ఉమెన్స్ హాస్టల్లో యువకులా?
గుంటూరు: ఉమెన్స్ హాస్టల్లో యువకులు పనిచేయటమా? ఇక్కడ పనిచేసేందుకు మహిళలు దొరకలేదా.. అసలు వీరిని ఎవరు నియమించారు, ఎప్పుడు నియమించారు అంటూ ఇన్‌చార్జి వీసీ బి.ఉదయలక్ష్మి మండిపడ్డారు. వెంటనే ఇక్కడి నుంచి వీరిని మార్చండి అని రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌ను ఆదేశించారు. ఇన్‌చార్జి వీసీగా హోదాలో యూనివర్సిటీకి వచ్చిన ఉదయలక్ష్మి ఉమెన్స్ హాస్టల్‌ను సందర్శించారు. భోజనశాలలో భోజనం చేస్తున్న విద్యార్థినుల వద్దకు వెళ్లి వసతులెలా ఉన్నాయి, భోజనాలు బాగుంటున్నాయా అని అడిగారు.
విద్యార్థినులు సమాధానమిస్తూ భోజనం బాగోడం లేదని, తమకంటే సిబ్బంది ముందుగా తింటున్నారని తమకు సరిగా పెట్టడం లేదని ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు చెప్పేది నిజమేనని సిబ్బంది పనితీరు బాగోలేదని చీఫ్ వార్టెన్ జయశ్రీ కూడా ఇన్‌చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే సిబ్బందిని పిలిచిన ఇన్‌చార్జి వీసీ ఇంతకు ముందులా ఉండదని, సరిగా చేయకపోతే సస్సెండ్ చేస్తానని హెచ్చరించారు. భోజనం, శుభ్రతపై ప్రశ్నిస్తున్నందుకు తనను సిబ్బంది అందరూ కలిసి బెదిరించారని తాను ఎంతో వేదన చెందానని ఎల్‌ఎల్‌ఎం విద్యార్థిని కిరణ్ విలపిస్తూ ఇన్‌చార్జి వీసీకి ఫిర్యాదు చేశారు. వెంటనే హాస్టల్ ఇన్‌చార్జ్‌లు, సిబ్బందిని పిలిపించిన ఉదయలక్ష్మి విద్యార్థినిని ఎందుకు బెదిరించారని వారిని ప్రశ్నించారు. మరొకసారి ఇలా జరిగితే ఊరుకోనని స్పష్టం చేశారు.
విద్యార్థిని పిర్యాదు చేస్తుండగా సూపర్ వైజర్ కలుగజేసుకోవటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికందరికీ నోటీసులు జారీ చేసి వివరణ అడగాలని, సూపర్‌వైజర్‌లు ఇద్దరినీ మార్చాలని రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌కు సూచించారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రత్యేకంగా డ్రస్ వేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం జంట్స్ హాస్టల్‌ను సందర్శించి వసతులను పరిశీలించారు. అందులో పనిచేస్తున్న పెద్దవయసున్న పురుషులను ఉమెన్‌స హాస్టల్‌కు మార్చాలని అధికారులకు సూచించారు. వసతి గృహ వ్యవహారాల్లో విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. ఇన్‌చార్జి వీసీ వెంట పలువురు యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
సిబ్బంది బదిలీకి రంగం సిద్ధం
ఇన్‌చార్జి వీసీ ఆదేశాలతో వసతి గృహాల్లో పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేసేందుకు యూనివర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఉమెన్‌స హాస్టల్లోని ఇన్‌చార్జిలతోపాటు అక్కడ పనిచేసే సిబ్బందిని మారుస్తున్నారు. ఉమెన్‌స హాస్టల్స్ చీఫ్ వార్డెన్ జయశ్రీ గురువారం రాత్రి రిజిస్ట్రార్ పి.రాజశేఖర్‌తో సమావేశమై దీనిపై చర్చించారు.