రాజాజీ రాజనీతి విలువలు అసమానం
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నేటి తరానికి ఆదర్శనీయుడన్న ఎం.కె. నారాయణన్
హైదరాబాద్: వ్యక్తిగతంగా, రాజకీయ విషయాల్లో సి. రాజగోపాలచారి పాటించిన విలువలు అసమానమైనవని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రశంసించారు. స్వాతంత్య్రోద్యమంలో రాజాజీ ఎంత కీలక పాత్ర పోషించారో, స్వతంత్ర భారత అభివృద్ధికి కూడా అంతే కృషి చేశారని గుర్తు చేశారు. శనివారం హైదరాబాద్‌లోని రాజాజీ ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ‘ప్రస్తుత పరిస్థితుల్లో రాజాజీ ప్రాముఖ్యత’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కేంద్ర మాజీ భద్రతా సలహాదారు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ ఎం. కె. నారాయణన్‌తోపాటు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు.
రాజాజీ పాటించిన సుపరిపాలన విలువలను నేటి తరానికి గుర్తుచేయడానికి ఈ సంస్థ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. అనంతరం ఎం. కె. నారాయణన్ ముఖ్య ఉపన్యాసం చేస్తూ, స్వాతంత్య్రోద్యమంలో రాజాజీ తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే దేశ స్వేచ్ఛ, సౌభాగ్యంపై ఆయనకున్న దార్శనికత కనబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజాజీ ఇన్‌స్టిట్యూట్ గౌరవ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎ. నరసింహారావు, డెరైక్టర్ ఇ.సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.