మున్సిపోల్స్‌కు కసరత్తు
Published Mon, Oct 28 2013 2:01 AM | Last Updated on Tue, Oct 16 2018 6:47 PM
అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్ :మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తయిన అనంతరం మున్సిపోల్స్ ప్రక్రియ చేపట్టాలని భావించింది. అయితే వెంటనే రాష్ర్ట విభజన ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం.. సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడిన నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అడుగు ముందుకు పడలేదు. ఉద్యోగ సంఘాల సమ్మె విరమణతో ప్రస్తుతం రాష్ర్టంలో పరిస్థితి మెరుగుపడిందని భావిస్తున్న సర్కారు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పాలవర్గం గడువు 2009 సెప్టెంబరు 30తో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికల ఊసెత్తని ప్రభుత్వం ఈ ఏడాది సెప్టెంబరులో నిర్వహించాలని యోచిస్తోంది. దీనిపై ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. పురపాలకసంఘాల్లోని ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ తదితర వివరాలను కోరింది. నవంబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబరులో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు.
వివరాలు అందజేయాలని ఆదేశం..
జిల్లాలోని 12 పురపాలక సంఘాలతోపాటు గుంటూరు నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఓటర్ల జాబితాలు, సామాజిక, ఆర్థిక కులగణన, రిజర్వేషన్లు తదితర వివరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాల అధికారులను ఆదేశించింది. అదేవిధంగా జిల్లాలో రెండు మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. వార్డుల పునర్విభజన పూర్తిచేశారు. ఈ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఆధారంగా వార్డు రిజర్వేషన్లను ప్రకటించారు. గుంటూరు నగరపాలకసంస్థ వార్డుల పునర్విభజనపై హైకోర్టు ఆదేశాల ప్రకారం వార్డుల పునర్విభజన నోటిఫికేషన్ మరోసారి ఇవ్వాల్సి ఉంది. ప్రజలు, రాజకీయపార్టీల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ ఆమోదంతో వార్డుల రిజర్వేషన్లు ప్రకటించాల్సి ఉంది.
తొలిసారిగా తాడేపల్లికి ఎన్నికలు..
జిల్లాలో ఈసారి కొత్తగా ఏర్పడిన తాడేపల్లి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. పిడుగురాళ్ళ, సత్తెనపల్లి మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను పెంచారు. తెనాలి మున్సిపాలిటీల్లో అత్యధికంగా 40 వార్డులు ఉండగా, నరసరరావుపేట 34, బాపట్ల 34, చిలకలూరిపేట 34, మంగళగిరి 32, పొన్నూరు 31, వినుకొండ 26, పిడుగురాళ్ల 30, సత్తెనపల్లి 30, మాచర్ల 29, రేపల్లె 28, తాడేపల్లిలో 23 వార్డులు ఉన్నాయి.
సాధ్యాసాధ్యాలపై చర్చ..
ప్రభుత్వం పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అందుకు సహకరిస్తాయా లేదా అన్న మీమాంస అధికారుల్లో, ప్రజాప్రతినిధుల్లో నెలకొంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీఎన్జీఓలు భాగస్వాములు కావడంతో పాటు తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చే అవకాశం ఉందంటూ కేంద్రం ప్రకటించింది. బిల్లు అసెంబ్లీకి వస్తే సమ్మెకు దిగుతామని ఎన్జీవోలు ప్రకటించారు. ఈ పరిణామాల మధ్య మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అన్న చర్చ అధికారుల మధ్య సాగుతోంది.
Advertisement