సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశలో గ్రామీణ ప్రాంత పనులే జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో జరగనున్న పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులను ప్రారంభించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేసారి పనులు చేపడితే ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. పట్టణ శివార్ల వరకు ప్రాజెక్టు పనులన్నీ ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలోనే జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.
ఆర్‌డబ్ల్యూఎస్ పట్టణాల శివార్ల వరకు ప్రధాన పైప్‌లైన్లు వేస్తే, మునిసిపాలిటీలు అక్కడి నుంచి నీటిని తరలించుకుని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను 26 ప్యాకేజీలుగా విభజించి 11 ప్యాకేజీల పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 15 ప్యాకేజీలకూ టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతోంది.
ఈ పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే పట్టణ ప్రాంతాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల అనుసంధానం పూర్తయిన తర్వాతే పట్టణాల్లో సర్వీసు రిజర్వాయర్లు, క్లియర్ వాటర్ ఫీడర్ మెయిన్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, ఇంటింటికి నల్లా కనెక్షన్ తదితర పనులను చేపట్టనున్నారు.
2035 అవసరాలకు తగ్గట్లు..
వాటర్‌గ్రిడ్ కింద పట్టణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలనపర అనుమతులు రాలేదు. జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మునిసిపాలిటీల్లో ఇంటింటికి నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్లతో పనులు చేయాల్సి ఉందని పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. 2035 సంవత్సరం నాటికి పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్లు తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులతో పనులను చేపట్టనుంది. ఈ ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు హడ్కో నుంచి రుణం అందిన తర్వాతే ఈ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మలి దశలో పట్టణ వాటర్‌గ్రిడ్
Published Thu, Aug 6 2015 1:49 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
Advertisement
Advertisement