అర్హత..మా కొద్దు!
రుణ అర్హత కార్డులకు తగ్గిన దరఖాస్తులు
జిల్లాలో కౌలు రైతుల సంఖ్య 2 లక్షలు
1.19 లక్షల మందికి కార్డులు ఇవ్వాలనేది లక్ష్యం
వచ్చిన దరఖాస్తులు 21,164
కర్నూలు అగ్రికల్చర్ : రుణ అర్హత కార్డులను పొందడానికి కౌలురైతులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తుల స్వీకరణకు రెవెన్యూ యంత్రాంగం గత నెల 10 నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించగా స్పందన అంతంతమాత్రమే. జిల్లాలో 2 లక్షలకుపైగా కౌలు రైతులు ఉండగా వీరిలో 1.19 లక్షల మందికి రుణ అర్హత కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. ఈ మేరకు రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్(సీసీఎల్‌ఏ) నుంచి ఆదేశాలు వచ్చాయి.
గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ రుణ అర్హత కార్డులు జారీ చేయాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా గ్రామసభలు నిర్వహించినా కౌలు రైతులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం 22,070 మంది దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారుల విచారణలో 21,164 మంది అర్హులని తేలారు. వీరికి మాత్రమే రుణ అర్హత కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో పది శాతం మంది రైతులు మాత్రమే రుణ అర్హత కార్డులు పంపిణీ చేయనున్నారు. గత ఏడాది 48,025 మందికి వీటిని పంపిణీ చేయగా ఈసారి దానిలో సగం కూడా లేకపోవడం గమనార్హం.
ఇవీ ప్రయోజనాలు..
రుణ అర్హత కార్డులుంటే కౌలు రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇస్తారు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతింటే కౌలు రైతుకే నేరుగా పరిహారం అందుతుంది.
వైఫల్యాలు ఇవీ..
రుణ అర్హత కా ర్డులు కలిగిన కౌలు రైతులకు బ్యాం కులు రుణా లు ఇవ్వడం లేదు. పంట లు నష్టపోయినప్పుడు పరిహారం అందడం లేదు. ఎందుకూ ఉపయోగపడని రుణ అర్హత కార్డులను పొందడానికి రైతులు ఆసక్తి చూపడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.