రెవెన్యూలో స్థానిక అలజడి
♦ పనిచేసే చోట ఉండకపోతే ఇంటికే
♦ హెడ్‌క్వార్టర్‌లో లేకుంటే హెచ్‌ఆర్‌ఏ కట్
♦ తాజాగా మరో సర్క్యులర్ జారీ
♦ పద్ధతి మార్చుకోకపోతే చర్యలు
♦ ఉద్యోగవర్గాల్లో కలవరం
రెవెన్యూ యంత్రాంగాన్ని ‘స్థానిక నివాసం’ అంశం వణుకు పుట్టిస్తోంది. పనిచేసే కేంద్రంలో నివాసం ఉండాలనే నిబంధన కలవరపరుస్తోంది. సర్వీసు నియమావళి ప్రకారం స్థానికంగా ఉండాలనే నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందేనని తాజాగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య పరిణామంతో హైద రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగవర్గాల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మూడో వంతు మంది జంటనగరాల నుంచే వచ్చి వెళ్తున్నారు. దాదాపు ప్రతిశాఖలోనూ ఇదే తంతు కొనసాగుండడంతో ‘హెడ్‌క్వార్టర్ ’లో తప్పనిసరిగా ఉండాలనే ఆంక్షలు అమలు కావడంలేదు.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
హెడ్‌క్వార్టర్‌లో ఉండాల్సిందే
ఎక్కడ పనిచేసే వారు అక్కడే ఉండాలి. హెడ్‌క్వార్టర్‌లో నివసించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ అంశంపై ఇప్పటికే ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాం. పౌర సేవలు అందించడంలో కీలకంగా వ్యవహరించే వీఆర్‌ఓలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లోనే ఉండాలి. - ఆమ్రపాలి, జేసీ2
గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌ఓ) త మ క్లస్టర్ పరిధిలోని ఒక గ్రామాన్ని తమ నివాస కేంద్రంగా ప్రకటించాలి. ఈ సమాచారాన్ని తహసీల్దార్లకు అందించాలి. తహసీల్దార్ మొదలు ఆఫీస్ సబార్డినేట్ వరకు తమ నివాసానికి సంబంధించిన ల్యాండ్‌లైన్, మొబైల్ బిల్లులను పై అధికారులకు సమర్పించాలి. నివాస ధ్రువీకరణపత్రం పొందుపరచాలి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ యంత్రాంగం స్థానికంగా ఉండకపోవడంతో పౌరసేవలు సరిగా అందడంలేదని గుర్తించిన భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమాండ్ పీటర్ స్థానికంగా ఉండాలనే నిబంధనను తూ.చ.తప్పకుండా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనలను పాటించని సిబ్బందికి తాఖీదులు ఇవ్వాలని, తీరు మార్చుకోకపోతే హెచ్‌ఆర్‌ఏలో కోత పెట్టాలని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రవర్తన మారకపోతే సస్పెన్షన్ వేటు వేయాలని తేల్చిచెప్పారు.
తహసీల్ కార్యాలయాల ఉద్యోగులేకాకుండా.. వీఆర్‌ఓలకు కూడా ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆదేశించారు. అవినీతిని రూపుమాపాలంటే వీఆర్‌ఓలు కూడా స్థానికంగా ఉండాలని, వారికి కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించినందున.. వీఆర్‌ఓలు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని ఉత్తర్వులిచ్చారు.
రాజధాని నుంచే రాకపోకలు
రెవెన్యూ ఉద్యోగులు విధిగా హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని నిర్దేశిస్తూ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు వారం రోజుల క్రితం సర్క్యులర్ ఇచ్చారు. అయినప్పటికీ అధికశాతం ఉద్యోగులు ఇంకా హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు అంతర్గత పరిశీలనలో తేలింది. 37 మంది తహసీల్దార్లలో కేవలం నలుగురు మాత్రమే స్థానికంగా ఉంటున్నారని స్పష్టమైంది.
అలాగే వివిధ తహసీళ్లలో పనిచేసే 111 జూనియర్ అసిసెంట్లు, 60 మంది ఆర్‌ఐ, సీనియర్ అసిసెంట్లు, 55 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 434 మంది వీఆర్‌ఓలు పనిచేసే చోట నివసించడం లేదని వె ల్లడైంది. ఆఖరికి ఆఫీస్ సబార్డినేట్లు కూడా మండల కేంద్రాల్లో ఉండడంలేదని తేలింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండని అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరోసారి స్థానికతను గుర్తు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా బుధవారం తహసీల్దార్లకు మరో సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించింది.
వాస్తవానికి రాజధాని చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఉద్యోగులు పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలుచేయడం జిల్లాలో ఆచరణసాధ్యం కాదని ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. జిల్లాకే హెడ్‌క్వార్టర్‌లేనప్పుడు మమ్ముల్ని పనిచేసే కేంద్రంలోనే ఉండమనడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, విద్య, సంక్షేమశాఖలకు వర్తింపజేయని హెడ్‌క్వార్టర్ నిబంధనలు తమపై రుద్దడమేమిటనీ రెవెన్యూ వర్గాలు మండిపడుతున్నాయి. అన్ని శాఖలకు ఈ నియమావళి అమలు చేస్తే బాగుంటుంది తప్ప.. తమకే వర్తింపజేయడం సరికాదని, దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.