అవును, మీరు సత్యసంధులు...
ప్రవక్త జీవితం
ప్రార్థన పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ‘ఏమిటిది? ఏదో కొత్తకొత్తగా ఉంది. ఎందుకిలా చేస్తున్నారు?’ అని ప్రశ్నించాడు అలీ ఏమాత్రం తడుముకోకుండా.
‘ఇది దేవుడు మానవుల కోసం పంపిన ధర్మం బాబూ! అనాదిగా ప్రవక్తలంతా లోకానికి ఇదే ధర్మాన్ని బోధిస్తూ వచ్చారు. ఇప్పుడు మానవులు అనుసరించాల్సిన ధర్మం ఇదే..!’ అన్నారు ముహమ్మద్ (స).
‘మరి ఈ రుకూలు, సజ్దాలేమిటి?’ మరో ప్రశ్న సంధించాడు ఆ బాలుడు.
‘బాబూ! దేవుడు నన్ను తన ప్రవక్తగా నియమించాడు. నాపై తన వాక్కును అవతరింపజేశాడు. నేను ప్రజలకు మంచి విషయాలు బోధించాలని, సన్మార్గం తప్పి అజ్ఞానాంధకారంలో తచ్చాడుతున్న ప్రజలకు సన్మార్గం చూపాలని, దైవారాధన వైపుకు ప్రజల్ని ప్రేరేపించాలని దేవుడు నాపై తన వాణిని అవతరింపజేస్తున్నాడు. ఈ రుకూలు, సజ్దాలన్నీ ఆ దైవం కోసమే..!’ వివరించారు ముహమ్మద్ (స).
‘చాలా బాగుంది. ఈ ఆరాధనా విధానం నాకు బాగా నచ్చింది. మరి నేను కూడా మీరు నమ్మిన దైవాన్ని నమ్మవచ్చా? మీకులాగానే దైవాన్నిఆరాధించవచ్చా? మీ వెంట నేను కూడా నమాజ్ చేయవచ్చా?’ అని ప్రశ్నించాడు.
‘తప్పకుండా బాబూ! అలాగే చేయి. సమస్త మానవాళికీ దేవుడు ఒక్కడే, ఆయనకెవ్వరూ భాగస్వాములు లేరు. ఆయనే ఆరాధనలకు అర్హుడు. నువ్వు కూడా ఆయన్నే ఆరాధించు. విగ్రహారాధన వదిలిపెట్టు’ అన్నారాయన.
‘సరే, అయితే నాన్నగారిని కూడా ఒక మాట అడిగి మీకు చెబుతాను.’
‘సరే అలాగే. నాన్నగారితో మాట్లాడు. ఏ విషయమైనా పెద్దవాళ్లను సంప్రదించడం మంచి పద్దతి’ అన్నారాయన.
నాన్నగారిని అడిగి చెపుతానని అన్నాడేగాని, అలీకి ఆ రాత్రి అసలు నిద్రే పట్టలేదు. దాదాపు తెల్లవార్లూ మెలకువతోనే ఉన్నాడు. ముహమ్మద్ (స) చెప్పిన మాటలే మాటిమాటికీ గుర్తుకొస్తున్నాయి. ఆయన ఆచరించిన నమాజ్ దృశ్యాలే కళ్లలో మెదులుతున్నాయి. ఆలోచనలతోనే తెల్లారిపోయింది.
వెంటనే ఆయన ముహమ్మద్ (స) దగ్గరికొచ్చి, ‘నేను మిమ్మల్ని, మీరు ఆచరించే ధర్మాన్ని విశ్వసిస్తున్నాను. నాకు ప్రార్ధనా విధానం నేర్పండి’ అన్నాడు.
‘నాన్నగారితో మాట్లాడావా?’ అన్నారు ముహమ్మద్ (స) .
‘నాన్నగారిని సంప్రదించాలనుకున్నాను కాని, ఆ అవసరం కనిపించలేదు’.
అలీ నిర్ణయం పట్ల ముహమ్మద్ (స) సంతోషించారు. ప్రేమతో గుండెలకు హత్తుకున్నారు. ప్రార్థనా విధానం నేర్పారు. అప్పటి వరకూ అవతరించిన దైవ వాణిని అలీకి నేర్పించారు. ఇక అప్పటినుండి క్రమం తప్పకుండా అలీ కూడా ముహమ్మద్ (స)తో కలిసి నమాజ్ ఆచరించడం మొదలుపెట్టారు.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)