అంతా ‘జన్మభూమి’ జపం
అంతా ‘జన్మభూమి’ జపం
Published Sat, Jan 7 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 12:35 AM
ఏలూరు (మెట్రో) : జిల్లాలో పాలన స్తంభించింది. అధికారులంతా జన్మభూమి జపం చేస్తున్నారు. రెండో తేదీ నుంచి 11వ తేదీ వరకూ జన్మభూమి కార్యక్రమం పేరుతో జిల్లా అధికారులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రతి రోజూ నిర్వహించే సమావేశాలు, వారం వారం సమీక్షల క్యాలెండర్‌ను పూర్తిగా రద్దు చేసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాలన స్తంభించింది. కలెక్టరేట్ బోసిపోతోంది. ఈనెల 2వ తేదీ నుంచి ఇదే దుస్థితి నెలకొంది. జన్మభూమి తర్వాత 11వ తేదీ నుంచి మూడు రోజులపాటు కార్యాలయాలు పనిచేసినా అప్పుడు పండగ కోలాహలం నేపథ్యంలో ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. ఆ తర్వాత ఎలాగూ పండగ సెలవులు ఉంటాయి. అంటే నెలలో సగం రోజులు ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజా సమస్యలను అధికారులు గాలికి వదిలేసినట్టయింది. ప్రస్తుతం ప్రజలు కార్యాలయాలకు వస్తున్నా.. అధికారులు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. కొందరు జన్మభూమి గ్రామసభలు ముగిసిన అనంతరం కార్యాలయాలకు వస్తున్నా.. ప్రజా సమస్యలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
ఇప్పటికే ‘మీకోసం’ రెండువారాలు రద్దు
ప్రతి సోమవారం జిల్లాలోని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని జన్మభూమి కార్యక్రమం నేపథ్యంలో ఇప్పటికే రెండు వారాల పాటు కలెక్టర్ రద్దు చేశారు. మండల కేంద్రాల్లో నిర్వహించే మీకోసం కార్యక్రమాలకూ మంగళం పాడారు. దీంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలీక సతమతమవుతున్నారు.
రైతులను గాలికొదిలేశారు
ప్రస్తుతం రబీ సీజ¯ŒS ప్రారంభ దశలో ఉంది. రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. సాగునీరు, రుణాలు అందక అవస్థలు పడుతున్నారు. వీటి పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు. అయితే అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఏం చేయాలో పాలుపోక లబోదిబోమంటున్నారు.
Advertisement
Advertisement