సాక్షి, అమరావతి: ‘గ్రామ సీమలే దేశానికి పట్టుగొమ్మలు’ అన్న మహాత్మాగాంధీ సూక్తిని ఆచరణలో పెడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ప్రజల ఇంటి ముంగిటకే ప్రభుత్వ సేవలన్నింటినీ తీసుకెళ్లారు. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో భారీ ఎత్తున గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీ భవనాలను నిర్మిస్తున్నారు.
ఇప్పటికే వేల సంఖ్యలో ఇవి అందుబాటులోకి వచ్చాయి. ప్రజలకు విస్తృత సేవలందిస్తున్నాయి. మరికొన్ని నిర్మాణాలు తుది దశలో ఉన్నాయి. అయితే ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈనాడు పత్రిక మరో అసత్య కథనానికి తెగబడింది. శుక్రవారం తన ప్రధాన సంచికలో ‘ఆరంభ శూరత్వం.. ఆపై అలసత్వం!’ అంటూ విషం చిమ్మింది. ఈ కథనానికి సంబంధించి అసలు వాస్తవాలివీ..
ఊరూరా గ్రామ సచివాలయాల నిర్మాణం..
రాష్ట్ర ప్రభుత్వం ఏటా వివిధ సంక్షేమ పథకాల రూపంలో లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తోంది. ఇందులో ఎలాంటి వివక్ష, పక్షపాతం లేకుండా గ్రామ సచివాలయాల ద్వారా అర్హుల జాబితాను సిద్ధం చేయిస్తోంది. ఇందుకోసం దాదాపు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలను నిర్మిస్తోంది. మొత్తం 10,893 గ్రామ సచివాలయాల భవనాలను మంజూరు చేసి.. ఇప్పటికే 6,800 భవనాలను పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా చేసింది.
మరో 2,784 పూర్తయ్యే దశలో ఉన్నాయి. అలాగే రైతులకు వారి స్వగ్రామాల్లోనే విత్తు నుంచి విక్రయం వరకు సేవలందజేయడానికి రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 5,252 రైతు భరోసా కేంద్రాల భవనాలను ప్రారంభించింది. మరో 2,182 భవనాలు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. అదేవిధంగా కుగ్రామాల్లో వైద్య సేవలను అందించడానికి ఇప్పటికే 3,017 విలేజ్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణాలు పూర్తి చేసి వాటిని ప్రారంభించింది.
మరో 2,395 నిర్మాణాలు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఇవన్నీ పచ్చ పత్రిక ఈనాడుకు, దాని అధినేత రామోజీరావు కళ్లకు కనిపించడం లేదు. అందుకే యథేచ్ఛగా ప్రభుత్వంపై ఇష్టానుసారం విషం కక్కారు.
చంద్రబాబు కనీస ఆలోచన అయినా చేశారా రామోజీ?
వైఎస్ జగన్ ప్రభుత్వం ఒక్కోటి రూ.43.60 లక్షల చొప్పున ప్రతి ఊరిలో గ్రామ సచివాలయాలు నిర్మిస్తోంది. గత చంద్రబాబు ప్రభుత్వం సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలు.. ఇలా ఏ ఒక్కదాని గురించి కనీస ఆలోచన కూడా చేయలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.11,000 కోట్లతో నాడు– నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తే ఇది ఈనాడు పత్రికకు అభివృద్ధిలా కనిపించలేదు.
గత చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.107 కోట్లతో పాఠశాలల చుట్టూ 98.98 కి.మీ మేర ప్రహరీ గోడలు కట్టారని తన కథనంలో మురిసిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.612 కోట్లతో 189 కిలోమీటర్లు పొడవునా ప్రహరీ గోడలు నిర్మించింది. అయినా సరే ఈనాడుకు ఇదంతా అభివృద్ధిలా కనిపిస్తే ఒట్టు!
ఈనాడు ఆరోపణ: 36,749 కొత్త భవనాలకు ఆగమేఘాలపై అనుమతులిచ్చారు. 14,956 మాత్రమే పూర్తి చేశారు. అంటే 50 శాతం కూడ పూర్తి చేయలేకపోయారు.
వాస్తవం: ప్రభుత్వం ఈ భవనాలను మంజూరు చేశాక, 2020, 2021ల్లో రెండేళ్లపాటు కరోనాతో ఏ ఒక్క పని పూర్తి స్థాయిలో చేపట్టలేని పరిస్థితి. అయినా, ఇప్పటికే ప్రారంభోత్సవం అయినవి, నిర్మాణం తుది దశలో ఉన్నవి అన్నీ కలిపితే 27,608 భవనాల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది.
ఈనాడు ఆరోపణ: నిర్మాణంలో ఉపయోగించే స్టీల్, సిమెంట్ ధరలు పెరిగినా.. పనులు మంజూరు చేసినప్పటి ధరలే ఇప్పటికీ అమలులో ఉన్నాయి. గిట్టుబాటు కాక పనులు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
వాస్తవం: ఒక్కో గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి గతంలో రూ.40 లక్షల చొప్పున మంజూరు చేయగా, ఇప్పుడు దాని నిర్మాణ ధరను రూ.43.60 లక్షలకు పెంచారు. అప్పట్లో రూ. 21.80 లక్షల చొప్పున మంజూరు చేసిన ఒక్కో రైతు భరోసా కేంద్రం నిర్మాణాన్ని రూ. 23.94 లక్షలకు ప్రభుత్వం పెంచింది. అలాగే ఒక్కో విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి రూ.17.50 లక్షల చొప్పున కేటాయించగా దాన్ని రూ.20.80 లక్షలకు పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment