యాచారం, న్యూస్‌లైన్ : గ్యాస్ సిలిండర్ల విషయంలో మధ్య తరగతి ప్రజలను ‘ఆధార్’తో బెదరగొట్టి, చివరకు వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా బడుగుజీవులపై ‘ఆధార్’ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలందరూ తమ జాబ్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయాలని నిర్దేశించింది. ఈ నెల 15వ తేదీలోగా అనుసంధానం ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఉపాధికి-ఆధార్ లింకుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం కూలీలకు ఆందోళన కలిగిస్తోంది. అనుసంధానం కాకపోతే డబ్బులు రావని పథకం అధికారులు సూచనప్రాయంగా చెబుతుండటంతో బెంబేలెత్తుతున్నారు. చేసిన పనుల డబ్బుల కోసం నెలల తరబడి కాళ్లరిగేలా తిరుగుతుంటే... ప్రభుత్వం మళ్లీ కొత్త పద్ధతి పెట్టి ఇబ్బందుల పాల్జేయాలని చూస్తోందని కూలీలు మండిపడుతున్నారు.
యాచారంలో సగంమంది కూలీలకే...
మండలంలో 20గ్రామాల్లోని 925 శ్రమశక్తి సంఘాల్లో 18,708 మంది కూలీలు ఉన్నారు. అదే విధంగా వ్యక్తిగతంగా జాబ్‌కార్డులు పొందిన (పనులకు వెళ్లని) వారు మరో 18మంది వేల వరకూ కూలీలు ఉన్నా రు. శ్రమశక్తి సంఘాల్లో 14,849 మంది కూలీలు మాత్రమే తమ జాబ్‌కార్డులను, ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. రెండువేల మంది కూలీల అనుసంధానం రిజెక్ట్ కాగా, మరో రెండువేల మంది కూలీల వరకూ అనుసంధానం చేసుకోలేదు. అలాగే వ్యక్తిగత జాబ్‌కార్డులు పొందిన మరో 16వేల మంది కూలీలు కూడా ఆధార్ అనుసంధానం చేసుకోలేదు. మండలంలో మొత్తం 36వేల మందికి పైగా ఉన్న కూలీల్లో కేవలం సగంమందికి మాత్రమే జాబ్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ప్రభుత్వం తాజా ఉత్తర్వులతో కూలీల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. జాబ్‌కార్డులు ఆధార్‌తో అనుసంధానం కాకపోవడం వల్ల ఇక తమకు సకాలంలో డబ్బులు అందవన్న భయాందోళన మొదలైంది.
నత్తనడకన స్మార్ట్‌కార్డుల నమోదు
జాబ్‌కార్డులుండి ఆధార్ కార్డు అనుసంధానం జరిగినా తప్పనిసరిగా స్మార్ట్‌కార్డులు ఉంటేనే కమ్యూనిటీ సర్వీస్ ప్రొవైడర్ల (సీఎస్‌పీ) ద్వారా కూలీలు డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే యాక్సిస్ బ్యాంకు కూలీలకు డబ్బులు పంపిణీ చేసే సంస్థను మార్చింది. దీంతో పాత సంస్థ స్మార్ట్‌కార్డులు చెల్లకుండా పోయాయి. తాజాగా వచ్చిన మణిపాల్ సంస్థ కూలీలకు కొత్త స్మార్ట్‌కార్డులు అందజేసేందుకు ఉపక్రమించింది. అయితే ప్రక్రియ నత్తనడకన నడుస్తుండటంతో మండలంలోని 20 గ్రామాల్లో పనులు చేసుకోవడానికి అవకాశం ఉన్న 18,708 మంది కూలీల్లో నేటికీ సగంమందికి కూడా స్మార్ట్‌కార్డుల నమోదు పూర్తి కాలేదు.
ఉపాధికి ‘ఆధార్’ గండం!
Published Mon, Mar 3 2014 11:37 PM | Last Updated on Mon, Oct 8 2018 7:16 PM
Advertisement