గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి.. బోర్లాపడ్డ విపక్షాలు | Letter to Union Finance Department to release the second tranche of funds of Rs 388 crores | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధిని అడ్డుకోబోయి.. బోర్లాపడ్డ విపక్షాలు

Published Sun, Dec 17 2023 5:53 AM | Last Updated on Sun, Dec 17 2023 2:53 PM

Letter to Union Finance Department to release the second tranche of funds of Rs 388 crores - Sakshi

సాక్షి, అమరావతి : ఎక్కడైనా ప్రతిపక్షాలు ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తిచూపుతాయి. ఇంకా వీలయితే ప్రజలకు ఏ విధంగా మరింత మంచి చేయవచ్చో సలహాలూ ఇస్తాయి. అంతేకానీ ప్రజలకు జరిగే మేలును, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవు. కానీ, రాష్ట్రంలోని ప్రతిపక్షాల తీరు ఇందుకు పూర్తి భిన్నం. ప్రజల మంచికంటే వారి వ్యక్తిగత ప్రయోజనాలు, అధికారమే పరమావధి.

ఇందుకోసం ప్రజలకు అందాల్సిన నిధులను, రాష్ట్ర అభివృద్ధిని కూడా ఏమాత్రం సంకోచం లేకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఎక్కడా ప్రజల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడకుండా అత్యంత సమర్ధవంతంగా వ్యవహరిస్తోంది. దీంతో విపక్షాల ఆటలు సాగడంలేదు. ఇదే తీరులో తెలుగుదేశం, జనసేన పార్టీల నేతలు, బీజేపీలోని చంద్రబాబు తాబేదార్లు కేంద్ర నిధులను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నమూ విఫలమైంది. అదీ.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొనేందుకు కుటిల యత్నం చేశారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులను విపక్ష నేతలు అడ్డుకోబోయారు. వీటిని ఆపితే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుందని, తద్వారా వారి రాజకీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లవచ్చన్నది వారి వ్యూహం. పుంఖానుపుంఖాలుగా వారు చేసిన ఫిర్యాదులతో 8 నెలలపాటు గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం ఇచ్చే నిధులను ఆపగలిగారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలను కేంద్రానికి అందించడంతో ఇప్పుడా నిధులన్నీ మళ్లీ రాష్ట్రానికి వస్తున్నాయి. 

ఇవీ ఆ నిధులు 
15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థలన్నింటికీ కలిపి కేంద్ర ప్రభుత్వం ఏటా రూ. 2,000 కోట్లకు పైగా నిధులు ఇస్తుంది. కేంద్రం ఈ నిధులను రెండుగా వర్గీకరించింది. కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సిఫారసుల మేరకు 40 శాతం నిధులు బేసిక్‌ గ్రాంట్‌గా ఇస్తుంది. మరో 60 శాతం కేంద్ర జలశక్తి శాఖ సిఫారులతో టైడ్‌ గ్రాంట్‌ పేరుతో విడుదల చేస్తుంది. ఇలా వచ్చిన నిధులను గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల, జిల్లా పరిషత్‌లకు 15 శాతం చొప్పున కేటాయిస్తారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల పరిధిలో జనాభా, ఆ ప్రాంత విస్తీర్ణం ప్రాతిపదికన ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామీణ స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేస్తుంది. 

తప్పుడు ఫిర్యాదులతో.. 
అయితే, సర్పంచుల సంఘాల ముసుగులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఒకరు, జనసేన నేతల ఆధ్వర్యంలోని వివిధ సంఘాలు రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందంటూ మూడేళ్లుగా తప్పుడు ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అన్నింటా చంద్రబాబుకు వంతపాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఇటీవల ఇదే తీరులో  కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖకు ఫిర్యాదు చేశారు.

దేశంలో చాలా రాష్ట్రాలకు ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత కూడా తర్వాతి ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను రాష్ట్రాలకు విడుదల చేస్తుంటుంది. అదే విధంగా ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రూ. 2,010 కోట్లు గ్రామీణ స్థానిక సంస్థల నిధులు విడుదల చేయాల్సి ఉంది. తొలుత మొదటి విడతలో బేసిక్, టైడ్‌ గ్రాంట్‌ నిధులు రూ.988 కోట్లను రెండు దఫాలుగా విడుదల చేసింది. అనంతరం దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఫిర్యాదులతో గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు విడుదల చేయాల్సిన తదుపరి గ్రాంట్‌ను కేంద్రం 8 నెలల క్రితం తాత్కాలికంగా నిలిపివేసింది. 

కేంద్రం విచారణ.. నిధుల విడుదలకు అనుమతి 
పురందేశ్వరి తదితరుల ఫిర్యాదులపై పరిశీలనకు ఈ ఏడాది ఆగస్టులో కేంద్ర పంచాయతీ రాజ్‌ శాఖ జాయింట్‌ సెక్రటరీ రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించారు. విపక్షాల ఫిర్యాదులన్నింటిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ అధికారులతో చర్చించి, సమగ్ర వివరణ తీసుకున్నారు. ఆ ఫిర్యాదులన్నీ తప్పు అని తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వడంతో కేంద్రం ఆ నిధుల విడుదలకు అనుమతించింది.

గత ఆర్థిక సంవత్సరం రెండో విడత బేసిక్‌ గ్రాంట్‌ రూ. 393.91 కోట్లను రాష్ట్రానికి విడుదల చేసేందుకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ సిఫారసు చేసింది. ఈమేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి (అండర్‌ సెక్రటరీ) కేఎస్‌ పార్థసారధి రెండు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ఈ సమాచారాన్ని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసింది.

పంచాయతీరాజ్‌ శాఖ సిఫారసులతో ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయడం లాంఛనమేనని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల బకాయిలు దశలవారీగా రాష్ట్రానికి అందుతాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి మరో రూ. 2031 కోట్లు కూడా విడుదల చేయాల్సి ఉందన్నారు. అంటే ఈ ఏడాది నిధులతో కలిపి రూ.3 వేల కోట్లకు పైగా విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement