నియోజకవర్గానికి 500 ఇళ్లు | 500 houses to be allocated for each constitution | Sakshi
Sakshi News home page

నియోజకవర్గానికి 500 ఇళ్లు

Published Fri, May 15 2015 5:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

నియోజకవర్గానికి 500 ఇళ్లు

నియోజకవర్గానికి 500 ఇళ్లు

* డబుల్ బెడ్రూం ఇళ్లపై సూత్రప్రాయ నిర్ణయం
* గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
* జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు
* సమగ్ర సర్వే వివరాల ఆధారంగా నిర్ధారణ.. సర్వేలో సొంతిల్లు లేదని పేర్కొన్న వారికే అవకాశం
* ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు మొండిచెయ్యే!

 
 సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంపై స్పష్టతనిచ్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. రాష్ర్టవ్యాప్తంగా గూడులేని పేద కుటుంబాలు లక్షల్లో ఉన్నప్పటికీ తొలుత నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లను నిర్మించాలని సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇంటి యూనిట్ ఖర్చు, నిర్మించాల్సిన వైశాల్యాన్ని ఇంకా ఖరారు చేయనప్పటికీ నియోజకవర్గాలవారీగా ఇళ్ల కేటాయింపుపై మాత్రం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. లబ్ధిదారుల గుర్తింపునకు గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెలలోనే ఈ కసరత్తు మొదలుకాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సమగ్ర కుటుంబ సర్వే వివరాల ఆధారంగా ఈ ప్రక్రియను చేపట్టనున్నారు.
 
 సొంతిల్లు లేనట్లుగా సమగ్ర కుటుంబ సర్వేలో వివరాలు నమోదు చేసుకున్న పేదలనే పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుని, పనుల ప్రారంభానికి ఎదురుచూస్తున్న వారు ఆశలు కొట్టేసుకోవాల్సిందేనని తేలిపోయింది. డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామసభల నిర్వహణ బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లలో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో భారీ వ్యయంతో కూడుకున్న డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో సర్కారు జాగ్రత్త వహిస్తోంది. గ్రామ సభల్లో ఒక్కో కుటుంబ వివరాలను పరిశీలించి సర్వేలో పేర్కొన్న విషయాలతో సరి చూసుకుని, దాన్ని నిర్ధారిస్తూ కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దీని ఆధారంగా ఇళ్ల కేటాయింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
 
 కాలనీలుగా నిర్మాణం..
 లబ్ధిదారు తనకున్న స్థలంలో ఇంటిని నిర్మించుకునే పాత పద్ధతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. లబ్ధిదారుకు ఉన్న స్థలంతో ప్రమేయం లేకుండా ప్రభుత్వమే ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని గుర్తించి అక్కడే ఇళ్లను ఓ కాలనీగా నిర్మిస్తుంది. నిర్మా ణ బాధ్యతను గృహనిర్మాణ శాఖకు ఇవ్వొద్దని ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికొచ్చింది. ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పద్ధతిలో ఇళ్లను నిర్మిస్తే ఖర్చు కలిసొస్తుందని భావిస్తున్న సర్కారు.. ఈ మేరకు నిర్మాణ సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలవాలని నిర్ణయించింది. ఈ బాధ్యతను కలెక్టర్లకే అప్పగించింది. అర్హులెందరో లెక్క తేలిన తర్వాత నిర్మాణదారులను ఆహ్వానిస్తూ టెండర్లను పిలవనున్నారు. ఈ నెలాఖరున మొదలుపెట్టే గ్రామసభల ద్వారా అర్హుల లెక్క తేలే అవకాశముంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ నిర్మిస్తున్న ఇళ్ల యూనిట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నందున  జిల్లాల్లో నిర్మించే ఇళ్ల విస్తీర్ణాన్ని తగ్గించాలని యోచిస్తోం ది. 425 చదరపు అడుగుల మేర ఉండేలా చూడాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement