యాచారం: మల్కీజ్‌గూడలో ఉపాధి హామీ పథకం గ్రామసభను ఈనెల 25న నిర్వహించడానికి ఈజీఎస్ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఉదయం 11 గంటల దాటినా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు అధికారులెవరూ రాలేదు. గ్రామసభపై ‘సాక్షి’ గ్రామ సర్పంచ్ మల్లేష్‌ను సంప్రదిస్తే అసలు తనకు సమాచారమే లేదన్నారు. వెంటనే సర్పంచ్ ఈజీఎస్ మండల ఏపీఓ నాగభూషణానికి ఫోను చేయగా స్పందించలేదు.
గడ్డమల్లయ్యగూడ గ్రామంలో 21న గ్రామసభ ప్రారంభమై 22, 23 తేదీల్లో ఏడాదిపా టు కూలీలకు పనులు కల్పించే విషయమై నిర్ణయం తీసుకొని 24న సోమవారం మళ్లీ గ్రామసభ జరిపి పనుల ఎంపికపై తీర్మానం చేయాల్సి ఉంది. కానీ ఆ గ్రామంలో అసలు గ్రామసభనే జరగలేదు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ తేదీ గడువు ముగిసినా సర్పంచ్‌కు అసలు సమాచారమే లేదు.
ఈజీఎస్ అధికారుల నిర్వాకంతో గ్రామాల్లో ఉపాధి పథకం గ్రామసభలు సమాచారం లేని సభలుగా మారాయి. వచ్చే ఏడాది పాటు గ్రామాల్లో కూలీలకు చేతి నిండా పనికల్పించాలంటే గ్రామసభల్లో పనుల ఎంపిక ఎంతో ముఖ్యం. కానీ మండలంలో సక్రమంగా జరగని గ్రామసభలపై మంగళవారం వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఈజీఎస్ ఉన్నతాధికారులకు, ఏపీడీకి ఫిర్యాదులు చేశారు.
సర్పంచ్‌లకు సమాచారం లేదు..
మండలంలోని 20 గ్రామాల్లో 20 వేలకుపైగా కూలీలు ఉన్నారు. ప్రతి యేటా మంజూరయ్యే కోట్లాది రూపాయల నిధులకు ఉపాధి గ్రామసభల్లో ఎంపిక, తీర్మానం చేసే నిర్ణయాలే కీలకం. కానీ మండల ఏపీఓ నాగభూషణం పర్యవేక్షణాలోపంతో మండలంలో ఏ గ్రామంలో కూడా గ్రామసభలు సక్రమంగా జరగడ లేదు. ఉపాధి గ్రామసభలు పరిశీలించడానికి సాక్షి మంగళవారం ఉదయం 9-30 గంటలకు (షెడ్యూల్ ప్రకటించిన సమయం ప్రకారం) కుర్మిద గ్రామానికి వెళ్లగా గ్రామసభ లేదు. సర్పంచ్ విజయను సంప్రదించగా ఈ రోజు గ్రామసభ ఉందని తనకు సమాచారమే లేదని తెలిపింది.
మల్కీజ్‌గూడ గ్రామానికి ఉదయం 11 గంటలకు వెళ్లగా అక్కడ కూడా గ్రామసభ లేదు. సర్పంచ్ మల్లేష్‌ను సంప్రదించగా గ్రామసభల విషయం తనకు తెలియదన్నారు. గ్రామసభలు జరుగుతున్నాయా..? అని గడ్డమల్లయ్యగూడ సర్పంచ్ నర్రె మల్లేష్‌ను సంప్రదించగా తమ గ్రామంలో ఇంతవరకు గ్రామసభలే జరగలేదన్నారు. నల్లవెల్లి సర్పంచ్ శోభను సంప్రదించగా 21నఅధికారులు వచ్చారు.. కొంతమంది రైతుల నుంచి ధరఖాస్తులు తీసుకున్నారు.. 24న మళ్లీ గ్రామసభ జరగాలి కానీ జరగలేదన్నారు. గతంలో జరిగిన పనుల్లో తప్పిదాలవల్ల ప్రజలు నిలదీస్తారేమోనని గ్రామసభల గురించి సమాచారం లేకుండా ముగించే విధంగా ఈజీఎస్ సిబ్బంది వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
సమాచారం లేని ఉపాధి గ్రామసభలు
Published Wed, Nov 26 2014 12:14 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement