ఆరా తీస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే ఆశ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌సిటీ చుట్టూ ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములపై పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తమ సన్నిహితుల ద్వారా ఆయా గ్రామాల్లోని వ్యవసాయ పట్టా భూముల ధరలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వ్యవసాయానికి అనుకూలంగా, భూగర్భజలాలు పుష్కలంగా, ఎర్రటి నేలలున్న భూములను కొనుగోలు చేసి పెట్టాలని కోరుతున్నారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ యాచారం–కందుకూరు మండలాల సరిహద్దులో ఫ్యూచర్‌సిటీని నెలకొల్పడానికి సంకల్పించడం తెలిసిందే. కొంగరకలాన్ ఓఆర్‌ఆర్ నుంచి నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీకి 300 అడుగుల రోడ్డు, మెట్రోరైలు మార్గానికి పచ్చజెండా ఊపింది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనే భావనతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పెట్టుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో తమ సన్నిహితులతో కలిసి వ్యవసాయ భూములను పరిశీలిస్తున్నారు.
ఆ గ్రామాలపై ఫోకస్..
కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్‌పేట, ఆకులామైలారం, బెగరికంచె, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, దాసర్లపల్లి, లేముర్, గూడూర్, యాచారం మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, నందివనపర్తి, యాచారం, చౌదర్‌పల్లి, చింతుల్ల, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల, కొంగరకలాన్, మహేశ్వరం మండల పరిధిలోని రావిరాల, తుక్కగూడ తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌సిటీకి సమీపంలోని యాచారం, కందుకూరు గ్రామాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది.
చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు
ఫాంహౌస్‌లపై ఆసక్తి
యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. భూగర్భ జలాలకు ఢోకా లేదు. అందుకే ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించుకుంటే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో ఉంది. అత్యధికంగా 5 నుంచి 10 ఎకరాల్లోపే కొనుగోలు చేసేలా దృష్టి సారించారు.
ఫ్యూచర్‌సిటీపై భరోసాతో..
ఫ్యూచర్‌సిటీపై భరోసాతో సమీపంలోని గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలుకు కొంత మంది పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరైతే నేరుగా రైతులతోనే మాట్లాడుకుని వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు.
– ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రియల్ వ్యాపారి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment