సిద్దిపేట మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ప్రభుత్వ భూములను కాపాడేందుకు రెవెన్యూ యంత్రాంగం కార్యరంగంలోకి దిగింది. పట్టణంలో వేర్వేరు చోట్ల ఉన్న 42 ఎకరాల స్థలాలను పరిరక్షించేందుకు పంచాయతీరాజ్ శాఖకు రూ.30 లక్షలు మంజూరు కావడంతో సర్కార్ జాగాల చుట్టూ కంచె నిర్మాణాలకు అధికార యంత్రాంగం పూనుకుంది. సిద్దిపేట తహశీల్దార్ ఎన్‌వై గిరి ఆధ్వర్యంలో అధికారులు హౌసింగ్ బోర్డు కాలనీలోని సర్వే నంబర్ 1340లో ఉన్న 5 ఎకరాల 10 గుంటల భూమికి కంచె ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సంగతి తెలుసుకున్న స్థానిక దళితులు అధికారులను అడ్డుకున్నారు.
ఈ భూములకు సంబంధించిన పట్టాలు తమ వద్ద ఉన్నాయంటూ దళితులు వాగ్వాదానికి దిగారు. పదేళ్ల క్రితమే ప్రభుత్వం ఈ భూములను స్వాధీనం చేసుకుందని అధికారులు చెప్పడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కిందటే భూములు స్వాధీనం చేసుకుంటే 2007లో నోటీసులు ఎలా జారీ చేశారంటూ ప్రశ్నించారు. ఓ దశలో అధికారులకు, స్థానిక దళితులకు మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో అధికారులు పోలీసుల సాయం కోరారు. వెంటనే సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఆందోళనకు దిగిన వారిని స్టేషన్‌కు తరలించారు.
దీంతో ఆగ్రహించిన మిగతా దళితులు పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్‌ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామంటూ నినాదాలు చేశారు. దీంతో తహశీల్దార్ గిరి ఫోన్‌లో వారితో మాట్లాడి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ వారు ట్యాంక్ దిగిరాకపోవడంతో ఆర్డీఓ ముత్యంరెడ్డికి ఫోన్ చేసి విషయం తెలిపారు. ఆయన సూచన మేరకు పనులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం దళితులతో మాట్లాడిన తహశీల్దార్ పట్టాలు తీసుకుని వస్తే సమస్య పరిష్కరిస్తామని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సందర్భంగా దళిత సంఘ నాయకులు బత్తుల చంద్రం, బొమ్మల యాదగిరి మాట్లాడుతూ, గతంలో ఎంతో మంది అధికారులు వచ్చి ఎన్నో స్థలాలకు నోటీసులు జారీ చేసిన సందర్భాలున్నాయన్నారు. కానీ సిద్దిపేట అధికారులు వ్యవహరించినట్లుగా ఎవరూ వ్యవహరించలేదన్నారు. అగ్రవర్ణాలతో చేతులు కలిపి దళితుల భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. గతంలో సర్వే నంబరు 1906 ఫైర్ స్టేషన్ పక్కన గల 1-20 గుంటల భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించినా అగ్రవర్ణాల చేతుల్లో ఉన్న ఆ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో తెలపాలన్నారు. అక్కడ చూపించని దౌర్జన్యం ఇక్కడ దళితులపై ఎందుకు చూపించాల్సి వస్తుందన్నారు.
అవి మా పట్టా భూములు
అధికారులు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న భూములపై మాకే హక్కులున్నాయి. ఆ జాగాల పట్టాలు మావద్ద ఉన్నాయి. వాటిపైనే ఎంతో ఆశలు పెట్టుకుని బతుకుతున్నాం. అలాంటిది మా స్థలాలను లాక్కుంటామంటే ఎలా ఊరుకుంటాం.
-స్థానిక దళితులు
అవి ప్రభుత్వ భూములే
తాము కంచె ఏర్పాటు చేస్తున్న స్థలాలు ముమ్మాటికి ప్రభుత్వ భూములే. 1976లో కొందరికి పట్టాలు ఇచ్చినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా వారు వాటిని వినియోగిస్తుండడంతో బదలాయింపు నిషేధ చట్టాన్ని ప్రయోగించి పదేళ్ల కిందటే స్వాధీనం చేసుకున్నాం. ఆ మేరకు అప్పట్లోనే నోటీసులు జారీ చేశాం.
-ఎన్‌వై గిరి, తహశీల్దార్