నగర పరిధిలో అంతా డ్రోన్లమయం
ట్రాఫిక్ నిర్వహణ, వీడియోగ్రఫీ, ఫంక్షన్లలో వినియోగం
మందుల సరఫరా, సేద్యం, భూసర్వే, వాతావరణ పరిశీలన కూడా.. వ్యవసాయ రంగంలో కీలకంగా డ్రోన్లు.. వినియోగం, నిర్వహణపై వ్యవసాయ వర్సిటీ శిక్షణ
డ్రైవింగ్ లైసెన్స్ లాగే డ్రోన్లు నడిపేందుకు పైలట్ సర్టిఫికెట్
యాచారంలో డ్రోన్ అకాడమీకి 20 ఎకరాల భూమి
డ్రోన్ల తయారీ, నిర్వహణ, పైలట్ శిక్షణ అన్నీ ఒకేచోట అందుబాటులోకి.. రాష్ట్రవ్యాప్తంగా 3 వేలకుపైగా డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అంచనా
సాక్షి, హైదరాబాద్: ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ఫంక్షన్ల షూటింగ్ దాకా.. మందుల అత్యవసర సరఫరా నుంచి రోడ్డుపై ట్రాఫిక్‌ను పర్యవేక్షించేదాకా.. డ్రోన్ల వాడకం బాగా పెరిగిపోయింది. మరెన్నో రంగాలు, అవసరాలకూ డ్రోన్లు విస్తరిస్తున్నాయి. పదులు, వందల్లో కాదు.. రోజూ వేల సంఖ్యలో డ్రోన్లు గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా ఆకాశంలో చక్కర్లు కొడుతున్నాయి. సరదాగా వాడే చిన్న చిన్న కెమెరా డ్రోన్ల నుంచి ఓ స్థాయిలో బరువులు, వస్తువులు మోసుకెళ్లే భారీ డ్రోన్ల దాకా దూసుకుపోతున్నాయి. దీంతో వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్స్ ఎలాగైతే తప్పనిసరో అలా డ్రోన్లను ఎగరవేసేందుకు డ్రోన్ పైలట్ శిక్షణ తప్పనిసరి అయ్యే పరిస్థితి నెలకొంది. అధికారికంగా, అనధికారికంగా రాష్ట్రంలో సుమారు 3 వేల డ్రోన్లు వినియోగంలో ఉన్నట్టు అధికారుల అంచనా.
యాచారంలో డ్రోన్ అకాడమీ..
ఇప్పటివరకు డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇస్తున్న తెలంగాణ ఏవియేషన్ అకాడమీ (టీఎస్‌ఏఏ) త్వరలోనే డ్రోన్ల తయారీ, నిర్వహణ సేవలను సైతం అందించనుంది. నగర శివార్లలోని యాచారం మండలంలో డ్రోన్ అకాడమీ ఏర్పాటుకు ప్రభుత్వం 20 ఎకరాల భూమి ని కేటాయించింది. భూమి సర్వే పనులు పూర్తయ్యాయి. మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరో ఏడాదిలో డ్రోన్ పోర్ట్ అందుబాటులోకి వస్తుందని రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఆపరేషనల్ మేనేజర్ సామల రాహుల్‌రెడ్డి తెలిపారు. ఇక్కడ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంధనంతో నడుస్తూ, 150–200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే సామర్థ్యమున్న భారీ డ్రోన్లను నడిపే పైలట్లకు శిక్షణ ఇస్తామని చెప్పారు. వీటిని రక్షణ, నేవీ రంగాల్లో భద్రత కోసం వినియోగిస్తారని తెలిపారు. ఈ డ్రోన్లు 120 నుంచి 150 కిలోల వరకు బరువు ఉంటాయని వివరించారు.
డ్రోన్లతో ట్రాఫిక్ నిర్వహణ..
జంక్షన్లు, రద్దీ సమయంలో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి ‘మావిక్ 3 పీఆర్‌ఓ’ డ్రోన్‌ను సైబరాబాద్ పోలీసులు వినియోగిస్తున్నారు. దీనికి ఉండే నాలుగు అత్యాధునిక కెమెరాల సాయంలో ఏరియల్ ఫొటోలు, వీడియోలను చిత్రీకరిస్తూ రియల్ టైమ్‌లో ప్రసారం చేసే సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. దీంతో ట్రాఫిక్ పోలీసు బృందాలు ఆయా సమస్యలను వేగంగా పరిష్కరించే వీలు కలుగుతుంది. వాహనదారులు సులభంగా, వేగంగా ప్రయాణం చేయడానికి వీలుంటుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వినాయక నిమజ్జనం, హనుమాన్ జయంతి, బోనాలు, శ్రీరామనవమి, షాబ్–ఈ–బరాత్ వంటి ర్యాలీలు, జాతరల సమయంలో డ్రోన్లను వినియోగిస్తూ నిఘా పెడుతున్నారు.
ఔషధాల సరఫరా కోసం
నగర శివార్లలోని బీబీనగర్‌లో ఉన్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) రెండు డ్రోన్లను వినియోగిస్తోంది. మారుమూల గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు క్షయవ్యాధి మందులను, టీబీ పరీక్షల కోసం కఫం నమూనాలను సైతం డ్రోన్లతో తరలిస్తున్నారు. ఈ ప్రాంతాలకు రోడ్డు మార్గంలో రెండు గంటలకుపైగా సమయం పడితే.. డ్రోన్‌తో కేవలం పది, ఇరవై నిమిషాల్లోపే అత్యవసర ఔషధాలను చేరవేస్తున్నారు. ప్రతిరోజు ఎయిమ్స్ క్యాంపస్‌లోని హ్యాంగర్ నుంచి యాదాద్రి జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు 8 కిలోల బరువు మోసే సామర్థ్యమున్న డ్రోన్‌తో మందులను సరఫరా చేస్తున్నారు.
వ్యవసాయ పనుల్లోనూ ఎంతో లాభం
వ్యవసాయ కూలీల కొరత ఎక్కువగా ఉండటంతో విద్యావంతులైన కొందరు రైతులు డ్రోన్ల వినియోగం వైపు ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ల వినియోగం, నిర్వహణ సేవలపై పలు డ్రోన్ తయారీ సంస్థలు, రాజేంద్రనగర్‌లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ డ్రోన్ అకాడమీ సంస్థలు శిక్షణ అందిస్తున్నాయి. సాధారణంగా ఎకరం పొలంలో పురుగు మందు పిచికారీకి ఒక రోజు సమయం పడుతుంది.
పైగా రూ.700–1,000 వరకు ఖర్చు అవుతుంది. డ్రోన్‌తో పిచికారీ రూ.500–600 ఖర్చుతోనే 10 నిమిషాల్లో పూర్తవుతుంది. పైగా పురుగు మందు వల్ల చర్మ, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉండదు. పైగా డ్రోన్‌కు అమర్చే కెమెరాలతో పంటలను ఫొటో తీయడం, చీడ పురుగుల స్థాయిని గుర్తించడం తేలికవుతుంది. ఇక్రిశాట్ సంస్థ పంట రకాలను, దశలను అధ్యయనం చేయడానికి డ్రోన్లను వినియోగిస్తోంది. కృత్రిమ మేధ, మెషీన్ లెరి్నంగ్ టెక్నాలజీల సాయంతో విశ్లేషిస్తోంది.
వాతావరణ మార్పుల పరిశీలనకూ..
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్సీ) వాతావరణ పరిశోధన, అంచనాల కోసం డ్రోన్లను వినియోగిస్తోంది. వివిధ సెన్సర్లతో కూడిన డ్రోన్‌తో ఆకాశంలో అంతెత్తు వరకు వెళ్లి.. భూమి ఉపరితలం, వాతావరణ పరిస్థితుల డేటాను సేకరిస్తుంది. ఆ సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా వాతావరణ అంచనాలు, హెచ్చరికలను జారీ చేస్తున్నారు.
అటవీశాఖ పరిధిలోనూ..
అటవీ ప్రాంతాలు, తోటలు, నీటి మట్టం పర్యవేక్షణకు అటవీ శాఖ డ్రోన్లను వినియోగిస్తోంది. కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో ఏనుగు ఇద్దరు రైతులను తొక్కి చంపిన ఘటనలో ఆ ఏనుగు కదలికలను పర్యవేక్షించేందుకు అధికారులు డ్రోన్లను ఉపయోగించారు. అలాగే పులుల సంచారాన్ని గుర్తించేందుకూ డ్రోన్లను వినియోగిస్తున్నారు.
డ్రోన్ పైలట్ లైసెన్స్ తీసుకోవాలి
లైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం నేరం
వాహనాలు నడిపేందుకు ఎలాగైతే డ్రైవింగ్ లైసెన్స్ కావాలో అలాగే డ్రోన్‌ను ఎగరవేసేందుకు కూడా సర్టిఫికెట్ కావాల్సిందే. వాణిజ్య అవసరాల కోసం డ్రోన్ వినియోగించే ప్రతీ ఒక్కరికీ ‘డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)’ అనుమతి పొందిన సంస్థ నుంచి డ్రోన్ పైలట్ సర్టిఫికెట్ ఉండాల్సిందే. ఆ లైసెన్స్ లేకుండా కమర్షియల్ డ్రోన్లను వినియోగించడం చట్టరీత్యా నేరం. ఈ సర్టిఫికెట్‌కు పదేళ్ల కాల పరిమితి ఉంటుంది. తర్వాత రెన్యూవల్ చేసుకోవాలి.
ఫీజు రూ. 38వేలు...
నాలుగేళ్లలో తెలంగాణ డ్రోన్ అకాడమీ నుంచి 600 మందికిపైగా విద్యార్థులు డ్రోన్ పైలట్లుగా శిక్షణ పొందారు. ఐదు రోజుల కోర్సు ఉంటుంది. ఫీజు రూ.38 వేలు. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ శిక్షణ కోసం వస్తున్నారు. ఇప్పటివరకు శిక్షణ పొందినవారిలో 30 మందికిపైగా మహిళా డ్రోన్ పైలట్లు ఉండటం గమనార్హం.
డ్రోన్లతో స్టార్టప్‌లు పెడుతున్నారు
వయసు,లింగ భేదాలతో సంబంధం లేకుండా చాలా మందిడ్రోన్ పైలట్ శిక్షణపై ఆసక్తి చూపిస్తున్నారు. డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, నిర్వహణ ఎలా అనే అంశాలపై నైపుణ్యం కోసం మా దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. తర్వాత సొంతంగా డ్రోన్లతో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నవారూ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment