
పగకు ప్రతిఫలంగా...ప్రేమను పంచండి
సువార్త
‘‘నీ పగవాడు ఆకలిగొనిన యెడల వానికి భోజనము పెట్టుము. దప్పిగొనిన యెడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు. యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. (సామెతలు 25:21,22)
కోపాన్ని జయించినవాడు ఉత్తముడని దేవుడు ఎప్పుడూ చెబుతూనే ఉన్నాడు. ఈ లోకంలో జరిగే ఎన్నో అనర్థాలకు మూలం కోపమే. దూషించుకోవడం, కొట్లాడుకోవడం, దాడి చేయడం, హతమార్చడం వంటి ఎన్నో నేరాలకు పురికొల్పేది కోపమే. మితిమీరిన కోపం పగగా మారుతుంది. అవతలి వ్యక్తికి కీడు చేసేందుకు ప్రేరేపిస్తుంది. అది తప్పు అని చెబుతున్నాడు ప్రభువు. కోపాన్ని అణచుకోలేక తిట్టడం, పగబట్టి హాని చేయడం కాదు... అతడిని ఆదరించి, ప్రేమ చూపించడమే అతడికి తగిన శిక్ష అని చెబుతున్నాడు.
మనలో చాలామంది చేసేదేమిటంటే... ఒక వ్యక్తిమీద కోపం వస్తే వారిని చూడటానికి కూడా ఇష్టపడం. పరుష పదజాలంతో మాట్లాడుతాం. కఠినంగా వ్యవహరిస్తాం. దాన్ని తాను ఏమాత్రం సమర్థించను అని చెప్పకనే చెబుతున్నాడు ప్రభువు. పగను సైతం ప్రేమతో సాధించమని సెలవిస్తున్నాడు.
పగవాడికి అన్నం పెట్టమంటున్నాడు. దాహమేస్తే మంచినీరు ఇమ్మంటున్నాడు. అలా చేయడం వల్ల అతడి తలమీద నిప్పులు కుప్పగా పోస్తావని ఆయన అన్నమాటకు అర్థం... నీ మంచితనంతో అతడిని సిగ్గుపరచేలా చేస్తావు అని. నిజమే కదా! చెడు చేయాలని చూస్తున్న వ్యక్తికి నువ్వు ప్రేమ చూపిస్తే, అతడిలో ఆ క్రూరమైన తలంపు నశించిపోతుంది.
తిరిగి మంచే చేయాలనిపిస్తుంది. క్రైస్తవుడిగా పగవాడిని ప్రేమతో మార్చు తప్ప పగ సాధించవద్దు అన్నదే ఈ వాక్యం ద్వారా దేవుడిస్తున్న సందేశం. అలా చేస్తే తన దీవెనలను మెండుగా కుమ్మరిస్తానని ఆయన మాట ఇస్తున్నాడు కూడా! కాబట్టి పగను వదలాలి. ప్రేమను పంచాలి. ఆవేశాన్ని సైతం ఆప్యాయతగా మార్చగల శక్తి దానికి మాత్రమే ఉంది మరి!
- జాయ్స్ మేయర్