సాక్షి,అమరావతి బ్యూరో: జిల్లాలో మంగళవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకూ గ్రామాల్లో జన్మభూమి గ్రామసభలు జరుగనున్నాయి. ఇప్పటికే గుంటూరు కార్పొరేషన్, మున్సిపాలిటీలు, మండల స్థాయి అధికారులు సభలు జరిగే డివిజన్లు, వార్డులు, పంచాయతీ వివరాలను విడుదల చేశారు. ఐదో విడత జన్మభూమిలో ప్రతిరోజు ఓ అంశంపై దృష్టి సారించేలా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే.. ఈ సారి జరిగే గ్రామసభల్లో ప్రభుత్వం పింఛన్ల పంపిణీని పక్కన పెట్టేస్తున్నట్లు సమాచారం. దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో అర్హులు నిలదీసే అవకాశం ఉన్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది.
60,000కు పైగా దరఖాస్తులు..
జిల్లాలో అన్నిరకాల పింఛన్ల కోసం ప్రభుత్వానికి 52,000 దరఖాస్తులు అందాయి. ఇవికాక అదనంగా మరో 10,000 దరఖాస్తులు మండలాల స్థాయిలో పెండింగ్ ఉన్నట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి 2000 చొప్పున ఒక్కో ప్రత్యేక అధికారి జన్మభూమి సభలో అప్పటికప్పుడు 100 మందికి పింఛన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశం. కానీ.. దరఖాస్తులు చాలా ఎక్కువగా ఉండటం, అర్హులైనవారంతా జన్మభూమి సభల్లో అధికారులు, ప్రజాప్రతినిధులను నిలదీసే అవకాశం ఉన్నందున వీటి పంపిణీని నిలిపివేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వం తిరిగి విధి విధానాలను రూపొందించి, ఉగాది లోపు పంపిణీ చేసేందుకు యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
నాలుగో విడత జన్మభూమిలో..
ప్రభుత్వం 2017 జనవరిలో కుటుంబ వికాసమే ధ్యేయంగా 15 అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని జన్మభూమి గ్రామ సభలు నిర్వహించింది. అధికారులు అప్పటి సభలను కేవలం రేషన్ కార్డులు, పింఛన్ల జారీకే పరిమితం చేవారు. గృహ నిర్మాణ శాఖకు 9,591, పౌర సరఫరాలశాఖకు 23,153, పేదరిక నిర్మూలన సంస్థకు 15,790, మున్సిపాలిటీలకు 1,533 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఎక్కువ ఆర్థిక అంశాలకు సంబంధించిన దరఖాస్తులకు పరిష్కారం లభించనేలేదు. నాలుగో విడత జన్మభూమిలో ఇచ్చిన రేషన్‌కార్డులు, పింఛన్ల పంపిణీ తప్ప కొత్తగా ప్రభుత్వం ఇచ్చిందేమి లేదు. గతంలో 59,922 దరఖాస్తులు రేషన్‌కార్డుల కోసం వచ్చాయి. అందులో 4,285 దరఖాస్తులను అనర్హమైనవిగా అధికారులు గుర్తించారు. మిగిలిన వాటిని ఐదో విడత జన్మభూమిలో ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇతర సమస్యలతో పాటు గ్రామాల్లో భూసమస్యలు కూడా కుప్పలు తెప్పలుగా ఉండటంతో అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి చుక్కెదరయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రత్యేక సమీక్ష..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం సాయంత్రం కలెక్టర్ కోన శశిధర్‌తో పాటు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘జన్మభూమి–మా ఊరు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని, విజయవంతం చేయాలని సీఎం వారికి సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. గుంటూరు నగర పరిధిలోని 62 వార్డుల్లో సభలు నిర్వహించేందుకు కమిషనర్ అనురాధ ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేక అధికారులను నియమించారు. జిల్లా అధికారులు మండలాల్లోనూ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.
రేషన్ కార్డులను పంపిణీ చేస్తాం
గుంటూరు వెస్ట్: జిల్లాలో 2016 జన్మభూమి కార్యక్రమంలో రేషన్ కార్డులకు గాను 56,922 దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో 20,119 కార్డులను మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో పంపిణీ చేస్తామన్నారు. మిగిలిన 31,870 రేషన్ కార్డులను వివిధ కారణాలతో నిలిపివేశారన్నారు. ఈ కార్డులతో లబ్ధిదారులు జనవరి నుంచి ఇచ్చే చంద్రన్న కానుకలు తీసుకోవచ్చన్నారు.
అంశాల వారీగా షెడ్యూల్ ఇదీ..
మంగళవారం కార్యాక్రమాల్లో వెల్ఫేర్ స్కీంలు, 3న ‘ఆరోగ్యం– ఆనందం’ 4న స్వచ్ఛాంధ్రప్రదేశ్, 5న విద్యా–వికాసం, 6న మౌలిక సదుపాయాలు, 7న సహజ వనరులు– అభివృద్ది’, 8న వ్యవసాయానుబంధ రంగాలు’, 9న సుపరిపాలన– టెక్నాలజీ వినిమోగం, 10న పేదరికంపై గెలుపు, 11న ఆనందలహరి జరుగునున్నాయి. కార్యక్రమాల పర్యవేక్షణకు గాను గుంటూరు డివిజన్‌కు డి.వరప్రసాద్ (ఐఏఎస్), గురజాలకు ఎల్.శ్యామూల్ అనంద్ (ఐఏఎస్), తెనాలికు బి.ఎన్.ఎ.మూర్తి (ఐఎఫ్‌ఎస్), నరసరావుపేటకు డాక్టర్ వాణిమోహన్ (ఐఏఎస్) నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment