గ్రామసభ రసాభాస | villagers meeting is not satisfied by peoples | Sakshi
Sakshi News home page

గ్రామసభ రసాభాస

Published Sun, Sep 8 2013 3:14 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

villagers meeting is not satisfied by peoples

 భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్:
 గ్రామ అభివృద్ధి పనులపై చర్చించేందుకు భద్రాచలంలోని రాజుపేట కాలనీలో శనివారం ఏర్పాటుచేసిన గ్రామసభ రసాభాసగా మారింది. ఉదయం పది గంటలకు ప్రారంభం కావాల్సిన గ్రామసభ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైంది. సభ ప్రారంభమవగానే గ్రామస్తులు లేచి నిలబడి, ఎవరికీ చెప్పకుండా... తగిన ప్రచారం చేయకుండా, దండోరా వేయకుండా గ్రామసభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. గ్రామసభ ఏర్పాట్లపై కూడా వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలం ఇసుక క్వారీ సభ్యులు, డ్రైవర్లు తమ సమస్యలను వివరించేందుకు యత్నించారు. దీనికి గ్రామసభ అధ్యక్షుడు గుండు శరత్ అడ్డుతగిలారు. కేవలం అభివృద్ధి పనులపై చర్చించేందుకే మాత్రమే ఈ సభ ఏర్పాటుచేసినట్టు చెప్పారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
 
 ఎజెండా ప్రకటించకుండా సభను నిర్వహించడం, సమస్యలను చెప్పొద్దనడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఇసుక ర్యాంపు నిధులతో పాఠశాల భవనాన్ని ఆధునీకరించామని అధ్యక్షుడు చెప్పారు. దీనికి గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. భవన నిర్మాణంలో అన్నీ అక్రమాలే చోటుచేసుకున్నాయని చెప్పారు. ఈదురుగాలులతో భారీ వర్షం రావడంతో  గ్రామసభను వాయిదా వేస్తున్నట్టు అధ్యక్షుడు గుండు శరత్ ప్రకటించారు. ఈ సభలో ఉపాధ్యక్షురాలు మిడియం భారతి, గ్రామ కార్యదర్శి పూనెం కృష్ణ, ఆదివాసీ సంఘాల నాయకులు నాగేశ్వరరావు, ముర్ల రమేష్, మడివి నెహ్రు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
 
 భద్రాచలం సర్పంచ్ నోటీసు
 రాజుపేట కాలనీలో నిర్వహించిన భద్రాచలం గ్రామసభ సమాచారాన్ని తనకు కనీసంగా కూడా తెలపకపోవడంపై అభ్యంతరం తెలుపుతూ భద్రాచలం సర్పంచ్ భూక్యా శ్వేత, వార్డు మెంబర్లు గ్రామసభ నిర్వాహకులకు శనివారం నోటీసు ఇచ్చారు. గ్రామసభ  సమాచారాన్ని పత్రికల ద్వారానే తెలిసిందని పేర్కొన్నారు. గ్రామసభను నిర్వహణ,  ఊరిలో టాంటాం వేయించాల్సిన భాద్యత తనపై ఉందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులకు, వివిధ వర్గాల ప్రజలకు గ్రామసభ సమాచారం ఎందుకు తెలపలేదని సర్పంచ్, వార్డు సభ్యులు ఆ నోటీసులో ప్రశ్నించారు. గ్రామసభను వాయిదా వేసి, అందరికీ ఆమోదయోగ్యమైన తేదీలో నిర్వహించేలా గ్రామసభ కమిటీ తీర్మానం చేయాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement