ఈనెల 9వ తేదీన మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని యూనివర్సల్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న రేంజ్ ఐజీ గోపాలరావు తదితరులు
గుంటూరు: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్టు నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం ఎస్‌ఐ పోస్టులకు నిర్వహిస్తున్న రాత పరీక్షలకు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన మొత్తం 26,846 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోలీస్‌శాఖలో ఎస్‌ఐ, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 16న గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల్లో ఒకేరోజున రెండు పేపర్లలో పరీక్ష జరుగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు మొదటి పేపరు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు రెండవ పేపరులో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 30 ప్రాంతాల్లో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరమైన ఏర్పాట్లు చేసి పరీక్ష నిర్వహణకు సిద్ధం చేశారు. మొత్తం 10 రూట్లుగా విభజించి ప్రతి రూట్‌కు ఓ డీఎస్పీని ఇన్‌చార్జిగా కేటాయించారు. స్థానిక పోలీసులకు సూచనలు ఇస్తూ అభ్యర్థుల రాకపోకల సమయంలో ఎలాంటి అసౌకర్యం లేకుండా పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు విధిగా ఉదయం 9 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఐజీ ఇప్పటికే సూచించారు.
పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇలా...
ఉదయం 9 గంటలకు అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకుంటే ముందుగా వారి చేత కొన్ని ధ్రువపత్రాలను పూర్తి చేయిస్తారు. వారి వద్ద బాల్‌పెన్, హాల్‌టిక్కెట్, గుర్తింపు(ఆధార్, రేషన్, ఓటరు కార్డులలో ఏదైనా ఒకటి) కార్డులను తనిఖీ చేస్తారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడే అవకాశం ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులను గుర్తించేందుకు మెటల్ డిటెక్టర్ ద్వారా పురుష, మహిళ అభ్యర్థులను విడివిడిగా తనిఖీ చేస్తారు.పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఉండే జిరాక్స్ సెంటర్లను మూపివేయిస్తారు. బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను స్వీకరించిన అనంతరం లోపలకు అనుమతిస్తారు. ఈ తతంగం పూర్తి కావడానికి అరగంట సమయం పడుతుంది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లాక ఓఎంఆర్ షీట్‌లో వివరాలను తప్పనిసరిగా అభ్యర్ధులు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి పరీక్షా కేంద్రంలోకి వెళ్లాక మళ్లీ సమయం పూర్తయిన తర్వాతనే బయటకు పంపుతారు. అభ్యర్ధుల సౌకర్యం కోసం హాల్ టికెట్‌లు అందనివారు ఈనెల 14వ తేదీ సాయంత్రం లోపుగా ఠీఠీఠీ. ట pటb. ్చp. జౌఠి. జీn వెబ్‌సైట్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
లంచ్ అవర్‌లో...
మధ్యాహ్నం ఒంటిగంటకు పరీక్ష పూర్తయిన అనంతరం బయటకు వచ్చేందుకు అనుమతిస్తారు. పరీక్షా కేంద్రంలో క్యాంటిన్ ఉంటే అక్కడ భోజనం చేసే అవకాశం ఉంటుంది. క్యాంటిన్ లేని పరీక్షా కేంద్రం సమీపంలో ఉంటే బయటకు వచ్చి భోజనం చేయవచ్చు. లేకుంటే అభ్యర్థుల వెంట వచ్చే వారు విధిగా భోజనం తీసుకువచ్చి సిద్ధంగా ఉంచితే సమయం వృథా కాకుండా మధ్యాహ్నం జరిగే పరీక్షకు సిద్ధం కావడానికి సమయం ఉంటుంది.
బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో...
గుంటూరు జిల్లాకు చెందిన వారే కాకుండా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అభ్యర్థులు కూడా ఎస్‌ఐ రాత పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయా జిల్లాల అభ్యర్థులు ఇబ్బంది పడకుండా వారికి కళాశాల అడ్రస్‌లు, అటువైపు వెళ్లే బస్సుల వివరాలు, పరీక్షా కేంద్రానికి చేరుకునే విధానం తెలియచేసేందుకు ప్రత్యేకంగా హెల్ప్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ విధుల్లో ఉండే సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. ఆయా మార్గాల్లో రోడ్డుపై విధుల్లో ఉండే సిబ్బంది, అధికారుల సలహాలు తీసుకుని గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. అదే రోజున హడావుడిగా రిస్క్ తీసుకునేకంటే ముందు రోజే కేటాయించిన పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందీ, అక్కడకు చేరుకునే విధానం, తదితర విషయాలను తెలుసుకుంటే ఉదయాన్నే సునాయాసంగా వెళ్లవచ్చని ఐజీ కేవీవీ గోపాలరావు సూచిస్తున్నారు.
విలువైన వస్తువులు లేకుండా...
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వారి వెంట మరో వ్యక్తిని వెంట తీసుకురావడం మంచిది. లేకుంటే విలువైన వస్తువులను ఇంటివద్దనే పెట్టి రావాలి. క్యాలిక్యులేటర్, డిజిటల్ వాచ్, నోటు పుస్తకాలు, బ్యాగులు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించరు.
Comments
Please login to add a commentAdd a comment