నోట్ల రద్దు నిబంధనలకు విరుద్ధం
• సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ
• తదుపరి విచారణ నేటికి వారుుదా
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు, తదనుగుణంగా కేంద్రం తీసుకున్న చర్యలు ఆర్‌బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధమని సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. ‘‘ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 26 (2) కింద పెద్ద నోట్లను రద్దు చేశారు. కానీ ఇలా రద్దు చేసే అధికారం కేంద్రానికి లేదు. ఈ సెక్షన్ కింద ఓ సిరీస్, డినామినేషన్ నోట్లను మాత్రమే రద్దు చేయడానికి వీలుంటుంది. కేంద్రం అన్ని సిరీస్ నోట్లనూ రద్దు చేసింది. ఇది చట్ట విరుద్ధం. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ఉన్న ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోండి’’ అని కోర్టును కోరారు. రూ.1000, రూ.500 నోట్ల రద్దు నోటిఫికేషన్‌ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సుక్కా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది.
పిటిషనర్ తరఫున వెంకటరమణ వాదనలు వినిపించారు. ‘‘పెద్ద నోట్ల రద్దు వల్ల ప్రజలందరూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనులన్నీ మానుకుని ఉదయం నుంచి క్యూలలో నిలబడుతున్నారు. అరుునా వారికి నగదు అందడం లేదు. ప్రతి చోటా కొత్తగా రూ.2 వేల నోటే ఇస్తున్నారు. రూ.1000, రూ.500 నోట్లు లేక, చిల్లర దొరక్క అంతా ఇబ్బందుల పాలవుతున్నారు. వ్యాపారులు దారుణంగా నష్టపోతున్నారు. రద్దు చేసిన నోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు మాత్రమే కేంద్రం గడువిచ్చింది. నల్లధనాన్ని అరికట్టేందుకు రూ.1000 నోట్లను రద్దు చేశామన్న కేంద్రం, రూ.2 వేల నోటును ఎందుకు తేవాల్సి వచ్చిందో చెప్పడం లేదు. పౌరులకున్న సొమ్మును పొదుపు చేసుకునే, దాచుకునే హక్కును కేంద్రం హరించింది’’ అని వాదించారు. అనంతరం విచారణ శుక్రవారానికి వారుుదా పడింది.