అందుకే సినిమాకు కొంచెం విలువ తగ్గినట్టు అనిపిస్తోంది
Published Sat, Sep 7 2013 11:38 PM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM
అంతు లేని కథ, చిలకమ్మ చెప్పింది, పొట్టేలు పున్నమ్మ తదితర చిత్రాల్లో నటించిన శ్రీప్రియ ఒకప్పుడు యూత్‌కి హాట్ ఫేవరెట్ హీరోయిన్. దక్షిణాది భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారామె. వాటిల్లో ఒక్క రజనీకాంత్‌తోనే 28, కమల్‌హాసన్‌తో 27 సినిమాలు చేయడం విశేషం. నటిగా మాత్రమే కాకుండా రచయిత్రిగా, దర్శకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు శ్రీప్రియ. కొంత విరామం తర్వాత ఆమె తెలుగు, తమిళ భాషల్లో ‘మాలిని 22’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళ చిత్రం ‘22 ఫీమేల్ కొట్టా యమ్’కి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ భాగ్యనగరంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీప్రియతో జరిపిన ఇంటర్వ్యూ...
300 సినిమాల్లో నటించిన మీరు.. ఆ తర్వాత కొంత కాలం వెండితెరకు దూరంగా ఉండటానికి కారణం?
నాకిద్దరు పిల్లలు. ఓ పాప, ఒక బాబు. వాళ్ల కోసం నేను కొంత గ్యాప్ తీసుకున్నాను. ఇప్పుడు మా అమ్మాయి లండన్‌లో చదువుకుంటోంది. నాక్కావల్సినంత టైమ్ దొరుకుతుంది. అందుకే, మళ్లీ సినిమాలు చేయాలనుకున్నాను.
దాదాపు ఐదేళ్ల క్రితం టీవీ సీరియల్స్‌కి దర్శకత్వం వహించి, నటించారు కూడా.. బుల్లితెర ఎలాంటి అనుభూతినిచ్చింది?
టైమింగ్స్ పరంగా చూసుకుంటే టీవీకి చేయడం సౌకర్యంగానే ఉంటుంది. అందుకే చేయగలిగాను. కానీ నాకెందుకో సీరియల్స్ చేయడం మొనాటనీ అనిపించింది. అందుకే బ్రేక్ తీసుకున్నా.
1980ల్లో మీరు వెండితెరను ఓ స్థాయిలో ఏలారు. అప్పటికీ ఇప్పటికీ ‘సినిమా’పరంగా మీరు గమనించిన తేడా?
చాలా మారిపోయింది. ఒకప్పుడు సినిమా ఎలా తీసేవారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఊహించేయగలుగుతున్నారు. అప్పట్లో స్టూడియో లోపలికి రావాలంటే పెద్ద తతంగం ఉండేది. ఇప్పుడు ఎవరో ఒకరి ద్వారా వచ్చేస్తున్నారు. షూటింగ్స్ చూస్తున్నారు. అలాగే అప్పట్లో మీడియా ఇంత లేదు. వెండితెరపై మాత్రమే మేం కనిపించేవాళ్లం. ఇప్పుడు ఏ టీవీ చానల్ పెట్టినా సినిమా స్టార్స్ కనిపిస్తున్నారు. అలాగే సినిమా తారలు పబ్లిక్‌లోకి వస్తున్నారు. అందుకని సినిమాకి కొంచెం విలువ తగ్గినట్లు అనిపిస్తోంది. అప్పట్లో సినిమా స్టార్స్‌ని దాదాపు దేవుళ్లలా చూసేవాళ్లు. అందుకే వాళ్లు ముఖ్యమంత్రులు అవ్వగలిగారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. మళ్లీ ఎన్టీఆర్, ఎమ్జీఆర్‌లాంటి స్టార్స్‌ని మనం క్రియేట్ చేయలేం.
సినిమాకి విలువ తగ్గిందని మీరే అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరీ రంగంలో ఎలా ఇమడగలుగుతున్నారు?
నేనీ పరిస్థితిని నిందించడంలేదు. సినిమా అనేది అప్పటికీ ఇప్పటికీ మంచి వినోద సాధనం. అది ఎవరూ కాదనలేని సత్యం. ఎప్పుడో 30ఏళ్ల క్రితం నేను తెలుగు సినిమాలు చేశాను. ఇప్పటికీ నేనిక్కడివారికి గుర్తున్నాను. సినిమాకి ఉన్న శక్తి అలాంటిది. కాలానుగుణంగా పరిస్థితుల్లో మార్పు రావడం సహజం. అంత మాత్రాన కళామతల్లికి దూరంగా ఉండలేం కదా.
అప్పట్లో నటించిన తెలుగు సినిమాలు మీకు మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ మీరు యాక్ట్ చేసిన 300 చిత్రాల్లో తెలుగు సంఖ్య తక్కువ ఉండ టానికి కారణం?
తెలుగు ప్రేక్షకులు ‘శంకరాభరణం’లాంటి సినిమాలూ చూస్తారు. గ్లామర్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చూస్తారు. కానీ తెలుగులో దాదాపు నాకు గ్లామర్ రోల్సే వచ్చాయి. మొనాటనీ అనిపించి, కొన్ని వదులుకున్నాను. అంతే తప్ప తెలుగులో చేయడం నచ్చక కాదు.
మీ తాజా చిత్రం విషయానికొస్తే.. మీకు సొంతంగా కథలు రాసుకునే సత్తా ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఎందుకీ రీమేక్ చేస్తున్నారు?
‘22 ఫీమేల్ కొట్టాయమ్’ కథ నాకు బాగా నచ్చింది. సమాజంలో మనిషి రూపంలో ఉండే మగమృగాల గురించిన కథ ఇది. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ. ఇలాంటి మగవాళ్లు కూడా ఉంటారని ఆడవాళ్లకు అవగాహన కల్పించే చిత్రం. తెలుగు, తమిళ సంస్కృతి దాదాపు ఒకే విధంగా ఉంటుంది. మలయాళం పూర్తి భిన్నంగా ఉంటుంది. అందుకే కథలో చాలా మార్పులు చేశాను.
ఈ చిత్రం ద్వారా మీ భర్త రాజ్‌కుమార్ నిర్మాతగా మారడానికి కారణం?
నా భర్త వ్యాపారవేత్త. ఆయన దాదాపు 60 సినిమాల్లో నటించారు. ఓ మంచి చిత్రం నిర్మించాలనే ఆకాంక్షతో ఈ సినిమాని సెలక్ట్ చేసుకున్నారు. భవిష్యత్తులో కూడా మంచి సినిమాలు నిర్మించాలని ఉంది.
Advertisement