ఇన్ని ఇచ్చినా ఇంకా ఏదో లేదని ఏడుపా!!!
విద్య - విలువలు
ఒక వ్యక్తి సమాజంలో ఆదరణీయంగా బతకాలంటే, ఆదర్శనీయంగా, శాంతికి పర్యాయపదంగా బతకాలంటే రెండు విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోవాలని పెద్దలు చెప్పారు. మొదటిది-నేను తెలుసుకుని తీరవలసిన విషయాలలో నాకు తెలిసినది ఎంత? అని ప్రశ్నించుకోవడం. రెండవది-భగవంతుడు నాకు ఇవ్వనిది ఏముంది కనుక! అని కృతజ్ఞతాపూర్వకంగా తృప్తిపడడం.
లోకంలో కళ్లు లేని వారు, నోరు, చెవులు ఉండి కూడా మాట్లాడడానికి, వినడానికి నోచుకోని వారెందరో ఉన్నారు. మనం పొందుతున్న సుఖాలలో సగం వాళ్లకు లేవు. అమ్మ నోరారా ‘అమ్మా!’ అని పిలవలేని అసమర్థత ఒకరిది, ఆర్తితో తండ్రి ‘ఒరే కన్నా ఇలా రా!’ అని పిలిస్తే వినలేని దురదృష్టం మరొకరిది. సూర్యోదయాన్ని చూడలేరు, కోయిల గానాన్ని, చిలక పలుకులను వినలేరు, మంచి ఉపన్యాసాలు వినలేరు. ఎన్నో కోల్పోతున్నారు జీవితంలో. వారితో పోల్చుకుంటే మనకు భగవంతుడు ఎన్నో సుఖాలు అధికంగా ఇచ్చాడు.
కుటుంబాన్ని పోషించుకోగలిగిన శక్తి ఇచ్చాడు. తల్లిని ఇచ్చాడు, తండ్రిని ఇచ్చాడు. భార్యను ఇచ్చాడు, కొడుకును ఇచ్చాడు, కూతురును ఇచ్చాడు. చేతులూ కాళ్లూ కదపలేని వారెందరో ఉన్నారు. అవి కదలక ఎలక్ట్రిక్ షాక్ పెట్టించుకుంటున్న వాళ్లున్నారు, నాకా పరిస్థితి లేదు. నేను స్వేచ్ఛగా నడవగలుగుతున్నాను. వాళ్లతో పోలిస్తే భగవంతుడు నాకేమి ఇవ్వలేదు కనుక. ఇన్ని ఇచ్చినా ఇంకా లేదని ఏడవడం ఆశకు కారణమౌతుంది. ఆశ అంతులేనిదై పోయిందనుకోండి. అక్కడే నైతిక భ్రష్టత్వమొస్తుంది. కారణం-తనకు లేదన్న ఏడుపే. అది కృతఘ్నత.
వచ్చినదానితో తృప్తితో ఉన్నామనుకోండి. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి! అనుకున్నామకోండి. అది తృప్తికి కారణమౌతుంది. వాడు పక్కవాడి శాంతికి, సమాజ హితానికి కారకుడవుతాడు. నాకు తెలిసినదెంత అన్నవాడు వినయమున్నవాడు. ఈ రెండు లక్షణాలనూ ప్రయత్నపూర్వకంగా ప్రోది చేసుకోమన్నారు.
అంతేకానీ, అవతలివాడు బాధపడుతుంటే వాడిని చూసి సంతోషించగల మనస్తత్త్వం నాలో ఉందనుకోండి. వాడు మరో పావుగంట అలా బాధపడితే బాగుందని చూడడం, దాన్ని సెల్‌ఫోన్లో రికార్డు చేయడం, దాన్ని పదిసార్లు చూకోవడం, దాన్ని నెట్లో, ఫేస్‌బుక్‌లో పెట్టడం చేశాననుకోండి. అంటే నేను చూసిన ఆనందం, రికార్డు చేసిన ఆనందం, దాన్ని లక్షల మందికి చూపిన ఆనందం... అది చివరకు పైశాచిక ఆనందం. అలా కాక ఆ సమయంలో దయ పెల్లుబుకడం ముఖ్యం, అంతేకాదు అవతలివాడి బాధ ఎంత త్వరగా తగ్గించావన్నది మరీ ముఖ్యం.
ఓ రోజున ఒక వృద్ధురాలు రోడ్డు దాటుతూ అరటిపండు తొక్క మీద కాలేసి జారిపడ్డది. ఆ దగ్గర్లోనే నిలుచున్న ఒకావిడ అర్థంపర్థం లేకుండా పమిటకొంగు అడ్డుపెట్టుకుని విరగబడి నవ్వుతున్నది. ఈలోగా ఒక చిన్న పిల్లవాడు, బహుశా ఎనిమిదో, తొమ్మిదో తరగతి చదివే వయసున్నవాడు పుస్తకాల సంచీ పక్కన పారేసి పరుగు పరుగున ఆ ముసలావిడ దగ్గరకెళ్లి ఆవిడ కాలు పట్టుకుని నెమ్మదిగా రోడ్డు పక్కకు తీసుకువచ్చి కూర్చోబెట్టాడు. నేనూ వెళ్లాను. వాడలా కూర్చోబెట్టి ‘బామ్మగారూ ఇప్పుడెలా ఉంది, తగ్గిందా, నొప్పి ఎక్కువగా ఉందా, బామ్మగారూ మీ ఇల్లు ఇక్కడికి దగ్గరా దూరమా... బస్సెక్కగలరా’ అంటూ అడుగుతున్నాడు. వాడు నన్ను చూసి ‘అంకుల్, మీ దగ్గరేమయినా డబ్బులున్నాయా. బామ్మగారిని ఆటో ఎక్కించేద్దామా?’ అంటున్నాడు. వాడూ సంస్కారవంతుడంటే. ఎప్పుడు ఏ భావన పెల్లుబుకాలో, ఎప్పుడు ఏ భావన పైకి రావాలో అది అలా పైకి రావాలి.
ఎంగిలి మనసును ఎలా పసిగట్టగలం?
రాకూడని భావన పైకి వస్తుందనుకోండి... అంటే... ఆడదయితే చాలు... లోపలి నుంచి వచ్చే చూపు ఎప్పుడూ ఒకటే... ఏమిటి దానివల్ల ఉపయోగం. ‘మాతృవత్ పరదారేషు..’ భార్య మినహా పరస్త్రీ తల్లితో సమానం’-అంటుంది వేదం. అన్యస్త్రీ కనబడితే చూడడం తప్పు కాదు. చూడు. కానీ నేను ప్రతిరోజూ తెల్లవారుఝామున నిద్ర లేవగానే ఏ కామాక్షీ పరదేవత ఆరాధన చేస్తానో అ తల్లి ఇన్ని ముఖాలతో కనిపిస్తున్నదని భావన చేశాననుకోండి.... నేను సంస్కారవంతుడిని. నా చూపు వల్ల దోషం రాదు, నేను పతనం కాను. లోచూపుకి సంస్కారం చాలా అవసరం. అది లేదనుకోండి.
మాట వెనుక, చూపు వెనుక ఎంగిలి ఉందనుకోండి, ఎంగిలంటే నా ఉద్దేశం- అనుభవించాలన్న కోర్కె. లోపల ఉండే భావాలను ఎవడు పసిగట్టగలడు కనుక. పశువైతే తెలిసిపోతుంది. పశువు చూసే చూపును బట్టి ఇది మీదపడుతుందేమోనని తెలుస్తుంది. కానీ లోపల రాక్షస భావాలను దాచుకుని పైకి ఉత్తమ భావాలను ప్రదర్శించే మనిషి లోచూపును ఎవరు కనిపెట్టగలరు? మీరెంతమంది పోలీసులను పెట్టగలరు? ఈ పరిస్థితి ఎలా మారుతుంది,? మనిషిలో దేనివలన మానవత్వం మిగులుతుందంటే... ఒక్క సంస్కారం వల్లనే సాధ్యం. ఈ సంస్కారం కోసం చదువు పనికిరావాలి.
విద్య గొప్పదా, సంస్కారం గొప్పదా అంటే సంస్కారం లేని విద్య పతన హేతువవుతుంది. సంస్కారంతో కూడుకున్న విద్య మాత్రమే పదిమందికి పనికి వస్తుంది. రామ లక్ష్మణ భరత శత్రుఘు్నలకు వశిష్ఠుడు పాఠం చెప్పాడు. చెప్పినప్పుడు గురువు ఎలా చెప్పాడు, పాఠం విన్నవాళ్లకు ఎలా అర్థమైందని అడుగుతూ మహర్షి ఇలా అన్నారు. చదువు ఒకరి నుంచి మరొకరికి ప్రవహించాలన్న మాట వాస్తవమే అయినా, అది అలా ప్రవహించుకుంటూ పోవడం మాత్రమే కాదు. ఒకరి నుంచి మరొకరిలోకి ప్రవహించిన తరువాత అక్కడి నుంచి ఎలా ప్రవహించాలి అన్న విషయానికి ప్రాముఖ్యత ఉంది. అంటే ఉన్న చదువుకు గుణాలు ఆధారం కావాలి. గుణం అంటే ఎప్పుడు మనసులో ఏ భావం కలగాలో ఆ భావన మాత్రమే కలగడానికి ఆ చదువు ఉపయోగపడాలి. నేను ఒక పసిపిల్లవాడి వంక చూశాననుకోండి. వాడు నా మనవడా కాదా అన్నది ప్రధానం కాదు, వాడిపట్ల నాలో వాత్సల్యం పెల్లుబకాలి. నేను ఒక దీనుడి వంక చూస్తే నాలో దయాగుణం పెల్లుబుకాలి.