Joyce Meyer
-
దేవునిపై విశ్వాసం నిశ్చింతగా ఉంచుతుంది
సువార్త నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యెహోవా వాక్కు. - యిర్మియా 29:11 జీవితంలో ప్రతిదీ మనం అనుకున్నట్లు, మనం ఆశించినట్లు జరగకపోవచ్చు. అంతమాత్రాన మనం నిరుత్సాహం చెందకూడదు. మనకు ఎదురైన దానినే మనం స్వీకరించాలి. దేవుడు మన మంచి కోసం దానిని ఏర్పరిచాడని విశ్వసించాలి. దేవుడు మనకు హాని తలపెట్టడు. తన పిల్లల కోసం ఆయన ఏది సంకల్పించినా, ఎలాంటి ప్రణాళికను సిద్ధం చేసి ఉంచినా అది హితవు కోసమే అయి ఉంటుంది. మనకు ఏది మంచో, మనకు ఏది అవసరమో దేవునికి తెలిసినంతగా మనకు గానీ, మరెవ్వరికి గానీ తెలియదు. దేవుని ద్వారా మనకు సంభవించే దాని గురించి సందేహాలు అవసరం లేదు. జీవితంలో మనకు జరిగిన, జరగబోతున్న మంచి అంతా ఆయన నుంచే వెలుగులా మనపై ప్రసరిస్తుంది. దేవుడు మనల్ని కోరేది ఒక్కటే. తనను విశ్వసించమని. తనను నమ్మి నిశ్చింతగా ఉండమని. - జాయ్స్ మేయర్ -
దైవం ఇచ్చిన బహుమానం
సువార్త బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దానినుండి తొలగిపోడు. - సామెతలు 22:6 ఈ ప్రపంచంలో కల్మషం లేనిది ఏదైనా ఉంది అంటే... అది పసివాళ్ల మనసే అని చెప్పాలి. కానీ ఆ నిష్కల్మషత్వం ఎప్పటి వరకు ఉంటుంది! ఈ లోకం గురించి తెలుసుకునే వరకూ ఉంటుంది. లోకాశలకు లోబడే వయసు రానంతవరకే ఉంటుంది. ఆ తర్వాత వారి బాట వేరవుతుంది. దేవుడి నుంచి దూరమవుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే వారిలో మంచి అనేది చిన్నతనంలోనే పెరగాలి. అలా పెరిగేలా తల్లిదండ్రులు చూడాలి. అందుకే పిల్లల పెంపకం గురించి తల్లిదండ్రులకు ఎన్నో విషయాలు చెప్పాడు ప్రభువు. వారిని సరైన దారిలో పెంచాల్సిన బాధ్యత మీదే అని పదే పదే హెచ్చరించాడు. పైన చెప్పుకున్న వాక్యమే అందుకు నిదర్శనం. అంతేకాక... ‘‘తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక, ప్రభువు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి’’ అన్నాడు ప్రభువు ఎఫెసీ 6:4లో. ఈ ఒక్క మాట చాలు పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడానికి. కోపం మనిషికి శత్రువు. అది మనిషిని విచక్షణా రహితుణ్ని చేస్తుంది. తప్పులు చేయిస్తుంది. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. ఆ దూరంగా ఉండటం అన్నది చిన్ననాటి నుంచే జరగాలి. కోపమనే విత్తును పిల్లల మనసుల్లో నాటకుండా ఉండాలి. దేవుడి బోధలను, ప్రవచనాలు వివరించి... వాటిని అనుసరించి నడచుకునే విధంగా వారిని తీర్చిదిద్దాలి. నిజానికి పిల్లలు ఎలా ఉండాలి అన్నదానికి అత్యంత గొప్ప ఉదాహరణ యేసుక్రీస్తే. తన తండ్రియైన యెహోవా దేవుని ఆజ్ఞ మేరకు క్రీస్తు ఈ లోకంలో మనిషిగా జన్మించాడు. తన తండ్రి రాజ్యాన్ని ఈ నేలమీద స్థాపించాడు. తన తండ్రి ఆదేశించిన విధంగా శిలువ మరణం పొందాడు. ఓ గొప్ప కొడుక్కి అసలు సిసలు ఉదాహరణ క్రీస్తు. మరి మనకొద్దా అలాంటి గొప్ప బిడ్డలు! గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం (కీర్తనలు 127:3). ఆయన ఇచ్చిన బహుమానాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యాన్ని ఆయన ఘనతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా చేయాల్సిన బాధ్యత మనది. కాబట్టి పిల్లల నడవడికను కనిపెట్టాలి. నడవాల్సిన తోవను చూపించాలి. చేరాల్సిన గమ్యాన్ని నిర్దేశించాలి. - జాయ్స్ మేయర్ -
ఆయన నిన్ను ఎన్నడు విడువడు!
సువార్త నీ దేవుడనైన యెహోవానగు నేను - భయపడకుము, నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను. - యెషయా 41:13 బిడ్డ పడిపోకుండా తండ్రి చేయి పట్టుకుంటాడు. నడక నేర్పిస్తాడు. దారి చూపిస్తాడు. ప్రభువు కూడా అంతే. ఆయన ఎప్పుడూ మన చేయి పట్టుకునే ఉంటాడు. మనం నడవాల్సిన తోవను మనకు చూపిస్తాడు. దారి తప్పిన ప్రతిసారీ దారిలోకి తీసుకొస్తాడు. చేరాల్సిన గమ్యానికి చేర్చుతాడు. నాటి ఇశ్రాయేలీయుల నుంచి నేటి మన వరకు ఆయన అదే చేశాడు. ఎన్నడూ మాట తప్పలేదు. నేను నీ చేయిపట్టి నడిపిస్తాను అని చేసిన ప్రమాణాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానంటూ ఇశ్రాయేలీయులకు మాటిచ్చాడు ప్రభువు. అన్న విధంగానే వారిని బానిసత్వం నుంచి విడిపించాడు. కష్టమన్నదే ఎరుగని దేశానికి వారిని నడిపించాడు. కొండలు, గుట్టలు దాటుకుంటూ వారు వెళ్తుంటే కాళ్లకు సత్తువనిచ్చాడు. అడవుల గుండా నడుస్తున్నప్పుడు క్రూరమృగమైనను, విష కీటకమైనను వారి దరికి రాకుండా అడ్డుకున్నాడు. సముద్రాన్ని చీల్చాడు. మన్నాను కురిపించి కడుపులు నింపాడు. కడదాకా వారికి అండగా ఉన్నాడు. కావలి కాశాడు. అదే ఆయన ప్రేమ. తన బిడ్డల పట్ల ఆయనకున్న మమత. అదే ప్రేమ, అదే మమత మన పట్ల కూడా కురిపిస్తున్నాడు తండ్రి. లోకం పాప పంకిలమైపోయిందని ఆయనకు తెలుసు. మనం కట్టడులు మీరుతున్నామని కూడా ఆయనకు తెలుసు. ఆదర్శంగా ఉండాల్సిన తన బిడ్డలు తనను విస్మరించినా... ఆయన మాత్రం మనలను విస్మరించడు. అందుకే దావీదు మహారాజు... విడువని, యెడబాయని దేవుడవు అంటూ ప్రభువును వేనోళ్ల స్తుతించాడు. మరి అంత చేస్తున్న దేవునికి మనమేం చేస్తున్నాం? ఆయన చూపించే ప్రేమకి మారుగా మనమేమి ఇస్తున్నాం? ఏమీ లేదు. కనీసం ఆయన చూపే ప్రేమానురాగాలకు కృతజ్ఞత కూడా చూపడం లేదు మనం. ఆయన ఏం కోరుకున్నాడు? కానుకలు అడగలేదు. అభిషేకాలు కోరలేదు. కల్మషాన్ని వదిలేయమన్నాడు. కారుణ్యతను ప్రదర్శించమన్నాడు. పొరుగువాడిని ప్రేమించమన్నాడు. తనకు మాదిరిగా నడుచుకొమ్మన్నాడు. క్షమించమన్నాడు. సహించమన్నాడు. అది కూడా చేయలేము మనం. విశ్వాసులమని చెప్పుకుంటూ ఆయన మాటలను పెడచెవిన పెట్టి, విశ్వాస ఘాతుకానికి పాల్పడుతూనే ఉంటాం. అందుకే మనం ఆయన ప్రేమను పొందడానికి అనర్హులం. కానీ ఆయన ఎన్నడూ అలా అనుకోడు. సణగడు. ఆగ్రహించడు. మనల్ని దూరంగా నెట్టేయడు. మన మొరలు ఆలకించకుండా తన చెవులను కప్పుకోడు. మన అగచాట్లు చూడకుండా కన్నులు మూసుకోడు. నా దారిలో నడవని మీ దారికి నేను రానే రానంటూ ఒంటరిగా వదిలేయడు. ఏ ఒక్క సమయంలోనూ మన చేతిని విడిచి పెట్టడు. ఇంకా ఇంకా గట్టిగా పట్టుకుంటాడు. దారి తప్పిపోతున్న తన కుమారులను దారిలో పెట్టేవరకూ విడువడు. భీతిల్లిన మనసుల్లో ధైర్యం నిండేవరకూ విడువడు. తన బిడ్డల కన్నుల్లో కన్నీళ్లు ఇంకేవరకూ విడిచిపెట్టడు. కళ్లు తుడుస్తాడు. వెన్ను తడతాడు. అవును... ఆయన మన చేయి విడువడు. ఎన్నడూ విడువడు! - జాయ్స్ మేయర్