కాకులా? అరవడానికి తప్ప అవెందుకు పనికొస్తాయి? అంటుంది లోకం. కరువులో చిక్కుకున్న నా సేవకుడు ఏలియాను పోషించేందుకు కాకులు నాకు చాలా ఉపయోగకరమైనవి అంటాడు దేవుడు. మనిషి ఆలోచనలకు, దేవుని ఆలోచనలకూ మధ్య ఇంత తేడా ఉంటుంది. కరువులో, కారడవిలోని కెరీతు వాగు దగ్గరి ఒక గుహలో ప్రార్థనాదీక్షలో అజ్ఞాతంగా ఉన్న ఏలియాకు మరి ఆహారమెలా? అని ఆలోచించిన ప్రేమామయుడు దేవుడు. అందువల్ల ప్రవక్తకు దేవుడు ప్రతిరోజూ కాకులతోనే ఆహారం పంపి పోషించాడు ( 1 రాజులు 17:4–6). ఇలా పేదలు. ధనికులు, పండితులు, పామరులన్న వివక్షకు తావులేని సమదృష్టి, సమ న్యాయమున్న దేవుని అనంతమైన ప్రేమను అపొస్తలులు సరిగ్గా ఒడిసిపట్టుకున్నారు కాబట్టే వాళ్ళు స్థాపించిన ఆదిమ చర్చి పేదరికంలో కూడా అత్యంత ప్రభావంతో విస్తరించి దేవునికి మహిమ తెచ్చింది. ఆదిమ కాలంలో చర్చిలన్నీ పేదలు, శరణార్థులైన విశ్వాసుల ఇళ్లలోనే స్థాపించబడ్డాయి, అందువల్ల చర్చి అనేది ఒక అనువైన స్థలమే తప్ప, అందమైన మహా కట్టడం కాదు.
అయితే దేవుని సహజ స్వభావమైన సార్వత్రిక ప్రేమ, సమన్యాయం, సమదృష్టికి దూరంగా, విరుద్ధంగా నడిచే ఏ చర్చి, పరిచర్య, విశ్వాస జీవితమైనా అది దైవవ్యతిరేకమైనదే. యేసు పరలోకారోహణ తర్వాత ఆనాడు మేడగదిలో వినూత్న విశ్వాసుల సమక్షంలో, వాళ్ళే సభ్యులుగా ఆవిర్భవించిన ‘చర్చి’ దేవుని అద్భుతమైన ప్రేమకు మరో సాదృశ్యం, సాధనం కూడా. అందుకే యేసుప్రభువు ప్రేమను భూదిగంతాలకు వెళ్లి ప్రకటించాలన్న దేవుని మహాభీష్టాన్ని నెరవేర్చే విశ్వాససమూహమైన చర్చికి యేసు ప్రభువే శిరస్సని పౌలు తన పత్రికల్లో వర్ణించాడు. చర్చికి దేవుడిచ్చిన విశిష్టమైన స్థానమిది. అయితే రాను రానూ బాహ్యసౌందర్యానికి, సంఖ్యాబలానికే ప్రాముఖ్యతనిచ్చిన కారణంగా కాపరులకు, చర్చి సభ్యులకు మధ్య అసలు సంబంధమే లేని మెగా చర్చిలు ఆవిర్భవించాయి. చర్చి కాపరి, చర్చిలో విశ్వాసులతోనే నివసిస్తూ ఒక తండ్రిగా, దేవుని ప్రేమ మూర్తీభవించిన ఒక నిస్వార్థ నాయకుడుగా, వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకునే ఆప్తుడని అర్థం.
ఆదిమ అపొస్తలులు అలాగే ఉన్నారు అందుకే చర్చి ద్వారా దేవుని ప్రేమ భూదిగంతాలకు పాకింది. అయితే చర్చి భవనాలు గొప్పగా నిర్మించి తాము కూడా చాలా గొప్పవాళ్లమనిపించుకోవాలన్న పరిచారకుల దురాశయం కారణంగా, మెగా చర్చిలు ఏర్పడ్డాయి.కానీ ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, నిరాశ్రయులను, నిరుపేదలను ఆదరించడమే నిజమైన క్రైస్తవమనే సత్యం మాత్రం పూర్తిగా మరుగున పడింది (మత్తయి 25: 35,36). ధనార్జనే ధ్యేయం గా, చివరికి బైబిల్‌లోని దశమభాగం సూత్రాన్ని వక్రీకరించి, నిరుపేదల నుండి కూడా ముక్కుపిండి డబ్బు వసూలు చేసే సుంకరుల్లాంటి కాపరుల తరంలో చర్చి వ్యాపార కేంద్రంగా మారింది.
ఒక్క చర్చి కోసం పడే శ్రమతోనే, వంద చర్చిల కానుకల్ని రాబట్టాలన్న వ్యాపారపు కాసుల గోలే తప్ప, విశ్వాసుల సంక్షేమమే పట్టని ఇలాంటి ‘చర్చి’కి యేసు శిరస్సు ఎలా అవుతాడు? దేవుడే విశ్వాసులతో పాటు ఉండాలనుకొని తనను తాను ‘ఇమ్మానుయేలు’ అంటే ‘దేవుడు మనకు తోడు’ అని పిలిపించుకోగా, విశ్వాసులకు దూరంగా ఉండాలనుకునే బోధకుడు ఆ దేవుని ప్రతినిధి ఎలా అవుతాడు? మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రా ణం పెడతాడని యేసుప్రభువన్నాడు (యోహాను 10:11). అలాంటి ప్రభువు దృష్టి్టలో ఈ కాపరులు ఏమవుతారు? కాకులు కూడా నాకు కావాలనుకున్న దేవుని ప్రేమ ఎక్కడ? ఎంతటి విశ్వాసులైనా నాకు వాళ్ళఖ్ఖర్లేదు. వాళ్ళిచ్చే కాసులు, నాకొచ్చే పేరే నాకు ముఖ్యం అనుకునే ఈ చర్చిలు, కాపరులెక్కడ?
–రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్
సంపాదకులు, ఆకాశధాన్యం
Comments
Please login to add a commentAdd a comment