మా ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా తన పనిలో నిత్యం బిజీగా ఉంటారు. తన ఉద్యోగం చాలా ఒత్తిడితో కూడుకుని ఉండటం, ఇంటిదగ్గర ఉన్నప్పుడు కూడా ఏదో ఒక మీటింగ్‌కు అటెండ్ అవాల్సి రావడం, వర్క్ ఫ్రమ్ హోం, రాత్రుళ్లు లేటుగా పడుకోవడం వంటివి కోవిడ్ సమయం నుంచి ఎక్కువయ్యాయి. పడుకున్న కొన్ని గంటలు సరిగా నిద్ర పోకపోవడం, పొద్దున్నే చిరాకుగా ఉండటం చీటికీ మాటికీ కోపం తెచ్చుకోవడం ఈ మధ్య ఎక్కువయ్యాయి. పిల్లల మీద ఉట్టిపుణ్యానికి అరుస్తున్నారు. నా భర్త వేరే ఏ దురలవాట్లు లేని మంచి వ్యక్తి అని ఎంతో ఆనందించే నేను ఈ మధ్య ఆయన ప్రవర్తనతో విసిగిపోయాను. మీ సలహా కోసం ఎదురు చూస్తూ...
– ఓ సోదరి, హైదరాబాద్
ప్రియమైన చెల్లెమ్మా! మీ భర్త దీర్ఘకాలిక వత్తిడి వలన కొన్ని మానసిక లక్షణాలకు లోనవుతున్నట్లు కనిపిస్తుంది. కోవిడ్ తర్వాత పని సంస్కృతిలోని మార్పుల వలన ఈ రోజులలో చాలామంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో ఇంటికి, ఆఫీస్‌కి తేడా కనుమరుగవుతోంది. మీ వారి లక్షణాలను ‘బర్న్ అవుట్’ అని అంటాము. మీ ఆయనకు ఎలాంటి వ్యసనాలు లేవన్నారు. కాని వారు తన ఉద్యోగాన్ని, ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. నిద్ర సరిగా లేకపోవడం, అతి కోపం, చిరాకు ఇవి తన పనిలో సామర్థ్యాన్ని తగ్గించడమే గాక, తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. వీటిని ఇలాగే వదిలేస్తే మున్ముందు శారీరక సమస్యలు కూడా రావచ్చు. పనివేళలపై ముఖ్యంగా ఇంటి వద్ద పని వేళలపై సరిహద్దులు పెట్టడం, సరైన సమయపాలన చేయడం ద్వారా వృత్తి, జీవిత సమతుల్యం మెరుగుపరుచుకోవాలి. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కొంతపని ఇతరులకు అప్పగించడం లేదా నిరాకరించడం చేయగలగాలి.
మీ కుటుంబ సమయం, విశ్రాంతి సమయాన్ని కూడా మీ మీటింగుల లాగే, అనివార్యమైనవిగా మీ కేలండర్‌లో రాసుకోవాలి. సరైన నిద్ర, వ్యాయామం, సమయానికి ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని చాలా వరకు నియంత్రించవచ్చు. మీ వారి ప్రవర్తన ఎలా కుటుంబాన్ని ప్రభావితం చేస్తుందో వారితో సానుభూతితో చర్చించండి. ఒక జీవిత భాగస్వామిగా మీ మద్దతు తనకు ఉందని తెలిసినప్పుడు వారు కూడా మార్పునకు గట్టిగా కృషి చేస్తారు. మీరు కూడా ఈ పరిస్థితుల వలన ఒత్తిడికి లోనవకుండా మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అప్పటికీ మార్పు రాకపోతే ఒక సైకియాట్రిస్ట్‌ను కలిసి థెరపీ ద్వారా, మందుల ద్వారా వారి ఒత్తిడిని తగ్గించి మీ కుటుంబ జీవన నాణ్యతను ఖచ్చితంగా మెరుగు పరుచుకోవచ్చును.
Comments
Please login to add a commentAdd a comment