సర్కారీ జాగా.. అక్రమార్కుల పాగా! | TIIC, forest places regulation | Sakshi
Sakshi News home page

సర్కారీ జాగా.. అక్రమార్కుల పాగా!

Published Sat, May 16 2015 2:01 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

సర్కారీ జాగా.. అక్రమార్కుల పాగా! - Sakshi

సర్కారీ జాగా.. అక్రమార్కుల పాగా!

వివిధ సంస్థలకు కట్టబెట్టిన సర్కారీ స్థలాల్లో వెలసిన కట్టడాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పారిశ్రామిక, అటవీ, విద్యా, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలాచోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఈ ఆక్రమణదారులంతా జీఓ 58 కింద తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీలున్నంత వరకు స్థలాల క్రమబద్ధీకరణపై ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేయడంతో.. చెరువులు, శ్మశానవాటిక, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములను కూడా రెగ్యులరైజ్‌చేసే కోణంలో రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.

టీఐఐసీ, అటవీ స్థలాల క్రమబద్ధీకరణ
జంట జిల్లాల్లో 13 వేల దరఖాస్తుల పరిశీలన
ఆమోదానికి అత్యున్నతస్థాయి కమిటీ  
శిఖం భూములపై ఆచీతూచీ అడుగు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరింత పట్టువిడుపుగా వ్యవహరించనుంది. వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాల్లో వెలిసిన నిర్మాణాలను కూడా ఆయా శాఖల సమ్మతితో క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలి స్తోంది. ఫలితంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 13,417 దరఖాస్తులకు మోక్షం కలిగించే  అంశంపై భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) నేతృత్వంలోని కమిటీ కుస్తీ పడుతోంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 6,692 దరఖాస్తులు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,725 దరఖాస్తులు ఉన్నాయి.

పారిశ్రామిక, ప్రజావసరాల కోసం ఆయా శాఖలకు ప్రభుత్వం స్థలాలను కేటాయియించింది. ఈ స్థలాల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కొన్నిచోట్ల అవసరానికి మించి స్థలం కట్టబెట్టడంతో ఆ జాగాలను పరిరక్షించడంలో ఆయా శాఖలు చేతులెత్తేశాయి. ఫలితంగా ఈ స్థలాలు కాస్తా బస్తీలుగా అవతరించాయి. ఈ బస్తీదారులంతా ఇప్పుడు ఉచితకేటగిరీ (58 జీఓ) కింద తమ ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుతానికి అర్జీలు పెట్టుకున్నారు.

ఉదాహరణకు.. బాలానగర్ మండలం అల్లావుద్దీన్ కుట్టి కాలనీ స్థలాన్ని గతంలో టీఐఐసీకి బదలాయించారు. దశాబ్ధాల క్రితమే పారిశ్రామిక అవసరాల కోసం ఈ భూమని టీఐఐసీకి కేటాయించారు. అయితే, ఈ స్థలసేకరణలో ఆ సంస్థ నిర్లిప్తంగా వ్యవహరించింది. దీనికితోడు అప్పటికే ఆ ప్రాంతంలో కాలనీ ఉండడంతో వారిని ఖాళీ చేయించే సాహసం చే యలేకపోయింది.

ఈ క్రమంలోనే అల్లావుద్దీన్ కుట్టీలో నివసిస్తున్న 355 మంది తమ ఇళ్లను రెగ్యులరైజ్ చేయమని రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎలాగూ ఈ స్థలాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యంకాదు కనుక.. టీఐఐసీ సమ్మతితో ఈ స్థలాలను క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇలా ప్రతి శాఖ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని స్థలాల క్రమబద్ధీకరణకు ముందడుగు వేయాలని భావిస్తోంది.
 
శిఖం స్థలాలకు వెనుకడుగు!
శిఖం భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్థలాల క్రమబద్ధీకరణ జోలికి వెళితే న్యాయపరమైన చిక్కులు తప్పవని స్పష్టం కావడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉన్న చెరువులు నగరీకరణ నేపథ్యంలో కనుమరుగు కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వరదనీటి ప్రవాహం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శిఖం/ఎఫ్‌టీఎల్‌లో వెలిసిన నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవాలని భావించింది.

ఇందులోభాగంగా జిల్లాలో దాదాపు 8,887 దరఖాస్తులకు మోక్షం కలిగించే దిశగా ఆలోచించింది. శిఖం భూములపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పలు సందర్భాల్లో న్యాయస్థానాలు స్పష్టం చేసిన అభిప్రాయాలను గమనంలోకి తీసుకున్న సర్కారు.. వీటిని పక్కనపెట్టడమే మేలనే అభిప్రాయానికి  వచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement