వజ్రసంకల్పాన్ని వృద్ధాప్యం నీరుగార్చలేదు!
సువార్త
వాగ్దాన దేశమైన కానానులో ఇశ్రాయేలీయులకు గోత్రాలవారీగా భూభాగాలను వారి నాయకుడైన యెహోషువ పంచుతున్నాడు. అందరి దృష్టీ మంచి భూభాగాలను పొందడంపైనే ఉంది. రూబేను, గాదు, మనష్షే గోత్రాల వాళ్లైతే సస్యశ్యామలమైన గిలాదు ప్రాంతాన్ని తీసుకుంటే, యూదా గోత్రానికి చెందిన కాలేబు వచ్చి అనాకీయులనే మహాబలవంతులు, అత్యంత క్రూరులు నివసించే కొండప్రాంతాన్ని తనకివ్వమని కోరాడు. అది ఎవరూ కోరుకోని హెబ్రోను ప్రాంతం. అనాకీయులనే బలవంతుల చేతుల నుండి తీసుకోవడం అసాధ్యమైన ప్రాంతం కూడా. మోషే ఒకప్పుడు వాగ్దాన దేశాన్ని వేగు చూసేందుకు 12 మందిని పంపగా ఈ అనాకీయులను, వాళ్ల బలాన్ని చూసి వారిలో కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన 10 మంది భయంతో వణికిపోయారు.
అంతటి బలవంతులను గెల్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అసాధ్యమంటూ పిరికితనంతో మాట్లాడారు. కాలేబు, యెహోషువ మాత్రం దేవుడు మనతో ఉండగా అది సాధ్యమేనన్నారు. ఆ అనాకీయుల దేశాన్ని తనకివ్వమంటున్నాడు కాలేబు (యోహో 14:6-13). ఏదైనా కోరుకోవలసి వస్తే ఎవరైనా సులువైనది, లాభకరమైనది, ఇంపైనదే కోరుకుంటారు. కాని కాలేబు అత్యంత సంక్లిష్టమైన, రాళ్లు రప్పలున్న కొండప్రాంతాన్ని కోరుకోవడం దేవుని పట్ల అతనికున్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. పైగా 85 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా తన బలం తగ్గలేదంటాడు. అదెలా సాధ్యం? బలం, అందం వంటి బాహ్యాంశాలు వయసు పెరిగే కొద్దీ క్షీణించడం శరీర ధర్మం, అనివార్యం కూడా! ఒకప్పటి కండల వీరులంతా వృద్ధాప్యం తాకిడికి పగిలిన కుండల్లా నిర్వీర్యమవుతారు. కాని విశ్వాస వీరులు మాత్రం కాలేబులాగే ఉంటారు.
కాలేబు వృద్ధుడే. అయితే అప్పుడూ ఇప్పుడూ కూడా అతని నమ్మకం దేవుని అండ మీదే! తన కండల మీద కాదు. ఈ 45 ఏళ్లలో శరీరం కృశించిపోయినా, ఆంతర్యంలో దేవునిలో అతనెంతో బలపడ్డాడు. అందుకే తన బలం తగ్గలేదంటున్నాడు, అనాకీయుల ప్రాంతాన్ని సవాలుగా స్వీకరిస్తానంటున్నాడు. కాలేబు, యెహోషువతో మాట్లాడిన మాటలు 8 వచనాల్లో ఉన్నాయి. ఆ ఎనిమిది వచనాల్లో తొమ్మిదిసార్లు దేవుని పేరు ప్రస్తావించాడంటే కాలేబుకు దేవుని పట్ల ఎంత నిబద్ధత, విశ్వాసమున్నదో అర్థం చేసుకోవచ్చు. యెహోషువ అతని కోరిక మేరకు హెబ్రోనునే కాలేబుకిచ్చాడు.
తాను చెప్పినట్టే అక్కడి అనాకీయులను మట్టి కరిపించి హెబ్రోనును స్వాధీనం చేసుకోవడమే కాదు, కాలేబు, అతని వంశీయులు ఆ కొండ ప్రాంతాన్ని ఒలీవ, ద్రాక్షతోటలున్న వ్యవసాయ క్షేత్రంగా మార్చుకున్నారు. ఏవో చిన్న విజయాలు సాధించడం కాదు, దేవుని అండతో మహా జయాలు సాధించాలన్న వజ్రసంకల్పం విశ్వాసికి ఉండాలి. అందుకు ఉడిగిపోయిన బలం, వృద్ధాప్యం అడ్డు రానే రాదనడానికి కాలేబు జీవితమే సాక్ష్యం!
- రెవ.టి.ఎ.ప్రభుకిరణ్