తాగునీటి మోటార్ పాడైతే అదేరోజు మరమ్మతులు
అధికారులతో సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి సరఫరా విషయంలో నూతన ఒరవడికి ప్రభుత్వం నాంది పలికిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి గ్రామంలో మంచినీటి సహాయకుడిని నియమించి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 15 జిల్లాల్లోని 60 ప్రాంతాల్లో శిక్షణ కొనసాగుతోందని.. ఈ నెలాఖరులోగా అన్ని గ్రామాలకూ సహాయకులను నియమించి శిక్షణ పూర్తి చేస్తామన్నారు.
తాగునీటి నాణ్యత పరిశీలనతోపాటు బోర్లు పాడైతే అదే రోజు మరమ్మతులు జరిగేలా, లీకేజీలను సరిచేసేలా గ్రామాల్లో మంచినీటి సహాయకులు కృషి చేస్తారని వివరించారు. సోమవారం సచివాలయం నుంచి శాఖాపరమైన సమీక్ష సందర్భంగా వివిధ విభాగాలవారీగా పనుల్లో వేగం పెంచాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. కొనసాగుతున్న పనుల పురోగతిని ఆమె అడిగి తెలుసుకున్నారు.
బీఆర్‌ఎస్ హయాంలోని పెండింగ్ బిల్లులను త్వరలో చెల్లిస్తామని చెప్పారు. విభాగాలవారీగా నూతన పనులకు కార్యాచరణ సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్, సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పీఆర్ ఆర్‌డీ కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫీఉల్లా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment