village meetings
-
మొక్కుబడి గ్రామసభలకు చెక్
సాక్షి, ఆదిలాబాద్ : గ్రామాల్లో మొక్కుబడిగా నిర్వహించే గ్రామ సభలు, సమావేశాలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. ఇకనుంచి గ్రామసభలు, సమావేశాలు పకడ్బందీగా నిర్వహించేందుకు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈమేరకు ప్రభుత్వం నుంచి జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. గ్రామ ప్రగతి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సభలు, పంచాయతీ సమావేశాలు కీలకం. ఇప్పటివరకు మొక్కుబడిగా సాగినా ఇకనుంచి బాధ్యతాయుతంగా నిర్వహించనున్నారు. రెండు నెలలకోసారి గ్రామసభ, నెలకోసారి పంచాయతీ పాలకవర్గ సమావేశం నిర్వహించాలి. లేదంటే సర్పంచ్ పదవికి అనర్హులుగా ప్రకటిస్తారు. మండలంలో 37 జీపీలు.. ఆదిలాబాద్ ఉమ్మడి మండలంలోని ఆదిలాబాద్‌రూరల్‌లో 34 గ్రామపంచాయతీలు ఉండగా, నూతనంగా ఏర్పాటైన మావల మండలంలో 3 గ్రా మాలు ఉన్నాయి. ఆయా గ్రామపంచాయతీల్లో ఇదివరకు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహించేవారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఇకనుంచి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. లేనియేడల అధికారులు చర్యలు తీసుకుంటారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం సమావేశాలను సకాలంలో నిర్వహిస్తే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు పేర్కొంటున్నారు. కోరం ఉండాల్సిందే.. గ్రామసభకు జనాభాను బట్టి ప్రజలు హాజరు కావాల్సి ఉంటుంది. గ్రామాల్లో 500 ఓటర్లు ఉంటే 50 మంది, 3వేల మంది ఓటర్లు ఉంటే 150 మంది, 5వేల మంది ఓటర్లు ఉంటే 200 మంది, 10వేల మంది ఓటర్లు ఉంటే 300 మంది, అంతకుమించి ఉంటే 400 మంది గ్రామసభలకు హాజరుకావాల్సిందే. కొత్త చట్టం ప్రకారం ఏడాదికి ఆ రుసార్లు నిర్వహించాలి. తేదీ, సమయం ముందుగా ఊరిలో ప్రచారం చేయాలి. ఒకవేళ నిర్ణయించిన తేదీన గ్రామసభ జరగకపోతే తిరిగి పది రో జుల్లో నిర్వహించాలి. సర్పంచ్ లేకుంటే ఉప సర్పంచ్ ఆధ్వర్యంలోనైనా ఏర్పాటు చేయాలి. జాప్యం కుదరదు.. గ్రామపంచాయతీ పాలకవర్గాలు ఫిబ్రవరి 2న ఏర్పాటయ్యాయి. మార్చి చివరి నాటికి మొదటసభ నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ప్రభుత్వం ఇన్నాళ్లు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినా సభలు నిర్వహించకపోవడంతో పంచాయతీరాజ్‌శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదికి నాలుగుసార్లు.. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందు కు 73 రాజ్యాంగ సవరణలో 29 అంశాలను చేర్చా రు. వివిధ సంక్షేమ పథకాల విధులు, పారదర్శకంగా నిర్వహించేలా గ్రామాలను ఆర్థికంగా బలోపేతం చేస్తూ అభివృద్ధి చేసేలా పంచాయతీ సమావేశాలు పక్కాగా నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతీ రెండునెలలకోసారి గ్రామసభలు తప్పనిసరిగా నిర్వహించాలి. అలాగే పంచాయతీ పాలకవర్గ సమావేశాలు నెలనెలా నిర్వహించాల్సిందే. -
‘జన్మభూమి’లో పింఛన్లకు మంగళం!
సాక్షి,అమరావతి బ్యూరో: జిల్లాలో మంగళవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకూ గ్రామాల్లో జన్మభూమి గ్రామసభలు జరుగనున్నాయి. ఇప్పటికే గుంటూరు కార్పొరేషన్, మున్సిపాలిటీలు, మండల స్థాయి అధికారులు సభలు జరిగే డివిజన్లు, వార్డులు, పంచాయతీ వివరాలను విడుదల చేశారు. ఐదో విడత జన్మభూమిలో ప్రతిరోజు ఓ అంశంపై దృష్టి సారించేలా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. ఈ సారి జరిగే గ్రామసభల్లో ప్రభుత్వం పింఛన్ల పంపిణీని పక్కన పెట్టేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో అర్హులు నిలదీసే అవకాశం ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. 60,000కు పైగా దరఖాస్తులు.. జిల్లాలో అన్నిరకాల పింఛన్ల కోసం ప్రభుత్వానికి 52,000 దరఖాస్తులు అందాయి. ఇవికాక అదనంగా మరో 10,000 దరఖాస్తులు మండలాల స్థాయిలో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి 2000 చొప్పున ఒక్కో ప్రత్యేక అధికారి జన్మభూమి సభలో అప్పటికప్పుడు 100 మందికి పింఛన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశం. కానీ.. దరఖాస్తులు చాలా ఎక్కువగా ఉండటం, అర్హులైనవారంతా జన్మభూమి సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీసే అవకాశం ఉన్నందున వీటి పంపిణీని నిలిపివేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం తిరిగి విధి విధానాలను రూపొందించి, ఉగాది లోపు పంపిణీ చేసేందుకు యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నాలుగో విడత జన్మభూమిలో.. ప్రభుత్వం 2017 జనవరిలో కుటుంబ వికాసమే ధ్యేయంగా 15 అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని జన్మభూమి గ్రామ సభలు నిర్వహించింది. అధికారులు అప్పటి సభలను కేవలం రేషన్ కార్డులు, పింఛన్ల జారీకే పరిమితం చేవారు. గృహ నిర్మాణ శాఖకు 9,591, పౌర సరఫరాలశాఖకు 23,153, పేదరిక నిర్మూలన సంస్థకు 15,790, మున్సిపాలిటీలకు 1,533 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ ఆర్థిక అంశాలకు సంబంధించిన దరఖాస్తులకు పరిష్కారం లభించనేలేదు. నాలుగో విడత జన్మభూమిలో ఇచ్చిన రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ తప్ప కొత్తగా ప్రభుత్వం ఇచ్చిందేమి లేదు. గతంలో 59,922 దరఖాస్తులు రేషన్‌కార్డుల కోసం వచ్చాయి. అందులో 4,285 దరఖాస్తులను అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. మిగిలిన వాటిని ఐదో విడత జన్మభూమిలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇతర సమస్యలతో పాటు గ్రామాల్లో భూసమస్యలు కూడా కుప్పలు తెప్పలుగా ఉండటంతో అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి చుక్కెదరయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేక సమీక్ష.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం కలెక్టర్ కోన శశిధర్‌తో పాటు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, విజయవంతం చేయాలని సీఎం వారికి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. గుంటూరు నగర పరిధిలోని 62 వార్డుల్లో సభలు నిర్వహించేందుకు కమిషనర్ అనురాధ ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లా అధికారులు మండలాల్లోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. రేషన్ కార్డులను పంపిణీ చేస్తాం గుంటూరు వెస్ట్: జిల్లాలో 2016 జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులకు గాను 56,922 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో 20,119 కార్డులను మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేస్తామన్నారు. మిగిలిన 31,870 రేషన్ కార్డులను వివిధ కారణాలతో నిలిపివేశారన్నారు. ఈ కార్డులతో లబ్ధిదారులు జనవరి నుంచి ఇచ్చే చంద్రన్న కానుకలు తీసుకోవచ్చన్నారు. అంశాల వారీగా షెడ్యూల్ ఇదీ.. మంగళవారం కార్యాక్రమాల్లో వెల్ఫేర్ స్కీంలు, 3న ‘ఆరోగ్యం– ఆనందం’ 4న స్వచ్ఛాంధ్రప్రదేశ్, 5న విద్యా–వికాసం, 6న మౌలిక సదుపాయాలు, 7న సహజ వనరులు– అభివృద్ది’, 8న వ్యవసాయానుబంధ రంగాలు’, 9న సుపరిపాలన– టెక్నాలజీ వినిమోగం, 10న పేదరికంపై గెలుపు, 11న ఆనందలహరి జరుగునున్నాయి. కార్యక్రమాల పర్యవేక్షణకు గాను గుంటూరు డివిజన్‌కు డి.వరప్రసాద్ (ఐఏఎస్), గురజాలకు ఎల్.శ్యామూల్ అనంద్ (ఐఏఎస్), తెనాలికు బి.ఎన్.ఎ.మూర్తి (ఐఎఫ్ఎస్), నరసరావుపేటకు డాక్టర్ వాణిమోహన్ (ఐఏఎస్) నియమితులయ్యారు. -
చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలి: సీఎం కేసీఆర్
-
చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలి: సీఎం కేసీఆర్
హైదరాబాద్: భూముల రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాల నిర్మాణం విషయమై సెప్టెంబర్ 2వ తేదీ నుంచి నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించాలని పార్టీ ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఈ మేరకు సీఎం కేసీఆర్ శనివారం సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 2 నుంచి నియోజకవర్గాల్లో గ్రామసభలు నిర్వహించాలని, ఈ సందర్భంగా ఏర్పాటుచేసే రైతుసంఘాల్లో రాజకీయాలు లేకుండా చూడాలని ఆయన సూచించారు. రెవెన్యూశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని, భూముల సంబంధించిన రికార్డులపై చరిత్రాత్మక ప్రక్షాళన జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. భూ రికార్డులకు సంబంధించిన ఏ మార్పైన నేరుగా రైతుల ద్వారానే జరగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులకు నూతన విధానాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. -
అంతా ‘జన్మభూమి’ జపం
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పాలన స్తంభించింది. అధికారులంతా జన్మభూమి జపం చేస్తున్నారు. రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకూ జన్మభూమి కార్యక్రమం పేరుతో జిల్లా అధికారులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రతి రోజూ నిర్వహించే సమావేశాలు, వారం వారం సమీక్షల క్యాలెండర్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాలన స్తంభించింది. కలెక్టరేట్ బోసిపోతోంది. ఈనెల 2వ తేదీ నుంచి ఇదే దుస్థితి నెలకొంది. జన్మభూమి తర్వాత 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు కార్యాలయాలు పనిచేసినా అప్పుడు పండగ కోలాహలం నేపథ్యంలో ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఎలాగూ పండగ సెలవులు ఉంటాయి. అంటే నెలలో సగం రోజులు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజా సమస్యలను అధికారులు గాలికి వదిలేసినట్టయింది. ప్రస్తుతం ప్రజలు కార్యాలయాలకు వస్తున్నా.. అధికారులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. కొందరు జన్మభూమి గ్రామసభలు ముగిసిన అనంతరం కార్యాలయాలకు వస్తున్నా.. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పటికే ‘మీకోసం’ రెండువారాలు రద్దు ప్రతి సోమవారం జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని జన్మభూమి కార్యక్రమం నేపథ్యంలో ఇప్పటికే రెండు వారాల పాటు కలెక్టర్ రద్దు చేశారు. మండల కేంద్రాల్లో నిర్వహించే మీకోసం కార్యక్రమాలకూ మంగళం పాడారు. దీంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక సతమతమవుతున్నారు. రైతులను గాలికొదిలేశారు ప్రస్తుతం రబీ సీజ¯ŒS ప్రారంభ దశలో ఉంది. రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సాగునీరు, రుణాలు అందక అవస్థలు పడుతున్నారు. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు. -
ఉపాధి పనులపై 20 నుంచి గ్రామ సభలు
– ఉపాధి హామీ పథకం స్టేట్ రీసోర్స్ పర్సన్ రామారావు నంద్యాలరూరల్: ఉపాధి పనులపై ఈనెల 20 నుంచి 27వ తేదీ వరకు గ్రామ పంచాయతీల్లో సభలు నిర్వహించి సామాజిక తనిఖీ జరపాలని ఉపాధి హామీ పథకం స్టేట్ రీసోర్స్ పర్సన్ రామారావు ఆదేశించారు. బుధవారం నంద్యాల సీఎల్ఆర్సీ భవనంలో ఏపీఓ నాగజ్యోతి ఆధ్వర్యంలో డీఆర్పీలు, విలేజ్ సోషల్ ఆడిటర్లు, టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్ల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాజిక తనిఖీల అనంతరం ఈనెల 28వ తేదీన నంద్యాల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో బహిరంగ సామాజిక విచారణ జరుగుతుందని చెప్పారు. పనుల వారీగా ఫిర్యాదులను నమోదు చేసి మండల స్థాయి ఓపెన్ ఫోరానికి తీసుకొని రావాలని సూచించారు. -
'పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రమే చేపట్టాలి'
హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామసభలు నిర్వహించి 2013 భూసేకరణ చట్ట ప్రకారం.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్‌ను అప్పగించడం సరికాదన్నారు. -
అర్హత..మా కొద్దు!
రుణ అర్హత కార్డులకు తగ్గిన దరఖాస్తులు జిల్లాలో కౌలు రైతుల సంఖ్య 2 లక్షలు 1.19 లక్షల మందికి కార్డులు ఇవ్వాలనేది లక్ష్యం వచ్చిన దరఖాస్తులు 21,164 కర్నూలు అగ్రికల్చర్ : రుణ అర్హత కార్డులను పొందడానికి కౌలురైతులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తుల స్వీకరణకు రెవెన్యూ యంత్రాంగం గత నెల 10 నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించగా స్పందన అంతంతమాత్రమే. జిల్లాలో 2 లక్షలకుపైగా కౌలు రైతులు ఉండగా వీరిలో 1.19 లక్షల మందికి రుణ అర్హత కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. ఈ మేరకు రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్(సీసీఎల్ఏ) నుంచి ఆదేశాలు వచ్చాయి. గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ రుణ అర్హత కార్డులు జారీ చేయాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా గ్రామసభలు నిర్వహించినా కౌలు రైతులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం 22,070 మంది దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారుల విచారణలో 21,164 మంది అర్హులని తేలారు. వీరికి మాత్రమే రుణ అర్హత కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో పది శాతం మంది రైతులు మాత్రమే రుణ అర్హత కార్డులు పంపిణీ చేయనున్నారు. గత ఏడాది 48,025 మందికి వీటిని పంపిణీ చేయగా ఈసారి దానిలో సగం కూడా లేకపోవడం గమనార్హం. ఇవీ ప్రయోజనాలు.. రుణ అర్హత కార్డులుంటే కౌలు రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇస్తారు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతింటే కౌలు రైతుకే నేరుగా పరిహారం అందుతుంది. వైఫల్యాలు ఇవీ.. రుణ అర్హత కా ర్డులు కలిగిన కౌలు రైతులకు బ్యాం కులు రుణా లు ఇవ్వడం లేదు. పంట లు నష్టపోయినప్పుడు పరిహారం అందడం లేదు. ఎందుకూ ఉపయోగపడని రుణ అర్హత కార్డులను పొందడానికి రైతులు ఆసక్తి చూపడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
నియోజకవర్గానికి 500 ఇళ్లు
* డబుల్ బెడ్రూం ఇళ్లపై సూత్రప్రాయ నిర్ణయం * గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక * జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు * సమగ్ర సర్వే వివరాల ఆధారంగా నిర్ధారణ.. సర్వేలో సొంతిల్లు లేదని పేర్కొన్న వారికే అవకాశం * ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు మొండిచెయ్యే! సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనిచ్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా గూడులేని పేద కుటుంబాలు లక్షల్లో ఉన్నప్పటికీ తొలుత నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను నిర్మించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇంటి యూనిట్ ఖర్చు, నిర్మించాల్సిన వైశాల్యాన్ని ఇంకా ఖరారు చేయనప్పటికీ నియోజకవర్గాలవారీగా ఇళ్ల కేటాయింపుపై మాత్రం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. లబ్ధిదారుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే ఈ కసరత్తు మొదలుకాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. సొంతిల్లు లేనట్లుగా సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్న పేదలనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని, పనుల ప్రారంభానికి ఎదురుచూస్తున్న వారు ఆశలు కొట్టేసుకోవాల్సిందేనని తేలిపోయింది. డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభల నిర్వహణ బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో భారీ వ్యయంతో కూడుకున్న డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో సర్కారు జాగ్రత్త వహిస్తోంది. గ్రామ సభల్లో ఒక్కో కుటుంబ వివరాలను పరిశీలించి సర్వేలో పేర్కొన్న విషయాలతో సరి చూసుకుని, దాన్ని నిర్ధారిస్తూ కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాలనీలుగా నిర్మాణం.. లబ్ధిదారు తనకున్న స్థలంలో ఇంటిని నిర్మించుకునే పాత పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. లబ్ధిదారుకు ఉన్న స్థలంతో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని గుర్తించి అక్కడే ఇళ్లను ఓ కాలనీగా నిర్మిస్తుంది. నిర్మా ణ బాధ్యతను గృహనిర్మాణ శాఖకు ఇవ్వొద్దని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తే ఖర్చు కలిసొస్తుందని భావిస్తున్న సర్కారు.. ఈ మేరకు నిర్మాణ సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. అర్హులెందరో లెక్క తేలిన తర్వాత నిర్మాణదారులను ఆహ్వానిస్తూ టెండర్లను పిలవనున్నారు. ఈ నెలాఖరున మొదలుపెట్టే గ్రామసభల ద్వారా అర్హుల లెక్క తేలే అవకాశముంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న ఇళ్ల యూనిట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నందున జిల్లాల్లో నిర్మించే ఇళ్ల విస్తీర్ణాన్ని తగ్గించాలని యోచిస్తోం ది. 425 చదరపు అడుగుల మేర ఉండేలా చూడాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
సమాచారం లేని ఉపాధి గ్రామసభలు
యాచారం: మల్కీజ్‌గూడలో ఉపాధి హామీ పథకం గ్రామసభను ఈనెల 25న నిర్వహించడానికి ఈజీఎస్ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటల దాటినా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు అధికారులెవరూ రాలేదు. గ్రామసభపై ‘సాక్షి’ గ్రామ సర్పంచ్ మల్లేష్‌ను సంప్రదిస్తే అసలు తనకు సమాచారమే లేదన్నారు. వెంటనే సర్పంచ్ ఈజీఎస్ మండల ఏపీఓ నాగభూషణానికి ఫోను చేయగా స్పందించలేదు. గడ్డమల్లయ్యగూడ గ్రామంలో 21న గ్రామసభ ప్రారంభమై 22, 23 తేదీల్లో ఏడాదిపా టు కూలీలకు పనులు కల్పించే విషయమై నిర్ణయం తీసుకొని 24న సోమవారం మళ్లీ గ్రామసభ జరిపి పనుల ఎంపికపై తీర్మానం చేయాల్సి ఉంది. కానీ ఆ గ్రామంలో అసలు గ్రామసభనే జరగలేదు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ తేదీ గడువు ముగిసినా సర్పంచ్‌కు అసలు సమాచారమే లేదు. ఈజీఎస్ అధికారుల నిర్వాకంతో గ్రామాల్లో ఉపాధి పథకం గ్రామసభలు సమాచారం లేని సభలుగా మారాయి. వచ్చే ఏడాది పాటు గ్రామాల్లో కూలీలకు చేతి నిండా పనికల్పించాలంటే గ్రామసభల్లో పనుల ఎంపిక ఎంతో ముఖ్యం. కానీ మండలంలో సక్రమంగా జరగని గ్రామసభలపై మంగళవారం వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఈజీఎస్ ఉన్నతాధికారులకు, ఏపీడీకి ఫిర్యాదులు చేశారు. సర్పంచ్‌లకు సమాచారం లేదు.. మండలంలోని 20 గ్రామాల్లో 20 వేలకుపైగా కూలీలు ఉన్నారు. ప్రతి యేటా మంజూరయ్యే కోట్లాది రూపాయల నిధులకు ఉపాధి గ్రామసభల్లో ఎంపిక, తీర్మానం చేసే నిర్ణయాలే కీలకం. కానీ మండల ఏపీఓ నాగభూషణం పర్యవేక్షణాలోపంతో మండలంలో ఏ గ్రామంలో కూడా గ్రామసభలు సక్రమంగా జరగడ లేదు. ఉపాధి గ్రామసభలు పరిశీలించడానికి సాక్షి మంగళవారం ఉదయం 9-30 గంటలకు (షెడ్యూల్ ప్రకటించిన సమయం ప్రకారం) కుర్మిద గ్రామానికి వెళ్లగా గ్రామసభ లేదు. సర్పంచ్ విజయను సంప్రదించగా ఈ రోజు గ్రామసభ ఉందని తనకు సమాచారమే లేదని తెలిపింది. మల్కీజ్‌గూడ గ్రామానికి ఉదయం 11 గంటలకు వెళ్లగా అక్కడ కూడా గ్రామసభ లేదు. సర్పంచ్ మల్లేష్‌ను సంప్రదించగా గ్రామసభల విషయం తనకు తెలియదన్నారు. గ్రామసభలు జరుగుతున్నాయా..? అని గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ నర్రె మల్లేష్‌ను సంప్రదించగా తమ గ్రామంలో ఇంతవరకు గ్రామసభలే జరగలేదన్నారు. నల్లవెల్లి సర్పంచ్ శోభను సంప్రదించగా 21నఅధికారులు వచ్చారు.. కొంతమంది రైతుల నుంచి ధరఖాస్తులు తీసుకున్నారు.. 24న మళ్లీ గ్రామసభ జరగాలి కానీ జరగలేదన్నారు. గతంలో జరిగిన పనుల్లో తప్పిదాలవల్ల ప్రజలు నిలదీస్తారేమోనని గ్రామసభల గురించి సమాచారం లేకుండా ముగించే విధంగా ఈజీఎస్ సిబ్బంది వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
గ్రామసభ రసాభాస
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: గ్రామ అభివృద్ధి పనులపై చర్చించేందుకు భద్రాచలంలోని రాజుపేట కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన గ్రామసభ రసాభాసగా మారింది. ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రామసభ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైంది. సభ ప్రారంభమవగానే గ్రామస్తులు లేచి నిలబడి, ఎవరికీ చెప్పకుండా... తగిన ప్రచారం చేయకుండా, దండోరా వేయకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గ్రామసభ ఏర్పాట్లపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం ఇసుక క్వారీ సభ్యులు, డ్రైవర్లు తమ సమస్యలను వివరించేందుకు యత్నించారు. దీనికి గ్రామసభ అధ్యక్షుడు గుండు శరత్ అడ్డుతగిలారు. కేవలం అభివృద్ధి పనులపై చర్చించేందుకే మాత్రమే ఈ సభ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఎజెండా ప్రకటించకుండా సభను నిర్వహించడం, సమస్యలను చెప్పొద్దనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇసుక ర్యాంపు నిధులతో పాఠశాల భవనాన్ని ఆధునీకరించామని అధ్యక్షుడు చెప్పారు. దీనికి గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. భవన నిర్మాణంలో అన్నీ అక్రమాలే చోటుచేసుకున్నాయని చెప్పారు. ఈదురుగాలులతో భారీ వర్షం రావడంతో గ్రామసభను వాయిదా వేస్తున్నట్టు అధ్యక్షుడు గుండు శరత్ ప్రకటించారు. ఈ సభలో ఉపాధ్యక్షురాలు మిడియం భారతి, గ్రామ కార్యదర్శి పూనెం కృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు నాగేశ్వరరావు, ముర్ల రమేష్, మడివి నెహ్రు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం సర్పంచ్ నోటీసు రాజుపేట కాలనీలో నిర్వహించిన భద్రాచలం గ్రామసభ సమాచారాన్ని తనకు కనీసంగా కూడా తెలపకపోవడంపై అభ్యంతరం తెలుపుతూ భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, వార్డు మెంబర్లు గ్రామసభ నిర్వాహకులకు శనివారం నోటీసు ఇచ్చారు. గ్రామసభ సమాచారాన్ని పత్రికల ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు. గ్రామసభను నిర్వహణ, ఊరిలో టాంటాం వేయించాల్సిన భాద్యత తనపై ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు, వివిధ వర్గాల ప్రజలకు గ్రామసభ సమాచారం ఎందుకు తెలపలేదని సర్పంచ్, వార్డు సభ్యులు ఆ నోటీసులో ప్రశ్నించారు. గ్రామసభను వాయిదా వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలో నిర్వహించేలా గ్రామసభ కమిటీ తీర్మానం చేయాలని కోరారు. -
జాయింట్ పంచాయితీ
సాక్షి, నల్లగొండ/భువనగిరి, న్యూస్‌లైన్: పల్లెలకు ‘జాయింట్’ కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన పుణ్యమాని సమస్యలు పేరుకుపోయాయి. తాగునీటి సరఫరా నుంచి పారిశుద్ధ్యం వరకు అన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఇటీవలే పల్లెల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. సమస్యల నుంచి ఊరట లభిస్తుందనుకున్న తరుణంలో ప్రభుత్వం సర్పంచ్‌లు, కార్యదర్శులకు కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన సర్పంచులు కూడా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖాళీగా కార్యదర్శుల పోస్టులు... జిల్లాలో 1169 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలి. గ్రామాభివృద్ధిలో వీరిదే కీలక పాత్ర. పన్నులు వసూలు చేయడం, పారిశుద్ధ్య చర్యలు, పరిశుభ్రత, వీధి లైట్ల నిర్వహణ తదితర పనులు చేయించాల్సిన బాధ్యత వీరిపైనే ఉంది. అంతేగాక పంచాయతీ పాలకవర్గాల సమావేశాలు, గ్రామసభలు ఏర్పాటు చేయడం వంటివి వీరి ముఖ్యవిధి. ఒక్కో పంచాయతీకి ఒక కార్యదర్శి ఉంటేనే ఈ పనులు సక్రమంగా జరుగుతాయి. తద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగవు. పల్లెలు అభివృద్ధి బాటలో నడుస్తాయి. అయితే జిల్లాలో దాదాపు 460మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన పంచాయతీల్లో కార్యదర్శుల పోస్టులు ఏళ్లుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో మండలంలో ముగ్గురు నలుగురు మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కో కార్యదర్శికి నాలుగైదు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. బిల్లుల డ్రాలో ఇబ్బందులు... పంచాయతీలు చిన్నవైనా... పెద్దవైనా చేసేపని ఒక్కటే కావడంతో పంచాయతీలపై అధిక భారం పడుతోంది. దీంతో ఏ పంచాయతీకి సరైన న్యాయం చేయలేక వారు చేతులెత్తేశారు. పోస్టింగ్ ఉన్న సొంత పంచాయతీపైనే దృష్టి సారించారు. మిగిలిన పంచాయతీలను పక్కనబెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌లకు, కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉంటే బిల్లులు డ్రా చేయడంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నాలుగైదు పంచాయతీలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండడంతో బిల్లుల డ్రా విషయంలో కచ్చితంగా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు. దీని ప్రభావం అంతిమంగా గ్రామాభివృద్ధిపై పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇదే విషయాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాయింట్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచుల ఆందోళన సర్పంచ్‌లను అవమానపరచడమే జాయింట్ చెక్ పవర్ విధానం సర్పంచ్‌లను అవమానపరిచే విధంగా ఉంది. గ్రామాల్లో సమస్యలు, వాటి పరిష్కారం కోసం సర్పంచ్‌లు రాత్రింబవళ్లు పనిచేస్తుంటారు. జాయింట్ చెక్‌పవర్‌తో నిధుల కేటాయింపు, ఖర్చు విషయంలో జాప్యం జరిగి పనులు కుంటుపడతాయి. గతంలో ఉన్నట్లుగా సర్పంచ్‌లకే చెక్ పవర్ ఉండాలి. - అబ్బగాని వెంకట్, సర్పంచ్, కూనూరు, భువనగిరి. సర్పంచ్ హక్కులను కాలరాయడమే రాజ్యాంగంలో ప్రజాప్రతినిధులకు కల్పించిన హక్కులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భంగం వాటిల్లుతుంది. ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు ఇది అవమానకరం. జాయింట్ చెక్‌పవర్ ఇచ్చినా, ఇవ్వకున్నా ఒక్కటే. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఉద్యమాలు నిర్వహిస్తాం. - వెంకటేష్‌గౌడ్, సర్పంచ్, మర్యాల, బొమ్మలరామారం మండలం