వర్షాలతో తస్మాత్ జాగ్రత్త | Beware of rain tasmat | Sakshi
Sakshi News home page

వర్షాలతో తస్మాత్ జాగ్రత్త

Published Tue, Sep 9 2014 1:19 AM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

వర్షాలతో తస్మాత్ జాగ్రత్త - Sakshi

వర్షాలతో తస్మాత్ జాగ్రత్త

  •      చెరువులు, నదులకు గండ్లు పడే ప్రమాదం
  •      అధికారులు అప్రమత్తంగా ఉండాలి
  •      కలెక్టర్ యువరాజ్ ఆదేశం
  • విశాఖ రూరల్: జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డివిజనల్, మండల స్థాయి అధికారులతో సోమవారం నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వర్షాలు తీవ్రమైతే రోడ్లకు, చెరువులకు, నదులకు, కాల్వలకు గండ్లు పడే అవకాశమున్నందున గ్రామ స్థాయి వరకు ఉన్న రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, పరిస్థితులను పై అధికారులకు తెలియజేయాలన్నారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించారు.

    గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులకు ఆధార్ నమోదు శత శాతం పూర్తి చేయాలన్నారు. భూములకు సంబంధించిన రికార్డుల ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ల బదిలీల నేపథ్యంలో 9 అంశాలతో కూడిన నివేదికను జిల్లాలోని అన్ని తహశీల్దార్ల కార్యాలయాలకు పంపినట్టు తెలిపారు. ఈ నివేదికను బదిలీపై వెళ్తున్న, వచ్చిన తహశీల్దార్లకు అందజేయాలన్నారు. అలా చేయని పక్షంలో బదిలీపై వెళ్తున్న పాత తహశీల్దార్ ఎల్‌పీసీ నిలుపుదల చేస్తామని హెచ్చరించారు.

    ఆధార్ నమోదు ప్రక్రియను ప్రభుత్వం ప్రతి రోజు సమీక్షిస్తోందని తెలిపారు. జిల్లాలోని 3.2 లక్షల పింఛనుదారుల్లో 2.87 లక్షల మందికి ఆధార్ నమోదు పూర్తయిందని, మిగిలిన వారితో కూడా ఆధార్ నమోదు పూర్తి చేయించాలన్నారు. కొంత మంది పింఛనుదారులు అస్వస్థతతో మంచానికే పరిమితమై ఉంటారని, వారికి కూడా ఆధార్ నమోదు చేయించేందుకు ఎంపీడీవోలు చొరవ చూపాలని చెప్పారు.

    గ్రామాల్లో చెత్త పేరుకుపోవడంపై వస్తున్న వార్తలపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యార్డుల ఏర్పాటు చేసే అవకాశమున్నందున ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాడేరు ఏజెన్సీలో 500 పాఠశాలల్లో టాయిలెట్స్ లేనట్టు గుర్తించామన్నారు. వాటికి నిధులు మంజూరు చేశామని, నిర్మాణ పనులు పూర్తి చేయించాలని పాడేరు సబ్ కలెక్టర్‌కు సూచించారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ నరసింహారావు, డీపీఓ సుధాకర్, డుమా పీడీ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement