నెల్లిమర్ల: ఉపాధిహామీ పథకంలో వందరోజుల నిబంధన కూలీలకు గుదిబండగా మారింది. ఒకే జాబ్‌కార్డులో ఉండే వేతనదారులంతా కలిసి ఆర్థిక సంవత్సరంలో వంద పనిదినాలు పూర్తిచేయడంతో వారికి అధికారులు పనులు నిలిపేశారు. ఈ విధంగా మండలంలోని 472 కుటుంబాలకు చెందిన సుమారు 1200మంది పనిలేక ఇబ్బంది పడుతున్నారు. రాబోయే రెండునెలల పాటు పనిలేకపోతే ఎలా బతకాలని వాపోతున్నారు. మండలంలోని 26పంచాయతీల్లో మొత్తం 8వేల జాబ్‌కార్డులున్నాయి. వీరికి సంబంధించి 15వేల మంది కూలీలు ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్నారు.
గత ఏప్రిల్ నెలనుంచి ఇప్పటివరకు 472 జాబ్‌కార్డులకు చెందిన కూలీలు వందరోజుల పని పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే ఆర్థిక సంవత్సరంలో వందరోజులు పని పూర్తిచేసుకున్నవారికి మరి పని కల్పించకూడదు. అందువల్ల వీరిని సోమవారంనుంచి పనులకు రానివ్వకుండా ఉపాధిహామీ అధికారులు నిలిపివేశారు. వారంతా లబోదిబోమంటున్నారు. వాస్తవానికి ఒక్కో జాబ్‌కార్డులో ముగ్గురేసి, నలుగురేసి కూలీలు ఉన్నారు. దీనివల్ల ఒక్కొక్కరు నెలరోజులు చేసినా వందరోజులు పూర్తయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలలుండగా ఇకపై తమకు ఉపాధి ఎలా అన్నదే ప్రశ్న. వేరే పనులకు వెళ్దామన్నా ప్రస్తుతం వ్యవసాయ పనులు కూడా లేవని వాపోతున్నారు.
ఉపాధికి నిబంధనాలా?
Published Fri, Feb 12 2016 1:26 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement