ప్రేమ, క్షమ లేకుంటే... సమాజమే ఎడారి | special story of jesus | Sakshi
Sakshi News home page

ప్రేమ, క్షమ లేకుంటే... సమాజమే ఎడారి

Published Sun, Feb 28 2016 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM

ప్రేమ, క్షమ లేకుంటే... సమాజమే ఎడారి

ప్రేమ, క్షమ లేకుంటే... సమాజమే ఎడారి

సువార్త
ఒనేసిము ఒకప్పుడు ఫిలేమోను అనే ధనికుని వద్ద బానిసగా ఉండి పారిపోయినవాడు. అయితే అతనికి అపొస్తలుడైన పౌలు పరిచయమయ్యాడు. తద్వారా యేసుక్రీస్తును తెలుసుకొని విశ్వాసి అయ్యాడు. పారిపోయిన బానిసలకు, వారి యజమానులు క్షమిస్తే తప్ప, రోమా ప్రభుత్వం మరణశిక్ష విధించే రోజులవి. పైగా పారిపోయిన బానిసలకు వారి యజమానులు క్షమించడం కూడా జరిగేది కాదు. కాని ఫిలేమోను కూడా తన ద్వారానే ప్రభువును తెలుసుకున్నవాడు గనుక ఒనేసిమును బానిసగా కాక విశ్వాసిగా పరిగణించి అతన్ని క్షమించమని కోరుతూ పౌలు అతనికి ఒక లేఖ రాసి ఒనేసిముతోనే పంపించాడు. అతని వల్ల జరిగిన నష్టాన్ని తన ఖాతాలో వేస్తే తానే చెల్లిస్తానని కూడా పౌలు తెలిపాడు. పౌలు అభ్యర్థన మేరకు ఫిలేమోను అతన్ని క్షమించగా ఎఫెసీలోని చర్చికి తిమోతి తరువాత ఒనేసిము కాపరి అయ్యాడని, అలా అద్భుతమైన పరిచర్య చేశాడని చరిత్ర చెబుతోంది (ఫిలే 1:8-22).

 దేవుడు శ్రుతి చేసిన విశ్వాసి అద్భుతమైన రాగాలు పలుకుతాడు, ప్రేమ, క్షమ అతనిలో పరిమళిస్తుంది. పౌలు, ఫిలేమోను, ఒనేసిముల్లో అదే జరిగింది. ఫిలేమోను ధనికుడైన యజమాని, ఒనేసిము పారిపోయిన బానిస, నేరస్తుడు. కాగా పౌలు వారిద్దరికీ ఆత్మీయతండ్రి. సామాజికంగా ఈ ముగ్గురి మధ్యా ఎన్నో అంతరాలున్నా, దేవుని ప్రేమ, క్షమ అనే ఉమ్మడి అంశాలు పునాదిగా వారి మధ్య అపూర్వమైన అనుబంధం పరిమళించింది. ఫలితంగా ఆ ముగ్గురి సమిష్టి కృషితో దేవుని రాజ్య నిర్మాణం జరిగింది. దేవునితో అనుబంధం బలంగా ఉన్న విశ్వాసి జీవితంలోని ప్రతి అనుబంధమూ, బాంధవ్యమూ అత్యంత ప్రేమమయంగా ఉంటుంది.

ప్రతి బాంధవ్యాన్ని కూడా దేవుడు తనను ప్రేమించినట్టుగా లోకాన్ని ప్రేమించే ఒక సదవకాశంగా భావిస్తాడు. అందుకే ఒక తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, సోదరుడిగా, సోదరిగా, మిత్రుడిగా, దేశపౌరుడిగా అత్యున్నతమైన విలువల స్థాపనకు విశ్వాసి శ్రమిస్తాడు. అలా మొత్తం సమాజాన్ని ప్రభావితం చేస్తాడు. అయితే విశ్వాసులు కానివారి దృష్టిలో సమాజమంతా ఒక మాయా ప్రపంచం. తోటి మనుషులంతా అవసరార్థమైన సాధనాలు, పెకైగబాకేందుకు ఉపయోగపడే నిచ్చెనలు!! ఈ దుష్ట, భ్రష్ట విషవలయం నుండి విముక్తినిచ్చి విశ్వాసిని సమాజాన్ని కూడా ప్రభావితం చేసి ప్రేమామయం చేసేది దేవుని శక్తి. మన దైనందిన సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ, నిజాయితీ, నిస్వార్థత లేకపోతే ఆ బంధాలకు అసలు విలువేలేదు.

తన సామాజిక బంధాల్లోనే నిజాయితీ లేనివాడుూ దేవునితో గల బాంధవ్యంలో నిజాయితీ కలిగి ఉంటాడనుకోవడం కేవలం భ్రమ!! అలాంటి వారి ప్రార్థనలు, అర్పణలు, పాటలు, ప్రసంగాలు, ఆరాధనలకు దేవుని దృష్టిలో అసలు విలువ లేదు. శ్రుతిలేక అపస్వరాలు పలికే వయోలిన్ వంటిదే ప్రేమ కరువైన సమాజం. ఊర్లో పోస్ట్‌మాన్‌ని మామా అని, ఇంటికొచ్చి గాజులమ్మిన వ్యక్తిని బాబాయ్ అని, చింతకాయలు కోసిచ్చిన అపరిచితున్ని అన్నా అని, పొరుగిళ్లలో వాడల్లో బోలెడు మంది అత్తలు, పిన్నిలు, మామయ్యలు, బాబాయ్‌లు, తాతలు, అవ్వల్ని కలిగి ఉన్న ఎంతో ఆప్యాయతాభరితమైన సమాజం ఒకప్పుడు మనది. కాలక్రమంలో ఆధునికత కాటుకు అది అంతరించింది. స్వార్థం, ధనార్జన తప్ప మరొకటి కానరాని నేటి సమాజపు విష కౌగిలిలో ఇప్పుడు స్వచ్ఛందంగా భాగమై నలిగిపోతున్నాం. పాపిని ప్రేమించి పరలోకాన్ని వదిలి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తును కలిగి ఉండటమే ఒక తియ్యటి అనుబంధం. ఆ ప్రేమ విశ్వాసి ద్వారా లోకమంతా వ్యాపిస్తే అదే అసలైన ఆరాధనానుభవం!!   - రెవ.టి.ఎ. ప్రభుకిరణ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement