కుక్కలే ఎందుకు మనిషికి బెస్ట్‌ఫ్రెండ్?
కుక్కలు, నక్కలు ఒకేజాతి జంతువులు. కుక్కేమో మనిషికి బెస్ట్‌ఫ్రెండ్. నక్క మాత్రం కాదు. ఎందుకిలా? మానవులతో స్నేహం చేయాలన్న లక్షణం కుక్కల జన్యువుల్లోనే ఉండటం దీనికి కారణమంటున్నారు ఒరెగాన్ స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. మనుషుల్లో కొందరికి విలియమ్స్ బారెన్ సిండ్రోమ్ అనే ఓ సమస్య ఉంటుందట. ఈ సమస్య ఉన్న వారు పరిచయమైతే చాలు విపరీతమైన స్నేహభావాన్ని చూపుతుంటారు. వీరిలో ఎదుగుదల చాలా ఆలస్యంగా జరుగుతుంటుంది. ఇలాంటి వారిలో, కుక్కల్లో జన్యుపరమైన సారూప్యత ఉన్నట్లు శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు.
కొన్ని కుక్కలు, నక్కలతో కొన్ని ప్రయోగాలు నిర్వహించారు. మనుషుల సమక్షంలో ఒక డబ్బా మూత తీయమని పురమాయిస్తే.. కుక్కలు మనుషుల అనుమతి కోసం ఎదురుచూస్తే.. నక్కలు మాత్రం నేరుగా పనిలో పడిపోయాయి. అలాగే పేరుపెట్టి పిలిచినప్పుడు రెండు జంతువులూ మనుషుల వద్దకు ఎగబడి వచ్చినా.. కుక్కలు మనిషిని ఆకర్షించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తే.. నక్కలు సెకన్ల వ్యవధిలో వెనుదిరిగి వెళ్లిపోయాయి. జన్యుపరీక్షల్లో విలియమ్స్ బారెన్ సిండ్రోమ్ ఉన్న వ్యక్తుల్లో మాదిరిగానే కుక్కల్లో కూడా జన్యుపరమైన మార్పులు కనిపించాయి. వీటిని బట్టి మనుషులతో కుక్కలకు ఉన్న దోస్తీకి జన్యుపరమైన మార్పులే కారణమన్న అంచనాకు వచ్చారు శాస్త్రవేత్తలు.