ప్రార్థన ఎలా చెయ్యాలి? దేవునితో విశ్వాసి చేసే ‘ప్రార్థన’ అనే సంభాషణ ఎలా సాగాలి? తన గురించైనా, మరి దేని గురైంచైనా సర్వజ్ఞుడైన దేవునికి, విశ్వాసి కొత్తగా ఏదైనా చెప్పవలసిన అవసరం ఉంటుందా? మరి మనం చెప్పవలసిందేమీ అవసరం లేకుండా ముందే అంతా ఎరిగిన దేవునితో ప్రార్థనలో మనమాయనకు ఏమి చెప్పాలి? విశ్వాసిలో బాహ్యం, ఆంతర్యం అనే రెండు ప్రధానాంశాలుంటాయని అపొస్తలుడైన పౌలు వివరించాడు (2 కొరింథీ 4:16). ఈ రెండింటి మధ్యా అంతర్గతంగా నిరంతర సంఘర్షణ సాగుతూ ఉంటుంది. లోకం ప్రాతినిధ్యం వహించే మన బాహ్యానికి, దైవసంబంధమైన మన ఆంతర్యంలోని ఆత్మీయతకు ఎప్పుడూ ఘర్షణే!! అయితే ఎంత నలిగినా, బలహీనపడ్డా, చింతచచ్చినా పులుపుచావదన్నట్టు, మనిషిలోని ‘అహం’ మాత్రం ఓటమిని అంత తొందరగా అంగీకరించదు. కాని ఈ అంతర్గత సంఘర్షణలో మనిషిదెప్పుడూ ఓటమే!! గెలవాలన్న ప్రయత్నమే తప్ప, గెలిచే అవకాశాలు మనిషికి ఏ మాత్రం లేని ఈ రంగంలోనే, దేవుని ప్రేమ మాత్రం అంతకంతకూ మరెక్కువగా విశ్వాసిలో పరిపూర్ణమౌతుందంటాడు అపొస్తలుడైన పౌలు.
తన జీవితంలో ఒక ముల్లు ఉండేదంటాడాయన. ముండ్లు లేని జీవితాలసలుంటాయా? అయితే ఆ ముల్లును తొలగించమని తాను ముమ్మారు వేడినా దేవుడు దానిని తొలగించలేదు సరికదా, ‘నా కృప నీకు చాలు, నీ బలహీనతల్లోనే నా శక్తి సంపూర్ణమవుతుందని దేవుడు తనకు బదులిచ్చాడు’ అని పౌలు తన నిస్సహాయతను, ఓటమిని కొరింథీ చర్చికి వివరించుకున్నాడు (2కొరింథీ 12:1–9). అతిశయపడేందుకు పౌలు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఎవరికీ లేని ఒక పరలోకానుభవం కూడా ఉంది. ఆయన పరలోకం దాకా వెళ్లి మానవుల వశంలో లేని ఎన్నో పారలౌకికానుభవాలకు గురయ్యాడు.. కానీ తిరిగొచ్చిన తర్వాత ఆ ‘అనుభవం’ గురించి ఏ ఒక్కరికి కూడా ఆయన చెప్పుకోలేదు. సరికదా అలా పరలోకానికి వెళ్ళింది తానే అని కూడా చెప్పుకోకుండా, అలా వెళ్లిన ఒక వ్యక్తి తనకు తెలుసునని మాత్రం పౌలు తన పత్రికలో వివరించడం పౌలు సాత్వికత్వానికీ, వినయానికి, తగ్గింపు స్వభావానికి స్పష్టమైన ఉదాహరణ.. కానీ క్రీస్తు ప్రేమకు నన్ను అంతకంతకు దగ్గర చేసే నా బలహీనతలయందే నేను అతిశయిస్తాను తప్ప, అతిశయించేందుకు తన వద్ద మరేదీ లేదని అపొస్తలుడైన పౌలు అంత సవినయంగా ప్రకటించుకోవడం, పైపై మెరుగుల ప్రచారం తప్ప మరేదీ లేని క్రైస్తవానికి ప్రతినిధులైన నేటి తరం విశ్వాసులకు, పరిచారకులకు ఎన్నటికీ అర్థం కాదు.
కొందరి ప్రార్థనల నిండా వాళ్ళ జీవితంలోని ముండ్ల ప్రస్తావనే ఉంటుంది. ముల్లు తీసెయ్యమని అడగడం తమ హక్కు, దాన్ని తీసివేయడం దేవుని బాధ్యత అన్నట్టుగా వాళ్ళ ప్రార్థనలు సాగుతుంటాయి. అయితే తన ముల్లు తీసెయ్యమంటూ తాను మూడుసార్లు అడిగినా దేవుడు అందుకు తిరస్కరించి, ఆ ముల్లు నిన్ను బలహీనుణ్ణి చెయ్యడంలోనే నా బలం నీలో పరిపూర్ణమవుతుందంటూ దేవుడు జవాబిచ్చాడని పౌలు రాసుకున్నాడు. మనం ఏదడిగితే అది ఇస్తూ మనల్ని సంతోషపర్చడానికే దేవుడున్నాడన్న పద్ధతిలో లోతులు లేక కేవలం పబ్బం గడుపుకునే బాపతు పద్ధతిలో సాగుతున్న ఈనాటి పరిచారకుల పసలేని ప్రసంగాల కారణంగా ‘దేవుని సార్వభౌమత్వం’ అనే అత్యంత ప్రాముఖ్యమైన ఆత్మీయాంశం విశ్వాసులకు అర్ధం కావడం లేదు. దేవుడు సార్వభౌమత్వం కలిగిన సర్వాధికారి తప్ప, మనమేది అడిగితే అది తెచ్చిచ్చే ‘అల్లాఉద్దీన్ అద్భుతదీపం’ కాదు. కూడా. మనమడిగింది ఆయన చేస్తాడు కాని దాన్ని చెయ్యకుండా ఉండే సార్వభౌమత్వం కూడా దేవుని సొంతం. దేవుని సంపూర్ణంగా విశ్వసించడమంటే, దేవుని సార్వభౌమత్వాన్ని విశ్వసించడమే, దేవుని విధానాలను, దేవుని సమయాన్ని సంపూర్ణంగా ఎరగటమే!! దేవునిలో ఎదగడమంటే, ప్రాపంచికంగా మనం బలహీనపడటమేనన్న పౌలు మాటలు, దేవుని హృదయస్పందనకు సాదృశ్యాలు. ‘మన బాహ్యపురుషుడు కృషిస్తున్నా, ఆంతర్య పురుషుడు దినదినం వినూత్నపర్చబడుతున్నాడు’ అంటాడు పౌలు. అలాంటి ఆత్మీయవృద్ధిని, దేవుని సార్వభౌమత్వాన్ని కాంక్షిద్దాం.
Comments
Please login to add a commentAdd a comment