సాక్షి, నల్లగొండ/భువనగిరి, న్యూస్‌లైన్: పల్లెలకు ‘జాయింట్’ కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన పుణ్యమాని సమస్యలు పేరుకుపోయాయి. తాగునీటి సరఫరా నుంచి పారిశుద్ధ్యం వరకు అన్నీ అస్తవ్యస్తంగా మారాయి. ఇటీవలే పల్లెల్లో పాలకవర్గాలు కొలువుదీరాయి. సమస్యల నుంచి ఊరట లభిస్తుందనుకున్న తరుణంలో ప్రభుత్వం సర్పంచ్‌లు, కార్యదర్శులకు కలిపి జాయింట్ చెక్ పవర్ ఉండాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే, ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నూతన సర్పంచులు కూడా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ఖాళీగా కార్యదర్శుల పోస్టులు...
జిల్లాలో 1169 గ్రామ పంచాయతీలున్నాయి. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉండాలి. గ్రామాభివృద్ధిలో వీరిదే కీలక పాత్ర. పన్నులు వసూలు చేయడం, పారిశుద్ధ్య చర్యలు, పరిశుభ్రత, వీధి లైట్ల నిర్వహణ తదితర పనులు చేయించాల్సిన బాధ్యత వీరిపైనే ఉంది. అంతేగాక పంచాయతీ పాలకవర్గాల సమావేశాలు, గ్రామసభలు ఏర్పాటు చేయడం వంటివి వీరి ముఖ్యవిధి. ఒక్కో పంచాయతీకి ఒక కార్యదర్శి ఉంటేనే ఈ పనులు సక్రమంగా జరుగుతాయి. తద్వారా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులూ కలగవు. పల్లెలు అభివృద్ధి బాటలో నడుస్తాయి. అయితే జిల్లాలో దాదాపు 460మంది మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. మిగిలిన పంచాయతీల్లో కార్యదర్శుల పోస్టులు ఏళ్లుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఒక్కో మండలంలో ముగ్గురు నలుగురు మాత్రమే కార్యదర్శులు ఉన్నారు. ఈ క్రమంలో ఒక్కో కార్యదర్శికి నాలుగైదు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు.
బిల్లుల డ్రాలో ఇబ్బందులు...
పంచాయతీలు చిన్నవైనా... పెద్దవైనా చేసేపని ఒక్కటే కావడంతో పంచాయతీలపై అధిక భారం పడుతోంది. దీంతో ఏ పంచాయతీకి సరైన న్యాయం చేయలేక వారు చేతులెత్తేశారు. పోస్టింగ్ ఉన్న సొంత పంచాయతీపైనే దృష్టి సారించారు. మిగిలిన పంచాయతీలను పక్కనబెట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సర్పంచ్‌లకు, కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శి ఉంటే బిల్లులు డ్రా చేయడంలో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నాలుగైదు పంచాయతీలకు కలిపి ఒకే కార్యదర్శి ఉండడంతో బిల్లుల డ్రా విషయంలో కచ్చితంగా ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితి లేకపోలేదు. దీని ప్రభావం అంతిమంగా గ్రామాభివృద్ధిపై పడుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇదే విషయాన్ని సర్పంచ్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జాయింట్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్పంచుల ఆందోళన
సర్పంచ్‌లను అవమానపరచడమే
జాయింట్ చెక్ పవర్ విధానం సర్పంచ్‌లను అవమానపరిచే విధంగా ఉంది. గ్రామాల్లో సమస్యలు, వాటి పరిష్కారం కోసం సర్పంచ్‌లు రాత్రింబవళ్లు పనిచేస్తుంటారు. జాయింట్ చెక్‌పవర్‌తో నిధుల కేటాయింపు, ఖర్చు విషయంలో జాప్యం జరిగి పనులు కుంటుపడతాయి. గతంలో ఉన్నట్లుగా సర్పంచ్‌లకే చెక్ పవర్ ఉండాలి.
- అబ్బగాని వెంకట్, సర్పంచ్, కూనూరు, భువనగిరి.
సర్పంచ్ హక్కులను కాలరాయడమే
రాజ్యాంగంలో ప్రజాప్రతినిధులకు కల్పించిన హక్కులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భంగం వాటిల్లుతుంది. ఓట్లతో గెలిచిన ప్రజా ప్రతినిధులకు ఇది అవమానకరం. జాయింట్ చెక్‌పవర్ ఇచ్చినా, ఇవ్వకున్నా ఒక్కటే. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌లు ఉద్యమాలు నిర్వహిస్తాం.
- వెంకటేష్‌గౌడ్, సర్పంచ్, మర్యాల,
బొమ్మలరామారం మండలం
జాయింట్ పంచాయితీ
Published Wed, Aug 21 2013 3:08 AM | Last Updated on Fri, Sep 1 2017 9:56 PM
Advertisement