
పూజా భట్
‘‘చెడు అలవాట్లకు బానిసయినవాళ్లను విమర్శించడం కంటే అసలు దానికి ఎందుకు బానిస అయ్యారనే విషయాన్ని తెలుసుకోవాలి. కానీ విమర్శించడం అలవాటై, ఆ విషయాన్ని మనం పెద్దగా పట్టించుకోం’’ అన్నారు నటి, దర్శకురాలు పూజా భట్. గతంలో ఆమె మద్యానికి బానిస అయి, అందులో నుంచి బయటపడ్డారు. పలు సందర్భాల్లో ఈ విషయం గురించి ప్రస్తావించారామె.
తాజాగా మరోసారి మద్యం అలవాటు నుంచి బయటపడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘మూడు సంవత్సరాల తొమ్మిది నెలలయింది మద్యం మానేసి. ఇంకో మూడు నెలలయితే నాలుగేళ్లు పూర్తవుతాయి. నేను మందు ఎలా బహిరంగంగానే తీసుకున్నానో, అందులో నుంచి బయటపడిన విషయాన్ని కూడా ఓపెన్‌గానే చెబుతాను. ఎందుకంటే నా ప్రయాణం అందరికీ తెలియాలనుకున్నాను. మద్యం మత్తు నుంచి బయట పడాలనుకుంటున్న వాళ్లకు స్ఫూర్తిగా ఉంటుందనుకున్నా.
ఒక అలవాటు మానుకోవడానికి ఎంతో కృషి చేయాలి. మానేయాలనే పట్టుదలే మనల్ని మానేసేలా చేస్తుంది. మీరొక్కరే (మద్యానికి అలవాటుపడినవాళ్లు) ఒంటరిగా లేరు. మీలానే దీంట్లో నుంచి బయటపడాలనుకుంటున్నవాళ్లు చాలామందే ఉన్నారని తెలుసుకోండి. ఇలా బయటకు మాట్లాడినందుకు చాలా మంది నన్ను అభినందించారు. కొందరు ఎగతాళి కుడా చేశారు. ఏదైనా విషయానికి బానిసలైతే దానికి ఎందుకు బానిసలయ్యారో కనుక్కోవాలి’’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు పూజా భట్.
Comments
Please login to add a commentAdd a comment