గొంతెండుతోంది
మున్సిపాలిటీల్లో తాగునీటికి కటకట డేంజర్ జోన్లో 44 పట్టణాలు
సాక్షి, హైదరాబాద్: మనకూ లాతూర్ పరిస్థితి రాబోతోందా..? గుక్కెడు నీటి కోసం రైలు ద్వారా నీళ్లు తెప్పించుకోవాల్సిన దుస్థితి ముంచుకురానుందా..? క్షేత్రస్థాయిలో వాస్తవాలు చూస్తుంటే ఆ పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేద నిపిస్తోంది. ఒకటికాదు రెండు కాదు.. రాష్ట్రంలో 44 పట్టణాలు, వందల సంఖ్యలో గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కోబోతున్నాయి. మరో నెలన్నర తర్వాత ఈ పట్టణాలకు నీటి సరఫరా పూర్తిగా బంద్ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. నీటి వనరులు ఎక్కడికక్కడ అడుగంటిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తనుంది.
పట్టణ నీటి సరఫరా స్థితిగతులపై రాష్ట్ర పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం తాజాగా రూపొం దించిన నివేదిక ఈ మేరకు స్పష్టంచేసింది. గ్రేటర్ హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రంలో 67 నగరాలు, పట్టణాలుండగా... అందులో 44 పట్టణాలు డేంజర్ జోన్‌లో కొట్టుమిట్టాడుతున్నాయి. మిగతా చోట్ల కూడా అరకొరగానే నీటి వనరులున్నాయి. ఈ 44 పట్టణాలకు అతికష్టంగా మరో 45 రోజులు, ఆ లోపు మాత్రమే నీటిసరఫరా కొనసాగించే పరిస్థితి ఉందని నివేదిక పేర్కొంది. అతికష్టంగా ఏప్రిల్ నెల గడిచిపోయినా మే నెలలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీటి గండాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
వేసవిపై రెండేళ్ల కరువు ప్రభావం
వరుసగా రెండేళ్లపాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దాని ప్రభావం ఈ వేసవిపై తీవ్రంగా పడింది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదులు తడారిపోయి ఎడారులను తలపిస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, దిగువ మానేరు, నిజాంసాగర్ జలాశయాల అడుగున ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలూ భానుడి భగభగలకు వేగంగా ఆవిరైపోతున్నాయి. ఎస్సారెస్పీ, సింగూరు, మంజీర, జూరాల, రామన్‌పాడు జలాశయాలు ఎండిపోవడంతో వీటిపై ఆధారపడిన పట్టణాలు, పల్లెలకు నీటి సరఫరా ఆగిపోయింది. దీంతో బోరుబావులు, ట్యాంకర్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
భూగర్భ జలాలే దిక్కు: రాష్ట్రంలో ఇప్పటికే అనేక పట్టణాలు తాగునీటికి అల్లాడుతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి చేరుకోవడంతో బోర్లు కూడా ఎండిపోతున్నాయి. డేంజర్ జోన్‌లో ఉన్న 44 పట్టణాలకు భూగర్భ జలాలే దిక్కు. అయితే భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోతుండడంతో చేతి పంపులు, బోర్లు ఎండిపోతున్నాయి. 67 పురపాలికల్లో 4,853 పవర్ బోర్లు ఉండగా, 608 బోర్లు ఇప్పటికే ఎండిపోయాయి. ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన బోరుబావుల లోతు పెంచాలని, కొత్త బోర్ల తవ్వకాలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించిం ది.
అవసరమైతే ప్రైవేటు బోరు బావులను అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేయాలంది. అయితే పురపాలికల వద్ద ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లకు కావాల్సిన నిధుల్లేవు. విపత్తుల నివారణ నిధి కింద ప్రభుత్వం 67 మున్సిపాలిటీలకు రూ.36.38 కోట్లు విడుదల చేసినా అవి ఇప్పటికే ఖర్చయిపోయాయి. అదనంగా మరో రూ.64.61 కోట్లు మంజూరు చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నిధులు విడుదల కాలేదు. దీంతో మున్సిపాలిటీలు తమ సాధారణ నిధుల నుంచి ఖర్చు చేసి నీటి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకోవాలని పురపాలక శాఖ ఆదేశించింది.
ఆ 44 పట్టణాలివే..
కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, మణుగూరు, సత్తుపల్లి, ఇల్లందు, సదాశివపేట, జహీరాబాద్, మెదక్, ఆర్మూర్, తాండూరు, నారాయణపేట మున్సిపాలిటీలు తాగునీటి పరంగా డేంజర్‌జోన్‌లో ఉన్నాయి. హుస్నాబాద్, హుజూరాబాద్, వేములవాడ, జమ్మికుంట, పెద్దపల్లి, పరకాల, భూపాలపల్లి, మహబూబాబాద్, నర్సంపేట, మధిర, హుజూర్‌నగర్, కోదాడ, మేడ్చెల్, నాగర్ కర్నూల్, షాద్‌నగర్‌లు కూడా ఇదే జాబితాలో ఉన్నాయి. నిర్మల్, మందమర్రి, సిరిసిల్ల, కొల్లాపూర్, ఐజా, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి, దేవరకొండ, బడంగ్‌పేట, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్‌పేట, గద్వాల్, ఖమ్మం పట్టణాల్లో కాస్త మెరుగ్గా ఉంది. ఇక్కడ 45 నుంచి 90 రోజుల వరకు నీటి సరఫరా కొనసాగనుంది.