దేవుడు ప్రేమతోనే కొన్ని ప్రార్థనలు నిరాకరిస్తాడు!
తన అద్భుతమైన సంకల్పాల కోసం దేవుడు ఇశ్రాయేలీయులను ప్రత్యేకించుకున్నాడు. వారిని గొప్పగా కాపాడి, పోషించాడు కూడా! తన ప్రజలుగా వారి జీవనశైలి ప్రత్యేకంగా ఉండాలని ఆశించి వారికి మార్గదర్శకంగా ధర్మశాస్త్రాన్నిచ్చాడు. వారిని న్యాయాధిపతులు మాత్రమే ఏలాలని, రాజులనేవారు వారి కుండకూడదని, తానే వారికి శాశ్వతమైన రాజునని దేవుడు సగర్వంగా ప్రకటించుకున్నాడు. కాని అందరిలాగే తమకూ ఒక రాజు కావాలని ఇశ్రాయేలీయులు కొన్నాళ్లకు పట్టుబట్టారు. అది ప్రమాదకరమే కాదు, దైవవ్యతిరేకమని అప్పటి న్యాయాధిపతియైన సమూయేలు ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినలేదు. వారికి శాశ్వతమైన రాజుగా ఉన్న తనను తృణీకరించి, మరోరాజు కావాలనుకోవడం వల్ల బాధపడిన దేవుడు వారికొక రాజును నియమించమని సమూయేలును ఆదేశించాడు. అలా సౌలు అనే వ్యక్తి ఇశ్రాయేలీయులకు మొదటి రాజయ్యాడు.
దేవుణ్ణి ఏదైనా అడిగి పొందే సర్వహక్కులూ, స్వాతంత్య్రం విశ్వాసికున్నాయి. పట్టుబట్టితే మనమడిగింది దేవుడివ్వొచ్చు కూడా. కాని అది దైవ సంకల్పానుసారమైనది కాకపోతే దాని దుష్పరిణామాలకు బాధ్యత విశ్వాసిదే!
ఆ తర్వాత వందేళ్లలో ఇశ్రాయేలీయుల రాచరికపు వ్యవస్థ కింద ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయంగా కూడా బాగా చితికిపోయారు. రెహబాము అనే నాల్గవ రాజు కాలం నాటికి ఇశ్రాయేలు దేశం రెండుగా చీలి మరింత బలహీనమైంది. ఫలితంగా శత్రుదేశాలకు బానిసలయ్యారు. అలా వారి వైభవానికి తెరపడి, చివరికి అవమానాలు, బానిసత్వం, వెట్టిచాకిరి, ఆకలి కేకలే మిగిలాయి
జీవితంలో కొన్నిసార్లు మనం తీసుకునే చిన్న నిర్ణయాలు పెద్ద తుఫానులు సృష్టించి పెనువిషాదాన్ని నింపుతాయి. దేవుణ్ణి ఏదైనా అడిగి పొందే సర్వహక్కులూ, స్వాతంత్య్రం విశ్వాసికున్నాయి. పట్టుబట్టితే మనమడిగింది దేవుడివ్వొచ్చు కూడా. కాని అది దైవ సంకల్పానుసారమైనది కాకపోతే దాని దుష్పరిణామాలకు బాధ్యత విశ్వాసిదే! దేవుణ్ణి అడిగేందుకు అవధుల్లేవు కాని పొందేందుకు పరిమితులున్నాయి. గె డ్డం గీసుకునే తండ్రిని ఐదేళ్ల కొడుకు తనకూ ఆ రేజర్ కావాలని అడిగితే తండ్రి ఇస్తాడా? ప్రేమించే ఏ తండ్రీ ఆ పని చేయడు. మన పరలోకపు తండ్రి అయిన దేవుడూ అంతే! దేవుడు మన ప్రార్థనలు కొన్ని నిరాకరించడం వెనుక సర్వోత్కృష్టమైన ఆయన ప్రేమ దాగి ఉన్నదని విశ్వాసి గ్రహించాలి. దేవుడే తమకు శాశ్వతమైన రాజుగా ఉంటే అదెంత ఆశీర్వాదకరమో, ఆనందదాయకమో అర్థం చేసుకోలేని ఆత్మీయాంధకారం ఇశ్రాయేలీయులది.
అందుకే తమకు రాజు కావాలని కోరడం ద్వారా దేవుణ్ణి ఆయనివ్వగల బంగారు భవిష్యత్తును పోగొట్టుకుంటున్నామని వారికి అర్థం కాలేదు. ‘మీరు అడగక మునుపే పరలోకపు తండ్రికి మీ అక్కరలు తెలుసు. అన్నది దివ్యమైన పరలోక ప్రార్థన నేర్పేముందు యేసుక్రీస్తు పలికిన ఉపోద్ఘాతపు మాటలు (మత్త 6:8) ప్రార్థించే ప్రతిసారీ మనమీ మాటలు గుర్తు చేసుకోవాలి. ఉధృతంగా పారే నదిని కూడా దాటగల శక్తి ఒక చిన్న దోనెది. అంతమాత్రాన దోనె నదికన్నా గొప్పది కాదు. నదినే దాటుతున్నాను కాబట్టి నదిలో నీళ్లన్నీ నాకే కావాలంటే మునిగిపోక తప్పదు. మన ప్రార్థనలు దేవుణ్ణే పక్కన పెట్టేవిగా ఉంటే మనమడిగే ఈవులే మనకు ఉరిగా మారుతాయి. మన ప్రార్థనలు మన జీవితంలో దేవుని స్థానాన్ని నానాటికీ మరింత పదిలం చేయాలి. ఆయన సంకల్పాల నెరవేర్పునకు మన జీవితం ఒక వేదిక కావాలి. మనం దేవుణ్ణి అడిగి పొందేవి మంచివి కావచ్చుకాని, మనమడిగినవి నిరాకరించి ‘దేవుడిచ్చేవి సర్వోత్తమమైనవి’ అని మర్చిపోరాదు.
- టి.ఎ.ప్రభుకిరణ్