూ వారు వెళ్తుంటే కాళ్లకు సత్తువనిచ్చాడు. అడవుల గుండా నడుస్తున్నప్పుడు క్రూరమృగమైనను, విష కీటకమైనను వారి దరికి రాకుండా అడ్డుకున్నాడు. సముద్రాన్ని చీల్చాడు. మన్నాను కురిపించి కడుపులు నింపాడు. కడదాకా వారికి అండగా ఉన్నాడు. కావలి కాశాడు. అదే ఆయన ప్రేమ. తన బిడ్డల పట్ల ఆయనకున్న మమత.
అదే ప్రేమ, అదే మమత మన పట్ల కూడా కురిపిస్తున్నాడు తండ్రి. లోకం పాప పంకిలమైపోయిందని ఆయనకు తెలుసు. మనం కట్టడులు మీరుతున్నామని కూడా ఆయనకు తెలుసు. ఆదర్శంగా ఉండాల్సిన తన బిడ్డలు తనను విస్మరించినా... ఆయన మాత్రం మనలను విస్మరించడు. అందుకే దావీదు మహారాజు... విడువని, యెడబాయని దేవుడవు అంటూ ప్రభువును వేనోళ్ల స్తుతించాడు. మరి అంత చేస్తున్న దేవునికి మనమేం చేస్తున్నాం? ఆయన చూపించే ప్రేమకి మారుగా మనమేమి ఇస్తున్నాం? ఏమీ లేదు. కనీసం ఆయన చూపే ప్రేమానురాగాలకు కృతజ్ఞత కూడా చూపడం లేదు మనం. ఆయన ఏం కోరుకున్నాడు? కానుకలు అడగలేదు. అభిషేకాలు కోరలేదు. కల్మషాన్ని వదిలేయమన్నాడు. కారుణ్యతను ప్రదర్శించమన్నాడు. పొరుగువాడిని ప్రేమించమన్నాడు. తనకు మాదిరిగా నడుచుకొమ్మన్నాడు. క్షమించమన్నాడు. సహించమన్నాడు.
అది కూడా చేయలేము మనం. విశ్వాసులమని చెప్పుకుంటూ ఆయన మాటలను పెడచెవిన పెట్టి, విశ్వాస ఘాతుకానికి పాల్పడుతూనే ఉంటాం. అందుకే మనం ఆయన ప్రేమను పొందడానికి అనర్హులం. కానీ ఆయన ఎన్నడూ అలా అనుకోడు. సణగడు. ఆగ్రహించడు. మనల్ని దూరంగా నెట్టేయడు. మన మొరలు ఆలకించకుండా తన చెవులను కప్పుకోడు.
మన అగచాట్లు చూడకుండా కన్నులు మూసుకోడు. నా దారిలో నడవని మీ దారికి నేను రానే రానంటూ ఒంటరిగా వదిలేయడు. ఏ ఒక్క సమయంలోనూ మన చేతిని విడిచి పెట్టడు. ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. దారి తప్పిపోతున్న తన కుమారులను దారిలో పెట్టేవరకూ విడువడు. భీతిల్లిన మనసుల్లో ధైర్యం నిండేవరకూ విడువడు. తన బిడ్డల కన్నుల్లో కన్నీళ్లు ఇంకేవరకూ విడిచిపెట్టడు. కళ్లు తుడుస్తాడు. వెన్ను తడతాడు. అవును... ఆయన మన చేయి విడువడు. ఎన్నడూ విడువడు!
- జాయ్స్ మేయర్